యువ కథానాయకుడు నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం `అర్జున్ సురవరం`. బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై టి.సంతోష్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 29న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. నవంబర్ 26న ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పీపుల్స్ ప్లాజాలో నిర్వహింంచారు. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిగ్ టికెట్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా..
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ``ఈ ఫంక్షన్‌కి నేను రావడం చాలామందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను బిజీగా ఉంటాను కాబట్టి నన్ను ఫంక్షన్‌కి రమ్మని ‘ఠాగూర్’ మధు ఇబ్బంది పెట్టరు. మరి ఎవరి ప్రభావంతో.. ఎవరి ప్రమేయంతో వచ్చానన్నది చాలా మందికి అనుమానం ఉండొచ్చు. ఇప్పటి వరకూ ఏ ఫంక్షన్‌కైనా నన్ను పిలిస్తే వెళ్లాను. కానీ, ‘అర్జున్ సురవరం’ సినిమాకి ఫంక్షన్ పెట్టుకోండి, ముఖ్య అతిథిగా వస్తానని చెప్పి మరీ పెట్టించుకున్నా(నవ్వుతూ). నిజం చెప్పాలంటే ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన తర్వాత నేనే రావాలనుకున్నా. ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని వచ్చా. నిర్మాత రాజ్‌కుమార్ మరొక ప్రధానమైన కారణం. ఎక్కడైనా పైరసీ జరుగుతుంటే సైబర్ పోలీసుల్లా వెళ్లి తనకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని పూర్తీగా ధ్వంసం చేసి, ఇండస్ట్రీకి గొప్ప సహాయం చేస్తున్నాడు. తను సినిమా తీస్తున్నాడనే విషయం, తన వెనక ‘ఠాగూర్’ మధు ఉన్నాడనే విషయం నాకు తెలియదు. ఓ రోజు వచ్చి సినిమా తీశాననగానే ఆశ్చర్యంగా అనిపించింది.. ప్రివ్యూ చూశాక ఫంక్షన్‌కి పిలుస్తారేమో అనుకుంటే పిలవలేదు. నన్ను పిలవడానికి కూడా తనకి మొహమాటం. ఈ సినిమా గురించి ప్రజలకు చెప్పాలంటే నా వంతు సపోర్ట్ చేస్తానని చెప్పాను. అలాగే హీరో నిఖిల్ సినిమాలు గతంలో ఒకటి, రెండు చూశా. కానీ, కలిసే సందర్భం రాలేదు. ఈ సినిమా ప్రీమియర్ షోలో నన్ను చూడగానే తను ఎగ్జైట్ అయిన విధానం చూస్తే నాకు మరో తమ్ముడు, శిష్యుడు దొరికాడని సంతోషం కలిగింది. ప్రేమించే మనుషులు దొరకడం బ్యాంక్ బ్యాలెన్స్‌గా భావిస్తా. నిఖిల్ వల్ల నా బ్యాంక్ బ్యాలెన్స్ మరింత పెరిగిందనుకుంటున్నాను. ఇక దర్శకుడు సంతోష్ తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగు సినిమా చేశాడు. కథ బాగుంటే భాషతో సంబంధం లేదు.. ఎవరైనా ఆదరిస్తారు. లవర్‌బాయ్‌గా ఉండే నిఖిల్ ఈ సినిమాతో యాక్షన్ హీరోగా మారాడనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా ఇది. ఎందుకంటే కంటెంట్‌తో కనెక్ట్ అవుతారు. స్మార్ట్ ఫోన్స్ వాడుతున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పే చిత్రమిది. మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత చూడాలి. ఇలాంటి మంచి సినిమాల ఫంక్షన్స్‌కి నేనున్నాను అంటూ ముందుకొచ్చే నా సోదరుడు తలసానిగారికి అభినందనలు. ఈ సినిమాలోని ‘చేగువేరా..’ పాట చూస్తున్నప్పుడు నా తమ్ముడు పవన్ కల్యాణ్ గుర్తొచ్చాడు’’ అన్నారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ – ‘‘ఇదొక మంచి కథ. తప్పకుండా ప్రేక్షకులు మంచి చిత్రాన్ని ఆదరించి హిట్ చేయాలి. ‘బాహుబలి, సైరా నరసింహారెడ్డి’ లాంటి సినిమాలు ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ సత్తా చాటాయి. చిరంజీవిగారు టీవీ సీరియల్స్, సినిమా ఫంక్షన్స్‌తో పాటు ఇలాంటి చిన్న సినిమాల వేడుకలకు రావడం చాలా సంతోషం. ఆయన రావడం వల్ల చిన్న సినిమాల స్టామినా పెరిగి జనాల్లో క్రేజ్ వస్తుంది.. అందుకే ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కు’’ అన్నారు.
