16 November 2014
Hyderabad
'లౌక్యం' విజయానికి టీమ్ వర్కే కారణం
''ఇంతకాలం నేను లౌక్యంగా మాట్లాడకుండా గడిపాను. కానీ, ఈ చిత్రం చూసిన తర్వాత మాట్లాడక తప్పడంలేదు. గోపీచంద్ ఫస్ట్ టైమ్ ఎంటర్ టైన్ మెంట్ చేసి, అదరగొట్టాడు. రకుల్ అందాలు ఆరబోసింది. నా ప్రియశిష్యులు కోన వెంకట్, గోపీ మోహన్ వినోదానికి మారుపేరుగా నిలిచారు. నా 'అన్నమయ్య' సినిమాకి పని చేసిన శ్రీవాస్ చాలా బాగా డైరెక్ట్ చేశడు'' అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు.
గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన 'లౌక్యం' చిత్రం 50 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్లో అర్ధశతదినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాఘవేంద్రరావు చిత్రబృందానికి, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు షీల్డులు అందజేశారు.
ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ - ''ఈ రోజుల్లో 50 రోజుల పండగ అనేది చాలా అరుదైపోయింది. ఇలాంటివి మరిన్ని జరగాలి'' అన్నారు.
గోపీచంద్ మాట్లాడుతూ - ''ఈ సినిమా తెరకెక్కడానికి ప్రధాన కారకుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నేరవి. శ్రీధర్ సీపాన కథ, కోన వెంకట్, గోపీమోహన్ స్ర్కీన్ ప్లే ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. నిర్మాత ఆనందప్రసాద్ నన్ను నమ్మి, పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. శ్రీవాస్ చాలా లౌక్యంగా ఈ సినిమా తీశాడు'' అని తెలిపారు.
మంచి టీమ్ వర్క్ తో ఈ చిత్రం చేశామని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.
ఆనందప్రసాద్ మాట్లాడుతూ - ''మా సంస్థలో ఇది ఐదో సినిమా. ఈ కథపై ఏడాదిన్నర కసరత్తులు చేశాం. గోపీచంద్ కి ఇది సొంత సంస్థలాంటిది. విదేశాల్లో తీసిన మూడు పాటలకు గోపీచంద్ తానే నిర్మాతలా, ప్రొడక్షన్ మేనేజర్ లా శ్రమించారు. ఆయనకు నా ధన్యవాదాలు'' అని చెప్పారు.
శ్రీవాస్ మాట్లాడుతూ - ''రాఘవేంద్రరావుగారు నాకు ఫోన్ చేసి, హీరోయిన్ ని చాలా బాగా చూపించావని ప్రశంసించారు. సినిమా విడుదలైన వెంటనే దాసరిగారు అభినందిస్తూ, మా యూనిట్ అందరికీ బొకేలు పంపించారు'' అని చెప్పారు.
కోన వెంకట్ మాట్లాడుతూ - ''ఈ సినిమాతో నేను, శ్రీవాస్, శ్రీధర్ సీపాన.. ముగ్గురూ పంపిణీదారులయ్యాం. ఈ సినిమా విజయానికి టీమ్ వర్కే కారణం'' అన్నారు.
ఈ వేడుకలో శ్రీధర్ సీపాన, అనూప్ రూబెన్స్, సంపత్, భరత్ రెడ్డి, ప్రగతి, కాశీ విశ్వనాథ్, పృథ్వీ, 'అదుర్స్' రఘు, గోపీమోహన్, వివేక్, రామచంద్ర, శ్యామల, అన్నేరవి, గిరి తదితరులు పాల్గొన్నారు.