దేవుళ్ల పాత్రల్లో ఒదిగిపోయే నటులు విజయ్ చందర్. ఇప్పటివరకూ ఎన్నో భక్తి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. కరుణామయుడిగా.. శిరిడీసాయిబాబాగా ఆయన ఆహార్యం..నటన తెలుగు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. తాజాగా ఇప్పుడు `సాయి నీ లీలలు` అంటూ మరోసారి అలరించడానికి వస్తున్నారు. రాధా చిత్ర పతాకంపై విజయ్ చందర్ ప్రధాన పాత్రలో స్వీయా దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం ఉదయం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది.
అనంతరం విజయ్ చందర్ మాట్లాడుతూ, ` ఈ చిత్రం తెరకెక్కడానికి కారణం సాయి బాబానే. 35 ఏళ్ల క్రితం సాయిబాబా మహత్యం సినిమా చేశాం. మళ్లీ ఇన్నాళ్లకు ఆయనకు నా పై కృప కల్గింది. ఆయన ఆశీర్వాదాల వల్లే మళ్లీ ఈ సినిమా చేస్తున్నాను. భక్తుల కోసం ఆయన బాధ్యతగా నాతో ఈ సినిమా చేయిస్తున్నారు. ఈ సినిమా టీమ్ కూడా బాబా సమకూర్చిందే. సాయి లీలలను ప్రేక్షకులంతా చూసి తరిస్తారని కోరుకుంటున్నాం` అని అన్నారు.
మాటల రచయిత తోటపల్లి మధు మాట్లాడుతూ, ` అక్టోబర్ 18 నాటికి సాయిబాబా సమాధికి 100 ఏళ్లు పూర్తయింది. ఇప్పుడు మళ్లీ సాయి నీలలు సినిమా రావడం ఆనందంగా ఉంది. సాయిబాబా మహత్యానికి అప్పట్లో మాటలు అందించాను. మళ్లీ అదే సినిమాకు పనిచేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. దేవుడి పాత్ర లో విజయ్ చందర్ గారు ఒదిగిపోతారు. గతంలో ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే` అని అన్నారు.
అనంత శ్రీరామ్ మాట్లాడుతూ, ` అప్పట్లో సాయిబాబా మహత్యం సినిమాకు ఆత్రేయ గారు పాటలు రాశారు. ఇప్పుడు సాయి నీ లలకు పాటలు రాసే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఆధ్యాత్మిక సినిమాకు పనిచేయడం కొత్త అనుభూతినిస్తుంది. అలాగే ఈ సినిమాకు నన్నే స్వరకర్త అవ్వమని విజయ్ చందర్ అన్నారు. అందుకు నేను అర్హుడిని కానన్నాను. కానీ ఆయన పట్టుబట్టి మరీ స్వరక్తను చేశారు. ఈ టీమ్ అందర్నీ ఒకే చోట కలిపింది ఆబాబానే` అని అన్నారు.
నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ, ` విజయ్ చందర్ గారు గతంలో చేసిన భక్తి సినిమాలు ఎంత పెద్ద అందరికీ తెలుసు. మళ్లీ భక్తి సినిమా చేయడం అదీ..బాబాగా కనిపించడం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ను ఇస్తుంది. ఈ చిత్రానికి యంగ్ స్టార్స్ పనిచేస్తున్నారు. పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
ఆదిశేష గిరిరావు మాట్లాడుతూ,` విజయ్ చందర్ గారు కరుణామయుడు, సాయిబాబా పాత్రల్లో నటించి ప్రపచమంతా పాపులర్ అయ్యారు. విదేశాల్లో కొన్ని షోస్ కూడా నిర్వహించడంతో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. మళ్లీ ఇన్నేళ్లకు భక్తి సినిమాలో నటిస్తున్నారు. ఇలాంటి సినిమాలకు విదేశాల్లో కూడా చక్కని ఆదరణ లభించాలి. అలాగే జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న సినిమాలను మీడియా ఎక్కువ ప్రమోట్ చేయాలి` అని అన్నారు.
ఈ చిత్రానికి ఆది అనంత్ (అనంత శ్రీరామ్) సంగీతం అందిస్తున్నారు. అలాగే అతిధులుగా హజరైన వారంతా జ్యోతిప్రజ్వల కార్యక్రమంలో పాల్గొన్నారు.