Dasari Narayana Rao Condolence meet by Telugu film industry at Ramanaidu Kala Mandapam
దర్శకరత్న డా.దాసరికి సంతాపం తెలియజేసిన తెలుగు చిత్ర పరిశ్రమ
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా 151 సినిమాలను దర్శకత్వం వహించిన దర్శకరత్న డా.దాసరి నారాయణరావు మే 30న పరమపదించిన సంగతి తెలిసిందే. ఆయన మరణానికి తెలుగు చిత్రసీమ సంతాపాన్ని తెలియజేస్తూ శనివారం రామానాయుడు స్టూడియోలో సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీకి చెందిన అన్ని శాఖలు వారు విచ్చేసి తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ..
గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ - ``సినిమా పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌లో తనెంటో చాటుకున్న వ్యక్తి దాసరిగారు. సినిమాకు సంబంధించిన అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించడం అంత సులభం. దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని చెప్పిన వ్యక్తి కూడా దాసరిగారే. ఆయన హాస్పిటల్లో చేరడానికి కొన్నిరోజుల ముందు నేను ఆయనతో మాట్లాడాను. ప్రతి చిన్నవాడికి భరోసానిచ్చిన వ్యక్తి దాసరి. ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను`` అన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ - ``దాసరినారాయణరావుగారి కడసారి చూపులు నాకు దక్కకపోవడం నాకెంతో అసంతృప్తిని కలిగించింది. నేను ఆ సమయంలో నేను విదేశాల్లో ఉన్నాను. ఆయన కడసారి మాట్లాడిన పబ్లిక్ ఫంక్షన్ నా సినిమాయే. ఆయన పుట్టినరోజు సందర్భంగా అల్లు రామలింగయ్య అవార్డును అందచేసినప్పుడు ఆఖరిసారిగా మాట్లాడి తన ఆశీస్సులు అందచేశారు. నేను ఆయన హాస్పిటల్‌లో ఉండగా వెళ్ళి కలవగానే ఆయన పేపర్‌పై నీ సినిమా స్కోరెంత అని రాశారు. హయ్యస్ట్ గ్రాసర్ అని చెప్పగానే చిన్నపిల్లాడిలా విజయ సంకేతం చూపి చప్పట్లు కొట్టారు. ఆయనింట్లో ఓ సమావేశం జరిగినప్పుడు మేం వెళ్ళినప్పుడు నాపై ఎంతో ఆప్యాయత, తండ్రి వాత్సల్యాన్ని చూపించారు. ఆయన లేకపోవడంతో సినీ కార్మికులందరూ అనాథలయ్యారు. ఆయన లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరు`` అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ``దాసరి మరణ సమయంలో మేం ఇక్కడ లేకపోవడం బాధాకరం. పాలకొల్లులో మా నాన్నగారికి, దాసరికి రిలేషన్ ఉన్నా, నాకు చెన్నైలోనే తెలుసు. ఆయన డైరెక్టర్ కాబోతున్న సమయంలో నన్ను పాండిచ్చేరిలో కలిసి మాట్లాడారు. నాన్నగారు నిన్ను ఫిలిం ఇండస్ట్రీకి రమ్మంటే నువ్వు రానని అన్నావంట..నువ్వు రా..అని అన్నారు. ఆ సమయంలో ఆయన తాతా మనవడు సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలోకి నన్ను రమ్మని ఆహ్వానించిన వారిలో దాసరిగారే ప్రథములు. నా తొలి సినిమా బంట్రోతు బార్యకు ఆయనే దర్శకుడు. తర్వాత దేవుడే దిగి వస్తే సినిమాను కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. మా గీతాఆర్ట్స్ బ్యానర్ పునాదులు బలంగా వేయడంలో ఆయనెంతో సపోర్ట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి కావాల్సిన వ్యక్తి ఎవరని ఈరోజు మనం వెతుక్కోవాల్సి వస్తుంది. ఇది ఇండస్ట్రీకి ఎంతో లోపం. ఆయన ఇండస్ట్రీకి, వర్కర్స్‌కు మధ్య వారధిగా వ్యవహరించారు. ప్రతి చిన్నవాడు కొట్టగలిగే పెద్ద తలుపు దాసరి నారాయణరావుగారిల్లే. ఆయనలాంటి అప్రోచ్ ఎవరా అని ఇప్పుడు వెతుక్కోవాల్సి ఉంది`` అన్నారు.
