21 December 2018
Hyderabad
నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను 'యన్.టి.ఆర్' పేరుతో తెరకెక్కిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్ 'యన్.టి.ఆర్ కథానాయకుడు'.. 'యన్.టి.ఆర్ మహానాయకుడు' అనే రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో మొదటి భాగం 'యన్.టి.ఆర్ కథానాయకుడు' ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ, రెబల్‌స్టార్ కృష్ణంరాజు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, కలెక్షన్ కింగ్ ఎం.మోహన్‌బాబు, వరప్రసాద్ రెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి, క్రిష్ జాగర్లమూడి తదితరులు పాల్గొన్నారు. థియేట్రికల్ ట్రైలర్‌ను సీనియర్ ఎన్టీఆర్ పెద్దకుమార్తె గారపాటి లోకేశ్వరి విడుదల చేశారు. ఈసందర్భంగా..
గారపాటి లోకేశ్వరి మాట్లాడుతూ - ''యూనిట్ అందరూ ఎంతో కష్టపడ్డారని తెలుస్తుంది. ముఖ్యంగా దర్శకుడు క్రిష్ అభినందనలు. మా అమ్మగారి పాత్ర చేసిన విద్యాబాలన్‌గారికి థాంక్స్. మొదటి తెలుగు చిత్రమైనా అద్భుతంగా నటించారు. ఆవిడ నటన చూసినప్పుడు నాకు మా అమ్మగారే దిగి వచ్చారా! అనిపించింది. ఈ సందర్భంగా ఆమెకు గొప్ప జీవితాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా అబ్బాయికి సాయికృష్ణకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. అలాగే సుమంత్ ఎ.ఎన్.ఆర్‌గారు లేని లోటు తీర్చారు. సుమంత్‌కు థాంక్స్. నా తమ్ముడు బాలయ్య అంటే నాకు అపారమైన ప్రేమ. తనకు, ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది సక్సెస్'' అన్నారు.
సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ - ''నేను చిన్నప్పట్నుంచి రామారావుగారి అభిమానిని. డిగ్రీ పూర్తయిన తర్వాత రామారావుగారిని కలవాలనే మద్రాసు వెళ్లాను. వారిని కలిసి 'మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. నాకు సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఉంది. మీ పిక్చర్స్‌లో ఏదైనా వేషం ఇవ్వండి' అన్నారు. దానికి ఆయన 'నువ్వింకా చిన్న కుర్రాడిగానే ఉన్నావ్. రెండు, మూడేళ్లు అగితే నువ్వు పనికొస్తావ్. డెఫనెట్‌గా వేషం ఇస్తాను' అన్నారు. ఈలోపు ఆదుర్తి సుబ్బారావుగారు నన్ను తేనె మనుషుల్లో హీరోగా పరిచయం చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఐదో సినిమా 'స్త్రీ జన్మ'లో రామారావుగారితో నటించే అవకాశం కలిగింది. తర్వాత నిలువుదోపిడి, విచిత్ర కుటుంబం సినిమాలు చేశాను. మూడు సినిమాలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత పండంటి కాపురం హండ్రెండ్ ఫంక్షన్‌కి రామారావుగారు వచ్చారు. నేను స్టేజ్‌పైనే రామారావుగారితో సినిమా చేయాలనుందని అనౌన్స్ చేస్తానని అంటే.. 'డెఫనెట్‌గా బ్రదర్ పిక్చర్‌లో నేను యాక్ట్ చేస్తాను. సబ్జెక్ట్ చూసుకోండి' అన్నారు. ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులు సబ్జెక్ట్ వినిపిస్తే చాలా బావుందని, ఓకే షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. ఆయనతో నేను చేసిన సినిమాలన్నింటిలో తమ్ముడిగానే నటించాను. బాలకృష్ణగారు ఈ ఫంక్షన్‌కు పిలవడానికి వచ్చి ఆయన వేసిన గెటప్స్‌ను ఫోన్‌లో నాకు చూపించారు. 100 శాతం రామారావుగారిలాగానే బాలకృష్ణ కనిపించారు. 'యన్.టి.ఆర్ కథానాయకుడు', 'యన్.టి.ఆర్ మహానాయకుడు' సినిమాలు ఘన విజయాలు సాధించి బాలకృష్ణగారికి గొప్ప పేరుని తీసుకురావాలి'' అన్నారు.
దగ్గుబాటి పురందరేశ్వరి మాట్లాడుతూ - ''రేచర్ల గోత్రానికే కాదు.. నందమూరి వంశానికే కాదు. తెలుగు ప్రజలందరికీ ఓ గుర్తింపును, వన్నెను తెచ్చిన కథానాయకుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావుగారు. వారి జీవితాన్ని ప్రస్థానాన్ని ఓ సినిమాగా తీసుకు రావడం సాహసంగా నేను భావిస్తాను. ఎన్టీఆర్‌గారి జీవితంలో ప్రతి పేజీ, ప్రతి అక్షరం ప్రతి తెలుగువాడికి తెలిసిన సందర్భంలో ఆయనపై సినిమా చేయడం నిజంగా సాహసమే. దీనికి నా సోదరుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అనేక సీన్స్‌ను నాన్నగారు గుర్తొచ్చేలా ఉన్నారు. మా తల్లిగారి పాత్రలోను విద్యాబాలన్‌గారు జీవించారు. వారికి, క్రిష్‌కి, సాంకేతిక నిపుణులకు నా హృదయ పూర్వక శుభాకాంకలను తెలియజేసుకుంటున్నాను'' అన్నారు.
