నాగచైతన్య, సమంత జంటగా నటించిన సినిమా `మజిలి`. శివ నిర్వాణ దర్శకుడు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మాతలు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో
నవీన్ ఎర్నేని తొలి పాటను విడుదల చేశారు. రెండో పాటను సందీప్ వంగా విడుదల చేశారు. పరశురామ్ మూడో పాటను విడుదల చేశారు. నాలుగో పాటను బాబీ (కె.ఎస్.రవీంద్ర) విడుదల చేశారు.
థియేట్రికల్ ట్రైలర్‌ను వెంకటేశ్ ఆవిష్కరించారు.
బిగ్‌టికెట్ ను వెంకటేశ్ సౌజన్యంతో నాగార్జున కొన్నారు.
వెంకటేశ్ సీడీలను విడుదల చేసి నాగార్జునకు అందించారు.
చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ ``మజిలీలో రాసే అవకాశం రావడం గొప్ప అదృష్టం. ప్రియతమా పాటను రాసే అవకాశం రావడం మరీ అదృష్టం. గతేడాది `పిల్లారా` పాట రాశా. అది అబ్బాయిల కోసం రాశా. `ప్రియతమా ప్రియతమా`... అమ్మాయిల వెర్షన్. నాలుగున్నర లక్షల వ్యూస్ దాటిపోయింది ఆ పాట. ఈ `మజిలీ` నా కెరీర్‌కు మంచి మజిలీ. మజిలీ అంటే ప్రయాణం కాదు.. ఒక మంచి హాల్ట్. అక్కినేని కుటుంబంలో పాట రాసే అవకాశం కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నా. `మా` టీవీలో ఒకసారి నాగార్జునగారికి రాశా. ఆ తర్వాత `రాజన్న` సినిమాలో మేలుకో బంగారుతల్లీ అనే పాట రాశా. అది అక్కినేని కుటుంబంలో నా తొలి అవకాశం. ఆ తర్వాత ఇదే నాకు లభించిన అవకాశం. అక్కినేని నాగచైతన్యగారు, సమంతగారు జంటగా వివాహానంతరం నటించిన సినిమా ఇది. సమంతగారు సినిమాలో నాగచైతన్యగారి వెంటపడేటప్పుడు ఈ పాట వస్తుంది`` అని అన్నారు.
నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ``మజిలీకి చాలా మంచి బజ్ ఉంది. పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం`` అని చెప్పారు.
సందీప్ వంగా మాట్లాడుతూ ``నాగచైతన్య, సమంతను పెళ్లి తర్వాత ఆన్‌స్క్రీన్‌లో చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నేను పాటలు విన్నాను. బావున్నాయి. చక్కగా తెరకెక్కించారని కూడా అర్థమవుతోంది. శివ `నిన్నుకోరి`లో లవ్ సైడ్ చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో ఫ్యామిలీ సైడ్ బాగా చూపించారని టీజర్ చూస్తే అర్థమైంది`` అని చెప్పారు.
రాంబాబు గోసాల మాట్లాడుతూ ``అన్నపూర్ణ స్టూడియోలో `ఉయ్యాల జంపాలా` సినిమాకు నాకు బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత `అర్జున్ రెడ్డి`లో బ్రేకప్ సాంగ్ రాశా. `ఏమాయచేసావె` నేను సమంతగారికోసం వరుసగా ఐదుసార్లు చూశా. ఇవాళ వారి సినిమాకే పాట రాయడం ఆనందంగా ఉంది. బ్యాడ్‌లక్ ఏంటంటే నా పాటలో సమంతగారు లేరు. మరోనాయిక ఉన్నారు. శివనిర్వాణగారు నాతో మంచి సాహిత్యం రాయించారు`` అని తెలిపారు.
కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాట్లాడుతూ ``నాకు టీజర్ చాలా నచ్చింది. నేను సినిమా కోసం వెయిటింగ్`` అని అన్నారు.
