18 January 2015
Hyderabad
జనవరి 18 న మహా నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామా రావు వర్ధంతి సందర్భంగా 'బొమ్మరిల్లు వారి' చిత్ర నిర్మాత దర్శకుడు వై వి ఎస్ చౌదరి ఎన్ టి అర్ ఘాట్ ను సందర్శించి, ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: "ప్రపంచ వ్యాప్తంగా వున్నా చాలా మంది తెలుగు ప్రజలకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దివ్య మోహన రూపం.. ఆయన సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు ఎందరికో స్పూర్తి నిచ్చింది, రాజకీయాలలో ఉన్నప్పుడు మరెందరినో చైతన్యవంతుల్ని చేసింది, ఇంకెంతోమందికి మార్గదర్శకంగా నిలిచింది. ఆయన జీవన విధానం ద్వారా చాలా ఆశయాలని మన ముందు వదిలి వెళ్ళారు. ఏ పనినైనా అంకితబావంతో చేయడం, అ పనిని సాధించటంలో మడమ తిప్పని పోరాటం చెయ్యటం. ఇండియాలోని ఒక రిక్షాపుల్లర్ నుండి అమెరికాలో వున్నా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల వరకూ వివిధ క్రాఫ్ట్్లలలో వున్న నాలాగా ఎంతోమందికి ఆయన తన ఆశయాల ద్వారా, ప్రసంగాల ద్వారా ఒక స్పూర్తిని, ఉత్తేజాన్ని ఇచ్చారు. అంతే కాకుండా హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలచిన మహాభారత, రామాయణ, భాగవతాల పాత్రలకు సజీవ రూప కల్పన చేసి మన కళ్ళముందు కనిపించి, అసాధ్యాలను సుసాధ్యాలుగా మలుస్తూ ఒక కారణజన్ముడిగా, యుగపురుషుడిగా అవతరించారు.
ఆయన నాకు దేవుడు, నాలాగా ఎంతోమందికి ఆయన దైవసమానం. ఆయన మీద వున్నా అభిమానం తోనే నేను సినీ పరిశ్రమకు వచ్చాను. నాకై ఒక సొంత సినీ నిర్మాణ సంస్థ "బొమ్మరిల్లు వారి" ని స్తాపించాను. నా ప్రతీ సినిమా ప్రారంభానికి ముందు ఆయన ఫొటోపై ప్రార్ధనాగీతంతో సినిమా మొదలవుతుంది అదే ఫొటోపై కృతజ్ఞతాగీతంతో సినిమా పూర్తి అవుతుంది. ఆ విధంగా ఆయన్ని నేను ఎల్లప్పుడూ దేవుడిగానే పూజిస్తాను. పైనుండీ ఆయన నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారనే నా నమ్మకం. నమ్మకమే కాదు ఇది నిజం. దీనికి ఉదాహరణ నా జీవితంలో ఒక సంఘటన జరిగింది.
నా పెళ్లి అయిన కొన్నాళ్ళకు నా భార్య గీత తొలిసారిగా గర్భం దాల్చింది, దురదృష్టవశాత్తు అది నిలబడలేదు. ఆ బాధతో నేను దేవాలయంగా భావించే ఆయన సమాధి (ఎన్ టి అర్ ఘాట్ ) కి వెళ్ళాను. భగవంతుడి ముందు భక్తుడిలా మోకరిల్లి ఆయన్నే స్మరించుకుంటూ "అన్నా..! నీ స్పూర్తి తోనే సినిమా రంగానికి వచ్చాను. నీ ఆశీర్వాదంతోనే అన్నీ శుభంగానే జరుగుతున్నాయి. తొలిసారిగా నా సంతాన విషయంలో చెడు జరిగింది. మీరు కారణజన్ములు, యుగపురుషులు నాకు ఒక మంచి బిడ్డని ప్రసాదించు నీ ఆశీర్వాదం నాకు అందించు అన్నా" అని వేడుకున్నాను. అంతే.. అతి తక్కువ కాలం లోనే నా భార్య గర్భం దాల్చటం, ఒక పండంటి ఆడబిడ్డను కనడం జరిగింది.
ఆ పాపే నా పెద్ద అమ్మాయి యలమంచిలి యుక్త.
నేను ఇప్పటివరకు నేను ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశాను. "రేయ్" చిత్రానికి విదేశాల్లో షూటింగ్ జరుపుతున్న సమయంలో కలిగిన ఎన్నో ఆటంకాలను మీ పోరాటస్పూర్తితో అధిగమించి ఒక అద్భుతమైన రిజల్ట్ చూడాలని ఒకే ఒక్క తపనతో సిన్సియర్ గా వర్క్ చేశాను. దానివల్ల చిత్రంపై ఫైనాన్షియల్ బర్డన్ పెరిగింది. ఆ బర్డన్ వల్లే సినిమా రిలీజ్ డిలే అవుతూ వచ్చింది. నా ఫైనాన్సియర్స్, డిస్ట్రిబ్యూటర్స్, నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో అతి త్వరలో "రేయ్" చిత్రాన్ని విడుదల చేయటానికి అన్ని సన్నాహాలు చేస్తున్నామని చెప్పటానికి సంతోషిస్తున్నాను. ఈ రోజు ఆయన వర్ధంతి కాబట్టి నేను దేవుడిగా భావించే ఆయన్ని, ఈ సినిమా విడుదల ప్రయత్నంలో ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు కలగకుండా నన్ను మరొక్కసారి ఆశీర్వదించమని దేవాలయం లాంటి ఆయన ఘాట్ కి వచ్చి ప్రార్ధిస్తున్నాను" అని అన్నారు.