గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`ఖయ్యుం భాయ్`. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి కట్టా శారద చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్లైమాక్స్ సన్నివేశాలను, ప్యాచ్ వర్క్ ను హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో మంగళవారం షూట్ చేసారు. దీంతో సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా సెట్స్ లో గుమ్మడికాయ వేడుకను నిర్వహించారు. అనంతరం
నయీమ్ పాత్రధారి కట్టా రాంబాబు మాట్లాడుతూ ``భరత్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. మూడు నెలల పాటు ఎంతో కష్టపడి చిత్రీకరణ చేశాం. కష్టమైనా ఇష్టంగా టీమ్ అంతా కలిసి పనిచేశాం. పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఎడిటర్ గౌతం రాజు గారు సినిమా చూసి మెచ్చుకున్నారు. ధీమాగా ఉండొచ్చని నమ్మకంతో చెప్పారు. ప్రేక్షకులందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాం. మే మూడవ వారంలో సినిమా రిలీజ్ చేస్తున్నాం` అని అన్నారు.
దర్శకుడు భరత్ మాట్లాడుతూ`` సెప్టెంబర్ 18న సినిమాను అమరావతిలో ప్రారంభించాం. నేడు హైదరాబాద్ అల్యుమినియం ప్యాక్టరీలో షూటింగ్ పూర్తిచేశాం. చిత్రీకరణ సమయంలో అడ్డంకులు ఎదురైనా వాటన్నింటిని తట్టుకుని మూడు నెలలు పాటు అహర్నిశలు టీమ్ అంతా శ్రమించి షూటింగ్ పూర్తిచేశాం. నిర్మాత కట్టా శారదా చౌదరి గారు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అడిగిందల్లా ఇన్ టైమ్ లోనే సమకూర్చారు. అందువల్లే మంచి అవుట్ ఫుట్ తీసుకురాగలిగాం. గతంలో నేను చేసిన `మైసమ్మ ఐపీఎస్` చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ సక్సెస్ ను ఈ సినిమా మించి పోతుంది. నా కెరీర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది. మే లో సినిమా రిలీజ్ చేస్తున్నాం` అని అన్నారు.
చిత్ర నిర్మాత కట్టా శారద చౌదరి మాట్లాడుతూ, ` మంచి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. క్వాలిటీ కోసం భారీగా ఖర్చు చేశాం. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులంతా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
ఛాయాగ్రాహకుడు శ్రీధర్ మాట్లాడుతూ, ` సినిమా చాలా రియల్ స్టిక్ గా వచ్చింది. ప్రతీ సన్నివేశం వాస్తవానికి అద్దం పడుతుంది. సాంకేతిక పరంగాను సినిమా హైలైట్ గా ఉంటుంది` అని అన్నారు.