6 February 2016
Hyderabad
తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు పండుగ వేడుక
తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద సినిమా విడుదల తేది ఫిభ్రవరి 6,1932లో విడుదలైంది. అప్పటి వరకు తెలుగు సినిమా పుట్టినరోజుపై ఉన్న సందిగ్ధత తొలగింది. అందువల్ల ఫిభ్రవరి 6వ తేదిని కళామంజూష కల్చరల్ అకాడమీ సంస్థ తెలుగు సినిమా పుట్టినరోజు పండుగ వేడుకను శనివారం హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో కె.రాఘవ, కృష్ణవేణి, రావు బాలసరస్వతి, కాకరాల వెంకట సత్యనారాయణ, కె.ఎస్.రావు, సాగర్, కోడిరామకృష్ణ,ఎస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, జమున, కాశీవిశ్వనాథ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రావిపల్లి రాంబాబు, లయన్ సాయివెంకట్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సినిమా పండుగ తేదిని తన రీసెర్చ్ ద్వారా కనుగొన్న పాత్రికేయుడు రెంటాల జయదేవ్, సీనియర్ పాత్రికేయులు ట్రేడ్‌గైడ్ వెంకటేశ్వరరావు సత్కరించారు. ఈ సందర్భంగా....
కోడిరామకృష్ణ మాట్లాడుతూ ``రాఘవగారు, కృష్ణవేణి, జమున ఇలా ఇందరి గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉండటం, వారితో ఈరోజు కూర్చొని ఉండటం థ్రిల్‌ను కలిగిస్తుంది. ఇప్పటికి వీరు మన తరానికి కూడా ఇన్‌స్పిరేషన్. తెలుగు సినిమాలో ఎవరో ఒకరు పుట్టినరోజు జరుగుతూనే ఉంటుంది. సినిమాలో భాగమైనందున తెలుగు తల్లికి ప్రతిరోజు పుట్టినరోజు పండుగే అవుతుంది`` అన్నారు.
ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ``ఈ పండుగకు కారణమైన జయదేవ్‌గారిని అభినందిస్తున్నాను. మాకంటే ముందు ఎందరో మహానుభావులు కృషే ఈ తెలుగు సినిమా అభివృద్ధికి కారణం`` అన్నారు.
జమున మాట్లాడుతూ ``ఎందరో గొప్ప గొప్ప దర్శకులు, నటీనటులను సినిమా తల్లి పుట్టినరోజు పండుగరోజున ఒకే వేదికపైకి తీసుకురావడమనేది గొప్ప విషయం`` అన్నారు.
కృష్ణవేణి మాట్లాడుతూ ``1935లో సతీ అనసూయలో నన్ను బాలనటిగా పరిచయం చేసిన గురువుగారు సి.పుల్లయ్యగారికి ధన్యవాదాలు. తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు పండుగకు కారణమైన రెంటాల జయదేవ్, ఈ వేడుకను నిర్వహిస్తున్న రామసత్యనారాయణ, సాయివెంకట్, బాజ్జీ, రావిపల్లి రాంబాబును అభినందిస్తున్నాను`` అన్నారు.
కె.రాఘవ మాట్లాడుతూ ``సినిమా తల్లి గొప్పతనం గురించి నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మధ్యలో సినిమాలు డౌన్ అయిన తెలుగు సినిమా గొప్పతనం ఇప్పుడు మరింత పెరుగుతుంది. ఈ గొప్పతనం ఇంకా పెరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
రెంటాల జయదేవ్ మాట్లాడుతూ ``84 ఏళ్ళ తెలుగు సినిమా ప్రస్థానంలో ఎందరో గొప్పవారున్నారు. అందరిలో కృష్ణవేణమ్మగారు, రావు బాలసరస్వతిగారు వంటి మహిళామణులు ఉండటం, ఇంత మంది గొప్ప వ్యక్తుల మధ్య నేను కూర్చొని ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మందిలో కృష్ణవేణిగారు,జమునగారు, శతాధిక దర్శకుడు కోడిరామకృష్ణగారు, ఆయన గురువుగారు దాసరి నారాయణరావుగారు, ఎన్నో గొప్ప చిత్రాలను అందించిన కె.రాఘవగారు వంటి వ్యక్తులు పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చే కమిటీకి కనపడలేదా? వీరు అర్హులు కారా? అనే సందేహం వస్తుంది. తెలుగు వారి కంటే తమిళులు గొప్పవారని నా భావన ఎందుకంటే వారికి సంబంధించిన విషయాలను వారు చాలా భద్రంగా దాచుకుంటారు. 1931 అక్టోబర్‌లో తొలి తమిళ సినిమా కాళిదాసుకు సంబంధించిన ప్రూఫ్ వారి దగ్గర ఉంది. కానీ తెలుగువారి తొలి సినిమాకు సంబంధించిన ఆధారమేది లేదు. ఈ విషయాన్ని నేను చెన్నైలో పనిచేసేటప్పుడు ఓ సినీ చరిత్రకారుడు నాతో అన్నాడు. అప్పుడు తొలి తెలుగు సినిమా ఎప్పుడు పుట్టిందనే విషయంపై నేను ఆరా తీయడం ప్రారంభించాను. 1931 సెప్టెంబర్ 15న తొలి తెలుగు సినిమా పుట్టిందనడానికి ఆధారం దొరకలేదు. అంటే తేది తప్పు ఉండవచ్చును కదా, అనే భావన కలిగింది. నేను డిల్లీ, బాంబే ఇలా చాలా ప్రాంతాలు తిరిగాను. భక్తప్రహ్లాద సినిమాను నిర్మించింది శ్రీ కృష్ణా ఫిలింస్ బ్యానర్‌పై బాంబేకు చెందిన నిర్మాతలు నిర్మించారు. ఆ ముంబై గెజెట్‌లో ఇష్యూ చేసిన సెన్సార్ సర్టిఫికేట్‌ను పరిశీలిస్తే తొలి తెలుగు సినిమా ఫిభ్రవరి 6, 1932న విడుదలైందని తెలిసింది. ఇలా నేను పరిశోధన చేయడానికి కారణం నా ముందు ఎంతో మంది గొప్ప గొప్ప పాత్రికేయులే నాకు ఆదర్శం. ఇలాంటి పరిశోధనలు ఎన్నో జరగాలి. అప్పుడే తెలుగు సినిమాకు సంబంధించి మరుగున పడిపోయిన ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి`` అన్నారు.