జగపతిబాబు కొత్తగా `క్లిక్ సినీ కార్ట్`ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.
దాసరి నారాయణరావు, మురళీమోహన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ్, ఐటీ సెక్రటరీ జయేష్ పాల్గొని జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
జగపతిబాబు మాట్లాడుతూ ``ఈ వెబ్‌సైట్ పరిశ్రమకి చాలా ముఖ్యమని నా భావన. వి.బి.రాజేంద్రప్రసాద్‌గారి అబ్బాయినే అయినప్పటికీ నేను 8 నెలలు ఇక్కడ కష్టపడ్డాను. చాలా సార్లు నాలో నేను ఏడ్చుకున్నాను. ఇంత అండ ఉన్న నా పరిస్థితి ఇలా ఉంటే, మిగిలిన వారి స్థితి ఏంటి? అనే ఆలోచన వచ్చింది. దాని ఫలితమే ఈ వెబ్‌సైట్. కొత్తవాళ్లని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టాం. సెల్ఫీ తీసి పోస్ట్ చేస్తే చాలు. ఉచితమే. ప్రస్తుతం నిర్మాతలుగా రావాలనుకున్నవారు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మామూలుగా వారు నేరుగా పరిశ్రమకు వస్తే మోసపోయే ప్రమాదం ఎక్కువ. పది రింగులు చేతికి పెట్టుకుని వస్తున్న వారు ఒక్క రింగు కూడా లేకుండా వెనక్కి వెళ్లడం నాకు బాగా తెలుసు. చెప్పులు కూడా లేకుండా వెళ్తున్నారు. కానీ మనసుంటే సంతోషంగా ఇందులో గెలవొచ్చు. ఈ సైట్‌ను ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేస్తాం. పదేళ్ల ప్లాన్ ఉంది మాకు. ఇది సినిమాకు సంబంధించి ఒన్ స్టాప్ షాప్ అవుతుంది. నామీద నాకు నమ్మకం ఎక్కువ. నేను ఇప్పటిదాకా ఏదైనా తిన్నగానే సంపాదించాను. దీనికి యుఎస్‌లోనూ బ్రాంచ్ ఉంది. శ్రీధర్ బండారి, రమేష్ బండారి మాకు అక్కడ సాయం చేస్తున్నారు. ఇది కెమెరామేన్ సురేంద్రరెడ్డి బ్రెయిన్ చైల్డ్. డ్యాన్స్ మాస్టర్ విద్యాసాగర్ కూడా మాకు సహకరిస్తున్నారు. మా నాన్నకు రెండు కోరికలు మిగిలిపోయాయి. మా ముగ్గురు సోదరులకు అమ్మాయిలే. సో వారసుడు లేరనే కొరత ఆయనకు ఉండేది. అలాగే నాతో హిట్ చేయలేకపోయాననే బాధ కూడా ఉండేది. ఇప్పుడు మా జగపతి సంస్థను రీలాంచ్ చేస్తున్నాం. ఈ ఏడాది రెండు సినిమాలు చేస్తున్నాం. అందులో ఈ పోర్టల్‌నుంచి వచ్చిన వాళ్లను కూడా తీసుకునే ఉద్దేశాలున్నాయి. మా నాన్నకు వారసుడు ఈ సంస్థే. ఈ సంస్థలో నేను తప్పకుండా హిట్ కొడతాను. అలా నాన్నగారి రెండు కోరికలను నెరవేరుస్తాను`` అని చెప్పారు.
దాసరి మాట్లాడుతూ ``పరిశ్రమకు కొత్త రక్తం కావాలి. నేను స్వర్గం నరకం సినిమా చేసినప్పుడు అందరూ కొత్తవారితోనే చేశాను. ఆ సినిమా కోసం తిరుపతి, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, కాకినాడలో తలా రెండు రోజుల వంతున ఆడిషన్స్ చేశాం. ఇప్పుడు కొత్తవారు ఎవరూ దర్శకులను నేరుగా కలిసే పరిస్థితి లేదు. కొత్త నిర్మాతలు వచ్చినా వారికి పెద్దవాళ్లతో తమకు పరిచయాలున్నాయని చెప్పి మోసాలు చేసేవారు ఎక్కువవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వెబ్‌సైట్‌తో జగపతిబాబు ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఈ ఆలోచన ఎప్పుడో రావాల్సింది. జగపతిబాబు నిబద్ధత, క్రమశిక్షణ ఉన్న నటుడు. అలాంటి వారి వలనే ఇలాంటి పనులు సాధ్యమవుతాయనిపించి నమ్మాను. మనలోనూ చాలా మంది ప్రతిభావంతులున్నారు. వారికి ఈ వేదిక ఉపయోగపడుతుంది`` అని అన్నారు.
జయేష్ రంజన్ మాట్లాడుతూ ``సినిమా పరిశ్రమకు ఈ సైట్ మరో నౌకరీ డాట్ కామ్ లాగా ఉపయోగపడాలి`` అని చెప్పారు.
హెచ్.టి.కుమారస్వామి మాట్లాడుతూ ``జగపతిబాబు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు సహకారం తప్పక ఉంటుంది`` అని తెలిపారు.
మురళీమోహన్ మాట్లాడుతూ ``సినిమా ఎలా చేయాలో తెలియక చాలా మంది చేతులు కాల్చుకుంటున్నారు. అలాంటి వారికి ఇది ఉత్తమమైన వేదిక అవుతుంది. తన సినిమా ఫ్లాప్ అయినా దాన్ని ధైర్యంగా చెప్పుకోగల ధైర్యం ఉన్న నటుడు జగపతిబాబు. ఆయన చేసే ఈ ప్రయత్నం విజయవంతం కావాలి`` అని చెప్పారు.