రెబల్‌స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌గారు మహానటుడు, దైవాంశ సంభూతుడు గురించి సినిమా తీస్తున్నందుకు బాలయ్యను ఎలా అభినందించాలో తెలియడం లేదు. ఆయన్ను ప్రతిరోజూ ఇంట్లో కృష్ణుడు, రాముడిగా క్యాలెండర్స్ రూపంలో చూస్తూనే ఉన్నాం. నాకు, ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. నామీద ఆయనకెంతో గౌరవం ఉండేది. ఆయన పార్టీ పెట్టాలనుకుంటున్న సమయంలో ప్రజా సంక్షేమం కోసం నేను కృషి చేయబోతున్నాను అంటూ నాకు చెప్పారు. ఆయన్ను తలుచుకోనోడు ఉండడు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు. క్రిష్, కీరవాణి, సాయిమాధవ్ సహా అందరికీ అభినందనలు. బాలకృష్ణ ఇంకా గొప్పవాడు కావాలని, రామారావు అంతటివాడు కావాలని ఆశీర్వదిస్తున్నాను'' అన్నారు.
మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ - ''యంగర్ జనరేషన్ మంచికి మారుపేరైన మహానటుడు ఎన్టీఆర్ గురించి విన్నారే కానీ.. ఎవరూ చూడలేదు. నేను మద్రాస్ వై.ఎం.సి కాలేజ్‌లో చదువుతున్నప్పుడు గుంపులో వెళ్లి ఎన్టీఆర్‌గారిల్లు ఇది అని చూసి నమస్కారం పెట్టిన వారిలో నేను ఒకడ్ని. భక్తవత్సలం అనే వ్యక్తిని దాసరిగారు మోహన్‌బాబుగా మారిస్తే, ఆ మహానటుడితో ఓ సినిమాలో నటింప చేశారు. ఆ మహానటుడితో 1982 సంవత్సరం శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పెడితే బొబ్బిలిపులి గెటప్‌లోని అన్నయ్య ఫస్ట్ కొబ్బరికాయ కొట్టారు. 1993లో అదే బ్యానర్‌లో అన్నయ్య చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్ సినిమా తీశాను. ఎన్ని యుగాలైనా ఆ మహానటుడు ఆ సినిమాలోఇచ్చిన పెర్ఫామెన్స్. తరతరాలకు గుర్తుండిపోతుంది. ఏక గర్భంలో జన్మించకపోయినా మేం అన్నదమ్ములం అన్నారు. అది నెంబర్ వన్... ఓసారి ఫంక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ వాళ్లు అన్నయ్య మాట్లాడుతుంటే డౌన్ డౌన్ అన్నారు. నేను ఒకడ్నే ఆయనకు జిందాబాద్ కొట్టాను. అది నెంబర్ టు.. అసెంబ్లీ రౌడీ ఫంక్షన్‌లోనే అన్నయ్య కాషాయ వస్త్రాలతో మల్లెపువ్వులాగా కనపడ్డారు. మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ జరిగితే జనంరారేమో అని ఓ వ్యక్తి అంటే వస్తారని మేం చెప్పాం. కొన్ని లక్షల మంది వచ్చారు. తిరుపతిలో ఫంక్షన్ వైభవోపేతంగా జరిగింది. 1994 జనవరిలో అన్నయ్య షిరిడీ సాయినాథుని దగ్గరకు తీసుకెళ్లింది నేనే. ఆ మహానటుడితో ఉన్న అనుబంధం జన్మజన్మలకు మరచిపోలేనిది. లంచం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి. నందమూరి కుటుంబానికే లంచం అనే పదం తెలియదు. చాలా మంచి వ్యక్తులు. బాలయ్యను అన్నయ్య రూపంలో చూస్తుంటే రొమాలు నిక్కబొడుస్తున్నాయి. ఈ పిక్చర్ గొప్ప విజయాన్ని సాధించాలని, మళ్లీ ఓ చరిత్ర సృష్టించాలని.. తన కుమారుడ్ని అన్నయ్య ఎక్కడున్న ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. క్రిష్ ప్రతి సీన్‌ను అద్భుతంగా మలిచాడు. మూవీకి బెస్ట్ ఆఫ్ లక్'' అన్నారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ''సమాజమే నా దేవాలయం ప్రజలే నా దేవుళ్లు అన్నది అన్నగారే. ఆయనతో పనిచేయాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. అలాంటి గొప్ప వ్యక్తితో 12 సినిమాలు చేశాను. అన్నగారి అఖరి పిక్చర్స్ నేనే చేశాను. ఈ సినిమాను నేను 12 సార్లు చూస్తాను. ఎందుకంటే ఆయనతో నేను 12 సినిమాలు చేశాను కాబట్టి.. అలాగే సంవత్సరానికి పన్నెండు నెలలుంటాయి. కాబట్టి ప్రతి నెలా చూస్తాను. ఈవాళళీ స్టేజ్‌పై నేను ఉన్నానంటే కారణం అన్నగారే'' అన్నారు.
కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - ''తెలుగుజాతి సత్తాను యావత్ ప్రపంచానికి చాటిని సూపర్‌స్టార్, పొలిటికల్ సూపర్‌స్టార్ ఎన్టీఆర్. వాళ్ల నాన్న అందమంతా బాలయ్యకే ఆయన ఇచ్చేశారు. ఆయన అందం, అకుంఠిత దీక్ష, ఆత్మశక్తికి ప్రతి బింబం ఎవరయ్యా అంటే అది బాలయ్యే. ఈ సినిమా చేయడం ఒక ఎత్తు అయితే, అన్నీ పాత్రల్లో నటించగల దమ్మున్న వ్యక్తి బాలయ్య మాత్రమే. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నిర్మించిన శక్తి ఎన్టీఆర్‌గారు. ఆరుమాసాల్లోనే పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎన్టీఆర్‌గారు మాత్రమే. ఆయననే ఏ పాత్ర చేసినా ఆయనకే చెల్లుతుంది. ఆయన కోవలో బాలయ్య కథానాయకుడులో రకరకాల పాత్రలు వేశారు. యావత్ ప్రపంచంలోని తెలుగువారందరూ ఈ సినిమాను చూసి తీరుతారు'' అన్నారు.