తమన్ మాట్లాడుతూ ``మజిలీ పేరును అనౌన్స్ చేసినప్పుడే నేను నాకు తెలిసిన దర్శకుడు కృష్ణచైతన్యను ఇతని నెంబర్ అడిగా. ఆయన చాలా సెన్సిటివ్ సినిమా చేశాడు. నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఈ సినిమాకు మంచి లైఫ్ ఉంది. నేను దీనికి కాస్త ఆక్సిజన్ చేశాను. నేను జీవితంలో `మౌనరాగం` లాంటి సినిమా చేయాలనుకున్నా. `తొలిప్రేమ`లాంటి సినిమాలకు ప్రాణం పెట్టి పనిచేశా. `మజిలీ`కి గత పది రోజులుగా పనిచేస్తున్నా. రాత్రింబవళ్లు చేస్తున్నాం. చైతూని నేను సినిమాలో ఎలా చూడాలనుకున్నానో, అలాగే ఉన్నాడు. ఈ సినిమా నిర్మాత సాహుతో నేను రాత్రిపూట క్రికెట్ ఆడుతాను. నేను, సమంత ఒకే సినిమాతో కెరీర్ ప్రారంభించాం. రవివర్మన్ అనే డీఓపీ చేసిన `మాస్కోవిన్ కావేరి` ఆ సినిమా పేరు. ఆయన తమిళ్‌లో మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అక్కడి నుంచి మేం ఇలా వచ్చాం. ఆమె బ్రిలియంట్ ఆర్టిస్ట్. సౌత్ ఇండియాలో ఆమె చాలా చక్కటి నటి. ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతుందని నమ్ముతున్నా. సినిమాలో తన బ్రెయిన్ ఏం కోరుకుంటే దాన్నే రీరికార్డింగ్ చేశా. చెన్నైలో 70 మంది వయొలిన్, ముంబైలో ఫ్లూట్... ఇలా లైవ్ చేస్తున్నాం. గోపీ, నేను కలిసి 60 సినిమాల దాకా కీ బోర్డు ప్లేయర్‌గా పనిచేశాం. మణిశర్మగారి దగ్గర చేశాం. ఆయన కంపోజర్, ప్రోగ్రామర్. చాలా మంచి మెలోడీ సెన్స్ ఉన్న వ్యక్తి`` అని తెలిపారు.
శివ నిర్వాణ మాట్లాడుతూ ``మజిలీ అనేది అందమైన హాల్ట్. 20 ఏళ్ల వయసులో ఎంతైనా పరిగెడతాం. అదే 40 ఏళ్ల వయసులో అంత పరిగెట్టలేం. అందుకే ఎంత పరిగెట్టాలి, ఎంత కంపోజ్డ్ గా ఉండాలని చెప్పేదే మ్యారేజ్. ఈ మొత్తం ప్రయాణంలో నువ్వు సేదతీరే ఓ పాయింట్‌నే పెళ్లి అని పేరు పెట్టాం`` అని అన్నారు.
రేవంత్ మాట్లాడుతూ ``చాలా మంచి పాట పాడా. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నా`` అని చెప్పారు. \పరశురామ్ మాట్లాడుతూ ``నాగచైతన్య, సమంతగారు నటించిన `ఏమాయచేసావె` సినిమా చూసి కెరీర్లో ఎప్పుడైనా ఇలాంటి లవ్‌స్టోరీ చేయగలనా అని అనిపించింది. ఆ స్ఫూర్తితోనే నేను `గీతగోవిందం` చేశా. పెళ్లయ్యాక చైతూ, సమంతగారు నటించిన ఈ సినిమా వారి జీవితంలో మేలు `మజిలీ`లా ఉండాలని కోరుకుంటున్నా. శివ, నేను కలిసి కొన్ని ప్రాజెక్టులకు పనిచేశాం. శివ ఈ సినిమాతో ద్వితీయ విఘ్నాన్ని అవలీలగా దాటేస్తాడని నమ్ముతున్నా`` అని చెప్పారు.
దివ్యాంశ కౌశిక్ మాట్లాడుతూ ``శివగారి వల్లే నేను ఈ సినిమాలో చేశా. ఆయన ఓపిక, ఆయన శాంతం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఆయన అంత ఓపిక పట్టబట్టే నేను ఇందులో అంత బాగా నటించాను. నాగచైతన్య చాలా మంచి కోస్టార్`` అని చెప్పారు.
జాని మాస్టర్ మాట్లాడుతూ ``ఈ అవకాశం నాకు ఇచ్చిన డైరక్టర్‌గారికి, అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకు ప్రాణం పెట్టింది శివగారు, డీఓపీ విష్ణుగారు. నాగచైతన్య, సమంతగారికి ధన్యవాదాలు`` అని తెలిపారు.