చిత్ర నిర్మాత రాజ్‌కుమార్ అకెళ్ల మాట్లాడుతూ– ‘‘మెగా స్టార్ గారిని కలవడమే ఒక కల. అలాంటిది నేను ఓ సినిమా నిర్మించడం, ఆ ఫంక్షన్‌కి చిరంజీవిగారు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకున్న కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒకడిని. ఆయన ‘ఛాలెంజ్’ సినిమా స్ఫూర్తి నన్ను ఈ రోజు వరకూ ముందుకు నడిపిస్తోంది. చాలా సమస్యలను అధిగమించి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాము. తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను’’ అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – ” నా దేవుడు చిరంజీవి గారి ముందు ఇక్కడ మాట్లాడడం హ్యాపీ గా ఉంది. నేను వచ్చింది ఆయనదగ్గరనుండే. రాజ్ కుమార్ గారు నాకు చాలా కాలంగా తెలుసు రాజ్ కుమార్ గారు, ఠాగూర్ మధు గారు కలిసి ఈ సినిమా నిర్మించడం చాలా సంతోషం. యూత్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ .తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది” అన్నారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ – ” అభిమానుల మధ్య కూర్చొని నేను కూడ సందడి చేయాలనుకున్నాను. ఇది నిజమో, కలా అర్థం కావడంలేదు. మాటలు రావడం లేదు. నాలుగు రోజుల నుంచి ఏం జరుగుతుందో తెలియడం లేదు. లెజెండ్ ఆఫ్ఇండియన్ సినిమా మెగస్టార్ చిరంజీవి గారు మా సినిమా ప్రీ-రిలీజ్ కు వస్తారంటే నమ్మలేకపోయాను. కానీ ఆయన వచ్చారు. సాక్షాత్తు సైరా నరసింహారెడ్డి, మా గ్యాంగ్ లీడర్, మా ముఠామేస్త్రీ మా మెగాస్టార్ట్ చిరంజీవి గారు వేదిక పై ఉన్నారు. ఒక సినిమా విడుదల చేయడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇన్ని అడ్డంకులు వచ్చిన కానీ, మంచిసినిమా, ముందుకు వెళ్లాలి అని చిన్న ఆశతో ఉన్న మాకు దేవుడు రూపంలో మా మెగాస్టార్ చిరంజీవి…మా హీరో దేవుడిలా వచ్చిమీ సినిమా పబ్లిక్ లోకి వెళ్లాలి. ప్రేక్షకులు చూడాలి అని వచ్చారు. మా సినిమా షో మూడు గంటలకు అంటే ఐడునిమిషాలు ముందే వచ్చారు ఆయన, అది చూస్తుంటే మాలాంటి యువ హీరోలకు భయం వేస్తుంది. అదీ చూస్తుంటే ఎంత కష్టపడితే, అసలు మేం చేయగలుగుతామా? అనే డౌట్ కూడా ఉంది. చిరంజీవిగారికి థ్యాంక్స్, చిరంజీవి గారు మా సినిమా చూసి హగ్ ఇచ్చారు. ఆ రోజును ఎప్పటికి మర్చిపోలేను. మొన్నటి వరకు నేను చిరంజీవి గారి అభిమానిని. నేటి నుంచి ఆయన భక్తుడ్ని. ఈ చిత్రం ఎప్పటికీ నాకు గుర్తిండిపోతుంది. చాలా నిజాయితీగా తీశాం. మంచి సినిమా థియేటర్స్ లో చూడండి. అలాగే ఇక్కడికి వచ్చిన తలసానిగారికి ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.
చిత్ర దర్శకుడు టి.సంతోష్ మాట్లాడుతూ – ‘‘ తెలుగులో నా తొలి చిత్రమిది. మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన చిరంజీవిగారికి, ఆయన అభిమానులకు థ్యాంక్స్. చాలా మంది నన్ను అడిగారు అర్జున్ సురవరం అంటే ఏంటి? అని అర్జున్ అంటే క్లీన్. ఈ సినిమాలో అర్జున్ క్యారెక్టర్ క్లీన్, ప్యూర్ రిపోర్టర్. సురవరం అనేది సీనియర్ జర్నలిస్ట్ సురవరం ప్రతాప రెడ్డి గారి ఇన్స్పిరేషన్ తో తీసుకోవడం జరిగింది. అలాగే మా నిర్మాతలు మధు, రాజ్ కుమార్ గారికి థాంక్స్” అన్నారు.
దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ - ``నిఖిల్ గురించి ఎంత మాట్లాడినా నా స్వంత తమ్ముడి గురించి మాట్లాడినట్టే ఉంటుంది. కాబట్టి నిర్మాత రాజ్‌కుమార్‌గారి గురించి మాట్లాడుతాను. సినిమాపై ఆయనకున్న తపన, ప్యాషన్ నాకు 12 ఏళ్లుగా తెలుసు. ఆయన తపన గుర్తించాడు కాబట్టి మెగాస్టార్ చిరంజీవిగారు ఈ ఫంక్షన్‌కి వచ్చారు. ఆయన వచ్చారంటే ఆటోమెటిక్‌గా ప్రేక్షకులు కూడా వస్తారు. దాంతో పాటు సక్సెస్ కూడా వస్తుంది`` అన్నారు.
హీరోయిన్ లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ ‘‘ఈ ఏడాది విడుదలవుతున్న నా మొదటి తెలుగు సినిమా ఇది.. రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా ఉన్నా’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజా రవీంద్ర, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, వివేక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.