వర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ - ''మహర్షులు, త్యాగమూర్తులు, పోరాటం చేసినవారు ఇలా దేశంలో ఎంతో మంది మహానుభావులు జన్మించారు. వారిలో రామారావుగారు ఎంతో ప్రత్యేకం. ఎన్టీఆర్‌గారి జీవితమే సాహసంతో కూడుకున్న పూలబాట. రాజకీయ జీవితంలో కూడా ఎన్నో సాహసాలు చేశారు. ఇంత సాహసం, ప్రజ్ఞాపాటవాలున్న వ్యక్తులు వెతికితే కొద్ది మందే కనపడతారు. ఆయన జీవితాన్ని తెరకెక్కించడం ఇంకా సాహసమే. ఇలాంటి సాహసం చేసిన బాలకృష్ణగారు నిజంగా అభినందనీయులు. రామారావుగారి ఆత్మ బాలకృష్ణ శరీరంలో ప్రవేశించి దాన్ని ఆధారంగా చేసుకుని మళ్లీ తిరిగి తెరపై కనపడుతున్నారు. క్రిష్ పేరులోనే కృషి ఉంది. బాలకృష్ణేకాదు, దర్శక నిర్మాతలు కూడా సాహసం చేశారు. సినిమా చరిత్ర ఉన్నంత కాలం ఈ సినిమా నిలిపోతుందని భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్'' అన్నారు.
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ - ''యన్.టి.ఆర్ అనే మూడు అక్షరాలు ఒక మహా ప్రభంజనం.. మహా విప్లవం. ఎన్టీఆర్‌గారిని కథానాయకుడిగా, మహానాయకుడిగానే చూస్తాం. కానీ ఆయన ఓ సోషల్ రీఫార్మర్. గ్రామంలో పుట్టి అక్కడ ప్రజల కష్టాలను అర్థం చేసుకున్నారు. వ్యక్తి మహావ్యక్తిగా మారి.. నటుడు మహానటుడిగా మారి దాన్ని ఆకలింపు చేసుకున్న సాహసి ఎన్టీఆర్‌గారు'' అన్నారు.
సహజనటి జయసుధ మాట్లాడుతూ - ''ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నేను చాలా అదృష్టం చేసుకున్నాను. ఆయనతో 20కు పైగా చిత్రాల్లో నటించాను. మహానటి సావిత్రిగారిపై బయోపిక్ తీశారు. తర్వాత ఎన్టీఆర్‌గారిపై కథానాయకుడు, మహానాయకుడు అనే బయోపిక్ తీస్తారని తెలిసినప్పుడు, ఎలా ఉంటుందోనని అనిపించింది. బాలకృష్ణగారు ఎన్టీఆర్‌గారి క్యారెక్టర్ చేయబోతున్నారని తెలియగానే ఎలా ఉంటుందోనని ఆతృత పెరిగింది. ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన తర్వాత రామారావుగారిని చూసిన ఫీలింగ్ కలిగింది. ఆయనతో కలిసి 'నా దేశం' సినిమా చేస్తున్నప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానం గురించి డిస్కషన్స్ ఎక్కువగా జరిగాయి. నా దేశం నుండి తెలుగు దేశం పార్టీ పెట్టారు. సీఎం అయ్యారు. ఆయనతో నా జీవితంలో మరచిపోలేని తీపి గుర్తులు ఎన్నో ఉన్నాయి. సినిమా, ఆడియో పెద్ద హిట్ అవుతుంది. బాలకృష్ణ సహా ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్'' అన్నారు.