దర్శకుడు బాబి మాట్లాడుతూ ``శివ నాకు మంచి స్నేహితుడు. దర్శకుడి పర్సనల్ కేరక్టర్‌ని బట్టి, బిహేవియర్‌ని బట్టి, సినిమాలోని హీరోల పాత్రలు రిఫ్లెక్ట్ అవుతాయని రవితేజగారు ఒకసారి చెప్పారు. శివనిర్వాణ పాత్రలను బట్టి ఆయన గురించి తెలుసుకోవచ్చు. నాగచైతన్య ఎప్పుడూ దర్శకుడి పనిలో వేళ్లూ, కాళ్లూ పెట్టడు. అతన్ని అంత బాగా పెంచినందుకు నాగార్జునగారిని మెచ్చుకోవాలి. సమంత నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా చాలా బాగా వచ్చిందని తమన్ చెప్పాడు`` అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ``చాలా మాట్లాడుదామని అనుకున్నాను. కానీ థియేట్రికల్ ట్రైలర్ చూశాక నా పరిస్థితి వేరుగా ఉంది. సినిమా మొత్తం ఒకసారి గుర్తుకొస్తోంది. నేను `నిన్నుకోరి` తర్వాత జోనర్ మారుద్దామనుకున్నా. అప్పుడు నాగచైతన్యగారు నాకు ఫోన్ చేసి `నీ సినిమా నాకు నచ్చింది. నీకు నచ్చిన కథ ఉంటే తీసుకురా చేద్దాం` అని అన్నారు. ఆ సమయంలో నా దగ్గర కథ లేదు. నేనప్పుడు వేరే కథల మీద ఆలోచిస్తున్నా. ఆ తర్వాత 20 రోజుల తర్వాత నేను ఎటో వెళ్తుండగా ఓ ఐడియా ఫ్లాష్ అయింది. అది ఫ్లాష్ కావడమే చైతన్య అనే ఇమేజ్‌తో ఫ్లాష్ అయింది. అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ కథకు ఆ ఐడియా స్టార్ట్ కావడమే ఒక ఇంటర్వెల్ షాట్‌తో స్టార్ట్ అయింది. వెంటనే చైతన్యగారి దగ్గరకు వెళ్లి ఈ ఐడియా చెప్పా. నాకు స్వతహాగా గతమన్నా,జ్ఞాపకాలన్నా ఇష్టం. ఆ ఇష్టాన్ని చక్కగా ప్రేమతో కథగా రాసి, స్క్రీన్ మీద చూపించుకోవాలనుకుంటా. దాన్ని మీరందరూ మెచ్చుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ కథ రాసుకుంటున్నప్పుడు శ్రావణి పాత్ర చాలా బాగా వచ్చింది. పొటెన్షియల్ పెరుగుతూ వచ్చింది. అలాంటి సమయంలో పూర్ణ కేరక్టర్‌ని భరించేంత శక్తి , సామర్థ్యం, కెపాసిటీ, ప్రేమ ఏదైనా.. ఒక ఆడపిల్లకు ఉండే అన్నీ కావాలి ఆ పాత్రకు. అందుకే నేను వెంటనే చైతన్యగారితో సమంతగారిని అడుగుదామని చెప్పా. మార్కెట్ చేసుకోవాలని నేను వాళ్లిద్దరినీ పెట్టలేదు. వాళ్ల నటనను గౌరవించి పెట్టా. సమంతగారు సినిమాలో చింపేశారు. కాన్‌ఫ్లిక్ట్, ప్రీ క్లైమాక్స్ ఎమోషన్స్ అన్నీ చాలా బాగా చేశారు. ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ చైతన్య పెర్ఫార్మెన్స్. సినిమా చూసిన తర్వాత చైతన్య కనిపిస్తే ఆయన్ని కౌగిలించుకుని ఏడుస్తారు. సమంతగారు సెట్లో ఉంటే నేను ఆవిడకు తగినంత రాయలేకపోయానా అని అనిపించింది. ఆమెతో ఎన్ని సినిమాలకు పనిచేయడానికైనా నేను సిద్ధమే. రావు రమేశ్, పోసాని పాత్రలు కూడా చాలా బావుంటాయి. పెళ్లి అనేదే నా దృష్టిలో అందమైన లవ్ స్టోరీ. అది పెళ్లకి ముందయినా, తర్వాత అయినా. అసలు ప్రతి పెళ్లీ ఒక లవ్‌స్టోరీనే. ఆ ప్రేమకథలో ప్రేమ ఉంటుంది. పెయిన్ ఉంటుంది. ఈ కథలో రావు రమేశ్‌గారు, పోసానిగారు చాలా బాగా చేశారు. థియేటర్లో రెండున్నర గంటలు టైమ్ పాస్ చేసే సినిమాకాదు. ట్రాన్స్ లోకి తీసుకెళ్లే సినిమా. కమర్షియల్ సినిమా అయితే ఎలా ఉంటుందో నిర్మాతలు నమ్ముతారు. కానీ మా నిర్మాతలు సెన్సిబుల్, స్ట్రాంగ్ ఇంటెన్స్ ఉన్న ఈ కథను నమ్మి చేశారు. ప్రీ ప్రొడక్షన్ నుంచి నాతో పాటు పనిచేశారు విష్ణు శర్మ. అలాగే ఆర్ట్ డైరక్టన్ చేసిన ప్రవీణ్ పూడి... ఇలా నా యూనిట్ అందరికీ ధన్యవాదాలు. ఏప్రిల్ 5 మార్నింగ్ షో నుంచి ఎంజాయ్ చేయండి. అటు ఎలక్షన్ ఉన్నా, ఇటు ఐపీయల్ ఉన్నా... అంతకు మించిన కిక్కు మా సినిమాలో ఉంటుంది`` అని తెలిపారు.