డి.సురేష్‌బాబు మాట్లాడుతూ - ``దాసరిగారు లేకపోవడం మనకు తీరని లోటు. మా నాన్నగారికి మంచి స్నేహితుడు. 151 చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకులకు మంచి గుర్తింపు తెచ్చారు. ఆయన సాధించిన ఘనతను మరెవరూ సాదించలేరు.
శివరామకృష్ణ మాట్లాడుతూ - ``ఎవరికైనా ఏ సమస్య వచ్చినా ఆయనింటి తలుపు తట్టవచ్చుననే ధైర్యం ఉండేది. ఆయన స్థానాన్ని భర్తి చేయగల వారెవరూ లేరు. నిర్మాతలు బావుండాలని చాలా కార్యక్రమాలు చేపట్టారు. నిర్మాతలకు హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆయనే తీసుకొచ్చారు. ఇండస్ట్రీ కోసం ఆయన సొంత పనులను కూడా పక్కన పెట్టుకున్నారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను`` అన్నారు.
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ``దాసరిగారి గురించి చెప్పాలంటే తెలుగు భాషలోని అక్షరాలు సరిపోరు. ఆయనలాంటి మహానుభావులు ఇండస్ట్రీలో పుట్టరు`` అన్నారు.
వేణుమాధవ్ మాట్లాడుతూ - ``దాసరిగారు దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, వక్తగా ఎంతో గొప్ప వ్యక్తి. మంచి మనిషి. ఆయన మన మధ్య లేకపోవడం కార్మికులకు అండ కోల్పోయినట్లు అయ్యింది`` అన్నారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ - ``నేను సినిమా రంగంపై ఆసక్తితో చెన్నైకి డిగ్రీ పూర్తి చేయకుండానే వెళ్లాను. నాలాంటి వాళ్ళు ఎందరో చెన్నైలో ఉండటం గమనించాను. ఎలాగెలాగో ఓసారి రాజబాబుగారి మేకప్‌మేన చిన్నగారిని పట్టుకుని దాసరిగారిని వెళ్ళి కలిశాను. ఆయన నువ్వు ముందు డిగ్రీ పూర్తి చేసి రా..తప్పకుండా అవకాశం ఇస్తానని అన్నారు. నేను డిగ్రీ పూర్తి చేసి వెళ్లగానే అన్నమాట ప్రకారం నాకు నీడ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆయన చేయని జోనర్ సినిమా లేదు. ఎవరికీ ఏ కష్టం ఉన్నా తలుపు తడితే పలికే వ్యక్తి ఆయనే. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డువంటిది వచ్చేలా చూడాలి. తెలుగు చిత్ర సీమ హైదరాబాద్‌కు రావడంలో దాసరిగారి కృషి కూడా ఎంతో ఉంది`` అన్నారు.
ఆది శేషగిరిరావు మాట్లాడుతూ - ``నాలుగు దశాబ్దాలు పాటు తెలుగు చిత్రసీమలోనే కాదు, రాజకీయాల్లో, కార్మికులకు అండగా నిలబడ్డారు. ఆయన ఇండస్ట్రీకి చేసిన సేవలే పెద్ద అవార్డులు. ఆయన దాదా సాహెబ్ ఫాల్కే కన్నా గొప్ప వ్యక్తి. జిఎస్‌టి వల్ల సినిమా రేటు పెరిగింది. ఇప్పుడు దానిపై ఇండస్ట్రీ ఆలోచించి చర్యలు తీసుకోవాలి. దాసరిగారి వంటి వ్యక్తి ఉంటే ఈ సమస్యకు ఎప్పుడో పరిష్కారం దొరికేది`` అన్నారు.
కె.యస్.రామారావు మాట్లాడుతూ - ``దాసరిగారి నేర్పిన క్రమశిక్షణ కారణంగానే తెలుగు సినిమా ఇప్పటికీ బావుంది. అందరూ అదే బాటలో నడవాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
రేలంగి నరసింహారావు మాట్లాడుతూ - ``దాసరిగారి ప్రతి నెలా ఆర్ధికంగా ఇబ్బందులు పడేవారికి కొంత డబ్బు పంపేవారు. ఓసారి ఆయన దగ్గర డబ్బు లేకుండా ఆయన ఫిక్స్‌డ్ డిపాజిట్ నుండి తీసిచ్చారు. ఆయన దగ్గర నేను నందిలాంటి వాడిని. నాలాంటి నందులు ఎందరో ఆయనకున్నారు. ఎవరు మమ్మల్ని చూసినా గురువుగారు ఎలా ఉన్నారని అడిగేవారు. ఇప్పుడు అడిగేవారికి మేం ఏమని సమాధానం చెప్పాలో తెలియడం లేదు`` అన్నారు.