విద్యాబాలన్ మాట్లాడుతూ - '''యన్.టి.ఆర్ కథానాయకుడు', 'యన్.టి.ఆర్ మహానాయకుడు' సినిమాను నా తొలి తెలుగు చిత్రంగా నటించడం గౌరవంగా భావిస్తున్నాను. ఇంత కంటే గొప్ప స్టార్ట్ ఉండదని అనుకుంటున్నాను. ట్రైలర్ చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. బాలకృష్ణ ఎన్టీఆర్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. బాలకృష్ణగారి ఎనర్జీ, ప్యాషన్ చూసి ఇన్‌స్పైర్ అయ్యాను. ఈ పాత్ర చేయడం చాలా సులభమని బాలకృష్ణ చెప్పారు. నిజానికి ఇది సులభమైన పాత్రే కాదు.. చాలా కష్టపమైన పాత్ర కూడా. సినిమా చూస్తే ప్రేక్షకులు బాలకృష్ణను ప్రేమిస్తారు. క్రిష్, కీరవాణి, జ్ఞానశేఖర్‌గారు సహా ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు. ఎన్టీఆర్‌గారు మేం చేసిన పనిని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం. నాకు తెలుగు రాదు అనే భావను క్రిష్, బాలకృష్ణగారు దూరం చేశారు. ఇప్పుడు బాలకృష్ణ కుటుంబంలో నేను కూడా ఓ సభ్యురాలినని భావిస్తున్నాను'' అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ - ''భళ్లాలదేవుడు పాత్ర తర్వాత చంద్రబాబు నాయుడిగారి పాత్ర చేస్తానని అనుకోలేదు. అందుకు కారణం క్రిష్‌గారే. బాలకృష్ణగారి కథానాయకుడు సినిమా రిలీజ్ రోజున నేను పుట్టాను. నా జీవితంలో నేను చూసిన మొదటి సినిమా షూటింగ్ కూడా బాలకృష్ణగారి 'రాము' సినిమాదే. మా ఇంట్లోనే షూటింగ్ చేశారు. చంద్రబాబునాయుడుగారు చాలా విలువైన సమయాన్ని మాతో గడిపారు. ఆయనకు నా పాత్ర నచ్చుతుందని నమ్ముతున్నాను. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. తెలుగు నేర్చుకున్నాను. మూడో క్లాసో, నాలుగో క్లాసో తెలియదు కానీ.. మేజర్ చంద్రకాంత్ సినిమా చూశాను. మా తాతగారితో ఆయన్ను కలవాలనుందని అంటే ఆయన తీసుకెళ్లలేదు. రామారావుగారు కాలం చెందారు. ఎన్టీఆర్‌గారిని మా తాతగారు కథానాయకుడిలా ఎలా చూశారు. ఆయన పక్కనే నేను మహానాయకుడిలా చూశాను. ఈ సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నాను'' అన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ - ''నాకు శ్రీదేవిగారి పాత్ర ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. క్రిష్‌గారు చెబితే నేను నమ్మలేదు. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో నన్ను భాగం చేసినందుకు క్రిష్, బాలకృష్ణగారికి థాంక్స్. ఇది సినిమా కాదు.. చాలా ఎమోషన్స్ ఉన్నాయి'' అన్నారు.
జమున మాట్లాడుతూ - ''మన అభిమాన నటుడు, అందాల నటుడు.. వీరానికి, శూరానికి ప్రతీక ఎన్టీఆర్‌గారు. ఆయన తనయుడు బాలకృష్ణను చిన్నప్పట్నుంచి బాలయ్య బాబు అనే పిలిచేవాడిని. కృష్ణుడిగా, రాముడిగా, ధుర్యోధనుడిగా, రావణాసురిడా ఎన్నో పాత్రలు పోషించారు. పౌరాణికాలు, సాంఘిక చిత్రాల్లో నటించారు. ఆయన పాత్రను ఈ బయోపిక్ ద్వారా మనందరికీ గుర్తు చేస్తున్నారు. తండ్రికి నివాళులు అర్పించి మా అందరి మనసులు దోచుకున్నారు. ఈ చిత్రం నా దృష్టిలో ప్రపంచ స్థాయిలో సూపర్‌డూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.
డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ - ''రామారావుగారి గురించి మాట్లాడటం కంటే ఆయన గురించి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఇష్టపడేవాడిని. ఇదొక సినిమా అనడం కంటే మహాకావ్యం అనొచ్చు. భావితరాలకురామారావుగారి గురించి తెలియాలి. ఎంతో స్ఫూర్తి, ఉత్తేజం కలగాలి. సమాజంలో చాలా మార్పులు రావాలి. అందుకు ఈ సినిమా ఎంతో అవసరం. ఆయనలాగానే ఈసినిమా చరిత్రలో మిగిలిపోవాలని ఆశిస్తున్నాను'' అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''కాల చక్రాన్ని తిప్పి చూపించే అద్భుతం. ఒక సినిమాకే ఉంది. ఎన్టీఆర్ జీవితం తెలుగు జాతి భారతం. ఆయన నామం అజేయం. మనిషి జీవితంలో ఎంతో సాధించారు. నటుడిగా, దర్శకుడిగా, ధార్మికుడిగా, మహాపురుషుడిగా, నాయకుడిగా, మహానాయకుడిగా ఆది..అంతం చూసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌గారు మాత్రమే. సాక్షాత్తు గాడ్‌నే ఫాదర్‌గా పొందిన ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ. ఎందుకంటే ఎవరైనా ఆ తరం వాళ్లు కళ్లుమూసుకుని ఏ పాత్రను తలుచుకున్నా కనపడేది ఎన్టీఆర్‌గారు మాత్రమే. ఒక తండ్రి చరిత్రను ఒక కొడుకే పోషించి మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. నాకు తెలిసి ప్రపంచంలో ఇది ఎక్కడా జరగలేదు. ఈ సినిమాను ఇంత త్వరగా, అద్భుతంగా తీసిన క్రిష్‌గారికి, సినిమాలో నటించిన, నిర్మించిన బాలయ్యబాబుగారికి.. అలాగే కీరవాణిగారికి ఇతర పాత్రలకు ప్రాణం పోసిన ఇతర ఆరిస్టులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా తీసిన వాళ్లకే కాదు.. చూసినవాళ్లు కూడా గర్వంగా ఫీలయ్యేలా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే బ్యానర్‌లో నేను, బాలయ్యగారు తదుపరి సినిమా ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాం. సింహా, లెజెండ్ ఎలా ఉంటుందో దాన్ని పదిరెట్లు మించేలానే మా కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఉంటుం
దని హామీ ఇస్తున్నాను'' అన్నారు.
సుమంత్ మాట్లాడుతూ - ''నాకు ఈ అవకాశం వస్తుందని తెలియగానే అదృష్టంగా భావించి, బాధ్యతగా ఫీలయ్యాను. మాకు, నందమూరి కుటుంబానికి మధ్య అనుబంధం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ అనుబంధానికి పునాది ఎక్కడ మొదలైందో తెలియాలంటే ఈ చరిత్ర చూస్తే తెలుస్తుంది. నందమూరి అభిమానులు పండగ చేసుకుంటారు'' అన్నారు.
ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ - ''రామారావుగారి చివరి సినిమాకు నేను సంగీతం చేయడం గర్వంగా భావిస్తుంటాను. అంతకంటే గర్వంగా ఫీలయ్యే విధంగా ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. నేను ఎన్టీఆర్‌గారికి వీరాభిమానిని. అదే ఈ సినిమాకు పనిచేసే అర్హత అని భావిస్తున్నాను. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ పాండవీయం ఎన్ని వందల సార్లు చూశానో నాకే తెలియదు. కథానాయకుడంటే ఆయన. అవినీతి అంటే ఏమిటో తెలియని వ్యక్తి కాబట్టే మహానాయకుడయ్యాడు. ఎన్టీఆర్‌గారు 8 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే. ఆ కథానాయకుడు, మహానాయకుడుని క్రిష్‌గారు అంత కంటే తక్కువ టైమ్‌లోనే తీశారు. బాలయ్యగారిని చూస్తుంటే రామారావుగారిని చూస్తున్నట్లే ఉంది. ఆయన్ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చిన అనుభూతిని పొందిన అదృష్టం నాది'' అన్నారు.
నందమూరి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ - ''ఆయన గురించి చెప్పే వయసు నాకు లేదు. జీవితంలో సాధించిందీ లేదు. ఆయన గురించి చాలా మంది గొప్ప విషయాలు మాట్లాడారు. అయితే, ఆయన దగ్గర నుండి నేర్చుకున్న విషయం కమిట్‌మెంట్, డేడికేషన్. సినిమాలను డేడికేషన్‌తో చేయాలని నేర్చుకున్నాం. ఆయన్ను ఇండియన్ సూపర్‌స్టార్‌ని చేసిన ప్రేక్షకులకు ఏదో చేయాలనుకుంటూ గొప్ప నాయకుడు అయ్యారాయన. సేవతో పాటు చాలా కార్యక్రమాలు చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం తెచ్చారు. ఆడవాళ్లకు ఆస్థిలో సమాన హక్కుని కల్పించారు. ఆయనొక గొప్ప యుగపురుషుడు, లెజెండ్. ఆయనపై సినిమా చేయడం మామూలు విషయమా? ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఎవరూ చేస్తే బావుంటుందనుకున్నాం. అది బాబాయ్ ఒక్కడికే సాధ్యమవుతుంది. ఈ సినిమా చేయాలంటే బాధ్యత ఉండాలి. అద్భుతమైన వేల్యూస్‌తో సినిమా తీయాలని బాబాయ్ ఎన్.బి.కె.ఫిలింస్ బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. సినిమా మొదలైన తర్వాత మీ నాన్నగారి పాత్ర నువ్వు చేయాలి.. ఓసారి ఆలోచిస్తావా? అన్నారు. ఓ చారిత్రాత్మక సినిమా చేస్తున్నప్పుడు అందులో ఓ చిన్న ఫోటో వచ్చినా చాలని మనం అనుకుంటాం. నా సినిమా జీవితం ప్రస్థానం స్టార్ట్‌చేయించింది బాబాయే. బాలగోపాలుడు సినిమాతో. బాబాయ్ సంస్థలోనే ఆ సినిమా చేశాను. మళ్లీ ఆయన బ్యానర్‌లో సినిమా చేయమంటే ఆలోచిస్తామా? ఈరోజు నేను ఇక్కడ నిలబడ ఉన్నానంటే అందుకు కారణం బాబాయే. నాన్నగారిలా నేను ఉంటానని నేను అనుకోలేదు. మేం సన్నగా ఉంటాం. నాన్నేమో టైగర్‌లా దిట్టంగా ఉంటారు. నాకేమో డౌట్‌గానే ఉండేది. అయతే 45 నిమిషాల తర్వాత బాబాయ్ ఫోన్ చేసి 25 వయసులో నాన్నను చూసినట్టే ఉందని అన్నారు. తర్వాత నాలో నమ్మకం పెరిగింది. నాన్నగారి జీవితం వాళ్ల నాన్నగారి సేవతోనే గడిచిపోయింది. తాతగారు మూడు గంటలకు నిద్రలేచే వారంటే.. నాన్న మూడున్నరకే అక్కడ ఉండేవారు. రాత్రి ఆలస్యంగా వచ్చేవారు. నా పదిహేనో ఏటనే ఆయనతో పరిచయం ఏర్పడింది. తొలిరోజు షూటింగ్‌కి వెళ్లినప్పుడు బాబాయ్ ప్రతి డైలాగ్‌ను చెప్పారు. మీ తాతగారి దగ్గర కూడా నాన్న నిర్మొహమాటంగానే ఉండేవారని చెప్పి ప్రతి డైలాగ్‌ను చెప్పించారు. ఈ సినిమాకు నాలుగు పిల్లర్స్. అందులో నిర్మాతగా, యాక్టర్‌గా బాబాయ్ మొదటి పిల్లర్. రెండో పిల్లర్‌గా క్రిష్ నిలబడ్డారు. రెండే నెలల్లో రామారావుగారి జీవితం అద్భుతమైన కథ రాసేశారు. క్లుప్తంగా, అందంగా ఆయన జీవితం గురించి రీసెర్చ్ చేసి రాశారు. రేపు తెరపై కొత్త ఎన్టీఆర్‌ను చూస్తారు. ఆయనలోని ఆవేదన, ఎమోషన్‌ను చూస్తారు. ఆయనకు ప్రజలకు సేవ చేయాలని ఎప్పటి నుండో ఉండేది. ఎక్కడో నిమ్మకూరు నుండి వచ్చిన నన్ను ప్రజలు సూపర్‌స్టార్ రేంజ్‌కు తీసుకెళ్లారు. అలాంటి ప్రజలకు నేనెం చేయాలని ఆలోచించేవారు. అవన్నీ ఈ సినిమాలో చూస్తారు. క్రిష్‌గారు లేకపోయుంటే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చి ఉండేది కాదు. ఇంత మంది పాత్రలను అద్భుతంగా తెరకెక్కించారు. ఆయనకు తోడుగా బాలయ్యగారు ఒక్కరే. మాడ్యులేషన్ విషయంలో ఆయనకు సపోర్ట్‌గా నిలిచారు. నన్ను ఈ సినిమాలో పార్ట్ చేసినందుకు థాంక్స్. మూడో పిల్లర్ సాంకేతిక నిపుణులు. అందులో మొదటి వ్యక్తి కీరవాణిగారు.