దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం `చెలియా`. కార్తీ, అదితిరావ్ హైదరీ జంటగా నటించిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకుడు. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మణిరత్నం, ఎ.ఆర్.రెహమాన్, సీతారామశాస్త్రి, వంశీపైడిపల్లి, సుహాసిని, కార్తీ, అదితిరావ్ హైదరీ తదితరులు పాల్గొన్నారు. ఆడియో సీడీలను సీతారామశాస్త్రి విడుదల చేసి తొలి సీడీని ఎ.ఆర్.రెహమాన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా...
మణిరత్నం మాట్లాడుతూ - ``చెలియా సినిమాను ఏర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించాను. రెగ్యులర్‌గా కనపడే కార్తీ ఇందులో కనపించడు. అలాగే అందమైన అదితిరావ్ హైదరీ జంటగా నటించారు. ఈ సినిమా మ్యూజిక్ తెలుగులో ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం ఎ.ఆర్.రెహమాన్‌గారు, సీతారామశాస్త్రిగారు. ఇద్దరికీ స్పెషల్ థాంక్స్. దిల్‌రాజుగారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయనకు, ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ సినిమాను దిల్‌రాజుగారు ఆయన బ్యానర్‌లో రిలీజ్ చేస్తుండటం మాకెంతో నమ్మకాన్ని కలిగిస్తుంది. అందరి సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాం`` అన్నారు.
సుహాసిని మాట్లాడుతూ - ``మణిరత్నంగారి సినిమాలకు నేనే బెస్ట్ క్రిటిక్‌ను. నీకు రాయడం వచ్చా అని విమర్శిస్తూ ఉంటాను. నేను విమర్శించినా ప్రేక్షకులు ఆయన సినిమాలను ఆదరిస్తుంటారు. మరోసారి మణిరత్నంగారు లవ్‌స్టోరీనే డైరెక్ట్ చేశారు. ప్రేమ కథనే ఎందుకు తీశారో నాకు తెలియడం లేదు. సాధారణంగా మణిరత్నంగారు ఆయన సినిమాల్లో క్యారెక్టర్స్‌ను డామినేట్ చేస్తుంటారు. కానీ ఈ సినిమాలో కార్తీ, అదితిరావు మణిరత్నంగారిని డామినేట్ చేసేశారు. మణిరత్నంగారు పెట్టిన పరీక్షలన్నీ వారు పాస్ అయ్యారు. అదితి చాలా చక్కగా నటించింది. నా ఇన్నేళ్ళ ఎక్స్‌పీరియెన్స్‌లో అదితి అంత అందంగా నటించే హీరోయిన్‌ను చూడలేదు. ఇక దిల్‌రాజుగారికి మా సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆయనకు ఆ దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాం. ఆయన ఈ సినిమాను విడుదల చేస్తుండటం మాకెంతో భరోసానిస్తుంది`` అన్నారు.
ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ - ``మణిరత్నంగారు నా బ్రదర్, స్నేహితుడు. మా ఇద్దరిదీ 25 యేళ్ళ జర్నీ. తెలుగు పాటలంటే నాకు చాలా ఇష్టం. భాషలోని గొప్పతనమే అందుకు కారణమేమోననిపిస్తుంది. ఇక బాహుబలితో తెలుగు సినిమా స్థాయి ప్రపంచస్థాయికి చేరుకుంది`` అన్నారు.
కార్తీ మాట్లాడుతూ - ``చెలియా నాకు స్పెషల్ మూవీ. ఎందుకంటే నేను ఏ స్కూల్‌లో అయితే సినిమా గురించి తెలుసుకున్నానో అదే స్కూల్‌లో యాక్టింగ్ గురించి తెలుసుకున్నాను. నాకు ఛాలెంజింగ్ క్యారెక్టర్. అన్నయ్య సూర్య లాంటివాడు చేయాల్సిన క్యారెక్టర్ అని కూడా మణిరత్నంగారికి చెప్పాను. ఫైటర్ ఫైలైట్ క్యారెక్టర్ అని చదివి తెలుసుకున్నాను. కానీ నాకు ముందుగా పెద్దగా అర్థం కాలేదు. ఎప్పుడైతే నేను ఫైటర్ పైలట్ ట్రయినింగ్ క్లాసులకు వెళ్ళానో అప్పుడు క్యారెక్టర్ గురించి నాకు అర్థమైంది. ఫైటర్ పైలట్స్ ఎంత గొప్పవారో నాకు తెలిసింది. ఈ సినిమాలో నటించడం డిఫరెంట్ జర్నీ. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నా మొదటి సినిమా చేసినప్పుడు నేను పీలయ్యానో, ఈ సినిమా చేసినప్పుడు అలాగే ఫీలయ్యాను. రెండు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మధ్య జరిగే కథ. నాలాగే ఆడియెన్స్‌కు కూడా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. రెహమాన్‌గారి మ్యూజిక్ విన్నప్పుడల్లా ఓ ఎనర్జి వస్తుంటుంది. ఆ మ్యూజిక్‌లో నేను యాక్ట్ చేయడం హ్యపీగా ఉంది. మణిరత్నంగారి స్టయిల్లో ఉండే ఇన్‌టెన్స్ లవ్‌స్టోరీ. ఏప్రిల్ 7న విడుదల కానుంది`` అన్నారు.
అదితి మాట్లాడుతూ - ``నా స్వస్థలమైన హైదరాబాద్‌కు రావడం ఎంతో సంతోషానిస్తుంది. చెలియా నా తొలి తెలుగు సినిమా. మణిరత్నంగారు, ఎ.ఆర్.రెహమాన్‌గారితో వర్క్ చేయడం మరచిపోలేని అనుభూతి. ఇది నాకొక స్పెషల్ మూవీ. కల నేరవేరినట్టుగా అనిపిస్తుంది. కార్తీ నా ఫేవరెట్ కో స్టార్. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.