సాహిత్యానికి ప్రాణం పోసే వ్యక్తి. మరో వ్యక్తి బాబాగారు.. డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఎక్కడా అరవకుండా కామ్‌గా సినిమాను పూర్తి చేశారు. రామారావుగారి కాలానికి తీసుకెళ్లిపోతారు. రామారావుగారిలా ఏ యాంగిల్‌లో బావుంటారని నిర్ణయించేది కెమెరామెన్‌గారు, డైరెక్టర్‌గారు మాత్రమే. అలాగే.. బుర్రా సాయిమాధవ్‌గారు. అద్భుతమైన డైలాగ్స్ రాశారు. నాలుగో పిల్లర్.. ఇందులో నటించిన ఆర్టిస్టులు. ఈ నాలుగు పిల్లర్స్ కలిసి అద్భుతంగా సినిమాను చేశారు'' అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ''మా బాబాయ్‌ను చూస్తుంటే పెద్దాయన గుర్తుకు వస్తున్నారు. ఆ మహా మనిషి కుటుంబంలో నేను కూడా ఒక వ్యక్తిని. ఆ కుంటుంబంలో నేను కూడా ఒక సభ్యుడ్ని అవడం ఎంత గర్వ కారణం. ఈరోజు నేను కుటుంబసభ్యుడిగా మాట్లాడటానికి రాలేదు. ఓ మహానుభావుడు చేసిన త్యాగాల వల్ల లబ్దిపొందిన తెలుగువాడిగా మాట్లాడటానికి వచ్చాను. తెలసి తెలియని వయసులో.. తాతయ్యగారు అని మహా మనిషిని సంబోధించిన నేను.. ఆయన గురించి తెలిసిన తర్వాత రామారావుగారు అనో.. అన్నగారు అనో సంబోధించడం మొదలు పెట్టాను. ఎందుకంటే ఆయన ఏ ఒక్క కుటుంబానికో చెందినవాడు కాదు. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కడికీ చెందిన ధృవతార ఆయన. ఎన్నో కథలు ఆయన గురించి విన్నాను. నాన్న, అమ్మ, బాబాయ్‌లు చెప్పినప్పుడు తెలుసుకునేవాడిని. అయితే ఇంకా తెలుసుకోవాల్సిందే ఎంతో ఉంది. వాల్మీకి మహర్షి రామాయణం రాసేటప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఆయన్ను అడిగి ఉంటాడేమో 'అయ్యా ధర్మ మూర్తీభవించేలా .. కనపడేలా ..నిలువెత్తు ధర్మంతో కనపడేలా ఏ మానవుడు లేడా' అని ఉంటాడు. ఎందుకు లేడు.. అడుగో శ్రీరామచంద్రుడు అని చెప్పి ఆయన రామాయణం రాసి ఉంటాడు. ఆయన అవతారాన్ని వదిలేసిన తర్వాత మన తెలుగు వాళ్లు అడిగారేమో మళ్లీ అలాంటి ధర్మ మూర్తిని చూడమా? మళ్లీ అలాంటి ఒక గొప్ప వ్యక్తిని చూడలేమా? అనే తెలుగువాడి ఆర్తనాదంలోనుండి ఆ శ్రీరామచంద్ర ప్రభువు కటాక్షంతోనే 1923 మే 28న నిమ్మకూరులో ఓ ధృవతార వెలిసింది. గొప్ప తండ్రే కాదు.. గొప్ప బిడ్డే కాదు.. గొప్ప నటుడే కాదు.. గొప్ప నాయకుడే కాదు.. వీటన్నింటికంటే ముఖ్యం తెలుగువాళ్లమని మనల్ని సంబోధించని రోజుల్లో.. పక్క రాష్ట్రంవాళ్ల పేరుతో మనల్ని పిలిచిన రోజుల్లో ఇదిరా తెలుగువాడి గౌరవం.. ఇదిరా తెలుగువాడి పౌరుషం..ఇదిరా తెలుగువాడి ఖ్యాతి అని తొడగొట్టి ఇదిరా తెలుగువాడని మనం చెప్పుకుంటున్నామంటే అందుకు త్యాగం చేసిన మహానుభావులు ఎందరో. అందులో నందమూరి తారక రామారావుగారు ఒక ప్రముఖులు. ఇది నాకు తెలుసు. రేపు పొద్దున మా పిల్లలు మమ్మల్ని నాన్న అలాంటి ధర్మమూర్తి ఉన్నాడా? అప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటాను 'ఇంకా పుట్టలేదేమో నాన్న.. అని మా తాతగారి వాళ్ల తాత చేసిన సినిమా గురించి చూపించుకుంటాను. ఆ మహానుభావుడు చరిత్రను భావితరాల వారికి తీసుకెళ్తున్న బాబాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ మహానుభావుడు చరిత్రను బాబాయ్ అందిస్తున్నారు. బాబాయ్‌కి ఎన్నో చిత్రాలు చూశాను. మొట్టమొదటిసారి మా తాతగారిని చూసుకున్నాను. ఈ చరిత్రను విజయం సాధించాలని నేను కోరుకోను. ఎందుకంటే ఈ చిత్రం విజయం సాధించాకే మొదలైంది. చరిత్రకు విజయాలు, అపజయాలుండవు. చరిత్ర సృష్టించడమే ఉంటుంది. బాబాయ్ చేస్తున్న ఈ ప్రయత్నానికి, కన్న కలకు చేదోడు వాదోడుగా, వెన్నుముకలా నిలిచిన క్రిష్ నాకెంతో ఆప్తుడు. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత మరోగొప్ప సినిమాను మనకు అందిస్తున్నారు. ఆయన్ను ఎంత పొగిడినా తక్కువే. ఆయనతో పాటు కీరవాణిగారు, సాయిమాధవ్‌బుర్రాగారు.. జ్ఞానశేఖర్‌గారు.. సహా ప్రతి సాంకేతిక నిపుణుడికి, నటీనటులకు కృతజ్ఞతలు'' అన్నారు.
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ - ''స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి, బసవతారకమ్మగారి కడుపున పుట్టటం మా అదృష్టం. ఆయన గొప్ప మనిషి. కళామతల్లి వరాల మూట. పేద ప్రజలకు అన్న ఎన్టీఆర్. ఆడపిల్లలకు అన్నగా, అండగా నిలిచారు ఎన్టీఆర్. రైతన్నలకు దన్నుగా నిలిచిందిఎన్టీఆర్. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్‌గారేంటో తెలుస్తుంది'' అన్నారు.
జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ - ''నా టీం అందరి తరపున జనవరి 9న రెండున్నర గంటలు.. ఫిబ్రవరి 7న మరో రెండున్నర గంటలు మాట్లాడుతామని తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బాలకృష్ణగారికి, ఇతరులకు థాంక్స్'' అన్నారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ - ''ఈ కార్యక్రమాన్ని మా నాన్నగారి స్వగ్రామం నిమ్మకూరులో అనుకున్నాం. కానీ... వాతావరణం సహకరించకపోవడంతో ఇక్కడ నిర్వహిస్తున్నాం. సినిమా లాంచింగ్గా, లేక ఆడియో, ట్రైలర్ విడుదల అని తెలియడం లేదు. సినిమా అంత త్వరగా పూర్తయ్యింది. రెండు భాగాలను పూర్తి చేసుకోనున్నాం.ఈ రెండు భాగాలను 89 రోజులు పనిచేశాం. ఈ రెండు భాగాలకు ఎవరం కష్టం అనుకోలేదు. ఈ సినిమాలో భాగం కావడం పూర్వజన్మ సుకృతంగా భావించి పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు. ఐశ్వర్యం, పేరు ప్రతిష్టలనేవి మన పూర్వజన్మ రుణాన్ని బట్టే వస్తుంది. ఎవరైనా నువ్వు ఎవరివి అని నన్ను అడిగితే భారతీయుడ్ని అంటాను. అదే ప్రశ్న మరోసారి అడిగితే తెలుగువాడినని అంటాను. ఇంకోసారి అడిగితే ఒక నందమూరి తారక రామారావుగారి కొడుకునని అంటాను. మళ్లీ అడిగితే ఓ అన్నగారి అభిమానిని అంటాను. ఆయనకు సాటిలేరు ఎవ్వరూ. ఆయన కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. మేం చరిత్రను పునరావృత్తం చేయడానికి కాదు.. తిరిగి రాయడానికి ఇక్కడ ఉన్నాం. చరిత్ర అనేది మనం అనుసరించేది కాదు.. మనం సృష్టించేది. సినిమాలనేవి సృష్టికి ప్రతి సృష్టి. పరిస్థితులే చరిత్ర మనల్ని క్రియేట్ చేస్తుందని లూథర్ కింగ్ అన్నారు. అది పచ్చి అబద్ధం అని నిరూపించింది ఇద్దరే మహానుభావులు. ఒకరు ప్రాచీన ఆంధ్ర సృష్టికర్త గౌతమిపుత్ర శాతకర్ణి అయితే.. అధునిక ఆంధ్ర చరిత్ర సృష్టికర్త స్వర్గీయ నందమూరి తారక రామారావుగారే. నాన్నగారి చేసిన పాత్రలను మీరేమైనా చేస్తారా? అని ఎవరైనా అడిగితే నాన్నగారు చేయని రెండు పాత్రలు నారదుడు, గౌతమిపుత్ర శాతకర్ణిని చేశానని చెప్పుకునేవాడిని. అలాంటిది ఆయన పాత్రే చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మనం సంకల్పం బలంగా ఉంటే ప్రకృతే మనతో ఆపని చేయిస్తుంది. ఈ సినిమాలో కర్త, కర్త మా తండ్రిగారు, తల్లిగారు అయితే మేం క్రియ మాత్రమే. ముందు రెండు భాగాలు అనుకోలేదు. అయితే రెండు భాగాలు కూడా ఆయనకు సరిపోవని భావిస్తాను. గాంధీ సినిమా ఉంది. .. ఇక్కడ మహానటి సినిమా విడుదలైంది. ఎన్టీఆర్‌గారి ఎన్టీఆర్‌గారు జీవితం లార్జర్ దేన్ లైఫ్. అందుకనే ఆయన జీవిత సారాంశం మాత్రమే తీసుకున్నాను. రెండు భాగాలు కలిసి 89 రోజులు మాత్రమే పనిచేశాం. నా సినిమాలు చేస్తున్నప్పుడు ఆడినా, ఆడకపోయినా భాష ముఖ్యంగా బావుంటుంది. ఇక నాన్నగారి గురించి చెప్పాలంటే నాకు తెలుగు అనే మూడు అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. అలాగే యన్.టి.ఆర్ ఆనే మూడు అక్షరాలు వింటే నా తనువు పులకరిస్తుంది. తెలుగుజాతే కాదు... యావత్ భారతదేశం గుర్తుంచుకోదగ్గ మనిషి ఆయన. కాబట్టి ఈ సినిమాను తెలుగులోనే కాదు. మలయాళం, హిందీ, తమిళంలో కూడా అనువదించి విడుదల చేస్తాం. మన తెలుగువాడి దెబ్బఏంటో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి పాత్రలు నేను చేయగలుగుతానో లేదో అని ఆలోచించుకుని నా కోరికలన్నీ పరిమితంగా నేరవేర్చుకున్నాను. ఆయన్ను పొగడాలంటే మాటలు చాలవు. ఎన్టీఆర్ సినిమాను వ్యాపారం కోసం చేయలేదు. రౌడీ ఇన్‌స్పెక్టర్ సమయంలో స్వంత బ్యానర్ పెట్టి సినిమా చేయాలనుకున్నాను కానీ కుదరలేదు. ఈ సినిమాను నేను తీయాలని రాసి పెట్టి ఉంది. ఈ సినిమాను మా నందమూరి కుటుంబ సభ్యుల సమ్మతి తీసుకునే ఈ సినిమా చేశాను. రామారావుగారిని బాలకృష్ణ ఆలోచనలో ఎలా చూపించాలో క్రిష్‌గారు అలా చూపించారు. నాన్నగారు నాకు గురువు, దైవం. ప్రతిరోజు ఆయన సినిమా చూడందే నిద్రపోను. నేను నిద్ర లేవాలంటే నాకు పాజిటివ్ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీయే ఎన్.టి.ఆర్. విద్యాబాలన్ గురించి చెప్పాలంటే ఆవిడ అమ్మగారి పాత్ర వేశారు. ఈవాళ ఆవిడ తొలి తెలుగు సినిమాగా ఈ సినిమా చేశారు. ఆవిడకు ఈ సందర్భంగా థాంక్స్. మా అమ్మగారు దొరకడం నాన్నగారి అదృష్టం. అలాగే విద్యాబాలన్‌గారు మాకు దొరకడం మా అదృష్టం. ఎందరో నటీనటులు ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలు పోషించారు. మంచి వాతావరణంలో సినిమాను పూర్తి చేశాం. కీరవాణిగారితో పాండు రంగడు సినిమా చేశాను. తర్వాత ఈ సినిమాకు ఆయనతో పనిచేశాను. అణిముత్యాల్లాంటి పాటలను అందించారు. సాయిమాధవ్‌గారు అద్భుతమైన డైలాగ్స్ అందించారు. ఇది కేవలం అభిమానుల సినిమానే కాదు.. సపరివార సటుంబ చిత్రం. కెమెరామెన్‌గారు చాలా సైలెంట్‌గా పనిని పూర్తి చేశారు. ఈ సినిమాను అద్భుతంగా చెక్కారు. కల్యాణ్‌రామ్.. అన్న హరికృష్ణ పాత్రలో నటించారు. ఆనాడు పార్టీ పెడితే అన్నయ్య శ్రామికుడిగా శ్రమించారు. తండ్రికి తగ్గ తనయుడిగా చేదోడు వాదోడిగా ఉన్నారు. చైతన్య రథసారధిగా ఉన్నారు. నాన్నగారు శివైక్యం అయిన తర్వాత ఎన్నికల్లో రికార్డ్ మెజార్టీ క్రియేట్ చేశారు. రాజకీయాల్లో ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన అకాల మరణం అందరినీ దు:ఖ సముద్రంలో ముంచేసింది. ఆయన కొడుకు కల్యాణ్‌రామ్ ..ఆయన పాత్ర చేశారు. తను వాళ్ల నాన్నగారి పాత్రను చేస్తే.. నేనేమో మా నాన్నగారి పాత్రను చేశాను. మా మనవడేమో నా చిన్నప్పటి పాత్రను చేశాడు. అందరినీ దేవుడే తీసుకొచ్చి పాత్రలను చేయించాడు. రానా చంద్రబాబు నాయుడిలా నటించారు. భరత్‌రెడ్డిగారు మా పెద్దబావగారి పాత్రను చేశారు. సుమంత్ ఎ.ఎన్.ఆర్ పాత్రలో చేశారు. విష్ణు ఇందూరి, సాయికొర్రపాటి నిర్మాణంలో చేదోడు వాదోడుగా ఉంటూ తమ వంతు సహకారం అందించారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో బసవతారకరామ పుత్ర అనే పేరు పెట్టుకుని ఆమె రుణం కాస్త తీర్చుకున్నాను. ఈ సినిమాతో ఇటు తండ్రి రుణం తీర్చుకుంటున్నాననే అనుకుంటున్నాను. అలాగే మా తోడల్లుడు ఎం.ఆర్.వి.ప్రసాద్‌గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. జనవరి 9న తొలి భాగం విడుదలవుతుంది'' అన్నారు.