సాహు మాట్లాడుతూ ``ఈ సినిమాకు మా చైతన్యగారు, సమంతగారు అందించిన సపోర్టు మరువలేనిది. మా టీమ్ అందరికీ ధన్యవాదాలు`` అని అన్నారు.
సమంత అక్కినేని మాట్లాడుతూ ``నాగార్జునగారు, వెంకటేశ్‌గారికి ధన్యవాదాలు. వాళ్లిద్దరి వల్ల ఒక పాజిటివ్ నమ్మకం వచ్చింది. వాళ్ల ఇన్‌ఫ్లుయన్స్ మా మీద చాలా ఉంది. ప్రేమ ఎక్స్ పీరియన్స్ చేయకముందు ప్రేమ అలా ఉంటుంది.. ఇలా ఉంటుంది అని ఊహించుకుంటాం. కానీ నిజం వేరుగా ఉంటుంది. ప్రతి లవ్ స్టోరీ చాలా యూనిక్‌గా ఉంటుంది. మజిలీ నిజమైన లవ్‌స్టోరీ. లవ్ అంటే బలం. లవ్ అంటే ధైర్యం. ప్రేమంటే బాధ్యత. ఏమాయచేసావె, మనం తర్వాత మజిలీ కూడా నాకు ఇంపార్టెంట్ సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అందుకు శివగారికి ధన్యవాదాలు చెబుతున్నా. పెళ్లయ్యిన తర్వాత `ఈ` ప్రేమ గురించి ఎందుకు సినిమాలు చేయరు అని అనిపించింది. శివగారు ఈ సినిమా కథతో వచ్చినందుకు ధన్యవాదాలు. మా ఆయన గురించి నేనే చెబితే బాగోదు. కానీ ఏప్రిల్ 5 తర్వాత అందరూ చెబుతారు. నేను అది విని ఆనందిస్తాను. విష్ణుగారు, గోపీసుందర్‌గారు, తమన్‌గారు... అందరికీ ధన్యవాదాలు. తమన్‌గారు లాస్ట్ మినిట్ హెల్ప్ చేశారు. మా నిర్మాత సాహుగారు కూలెస్ట్ ప్రొడ్యూసర్. అందరినీ ఏప్రిల్ 5న థియేటర్లలో కలుస్తాను`` అని చెప్పారు.
నాగచైతన్య మాట్లాడుతూ ``శివగారు ఈ సినిమా గురించి అడగగానే నాకు ఓకే అనిపించింది. శ్యామ్ నాకు ఇంకో హీరోయిన్‌ని చూజ్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు. నాన్న, వెంకీమామ నా పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. శ్యామ్, నేను పెళ్లి తర్వాత ఇంత త్వరగా కలిసి సినిమా చేస్తామని అనుకోలేదు. మేం మైండ్‌లో ఎలాంటి సినిమా చేయాలనుకున్నామో, అలాంటి సినిమాను శివ నా దగ్గరకు తీసుకొచ్చారు. ఈ కేరక్టర్‌ను శివ దర్శకత్వంలో చేయడం చాలా తృప్తినిచ్చింది. చాలా నమ్మకాన్నిచ్చింది. నేను సెట్లో చేస్తుంది తప్పా? అనే అనుమానం ఎప్పుడూ కలగలేదు. నేను ఇప్పటిదాకా పనిచేసిన వాళ్లల్లో శివ హానెస్ట్ ఫిల్మ్ మేకర్. వ్యక్తిగా కూడా నిజాయతీపరుడు. శివతో కలిసి చాలా సినిమాలు చేయాలనుకుంటున్నా. సాహు, హరీష్ చాలా మంచి నిర్మాతలు. ఈ కంటెంట్‌ను నమ్మి నిర్మించడానికి ముందుకొచ్చారు. నాకు , శ్యామ్‌కి ఇది ప్రస్టీజియస్ ప్రాజెక్ట్. దివ్యాంశకు తెలుగు ఇండస్ట్రీనుంచి వెల్కమ్ చెప్తున్నా. శామ్ పాత్ర అందరికీ గుర్తుంటుంది. ఆన్, ఆఫ్ స్క్రీన్లుల్లో సమంత నాకు చేస్తున్న సపోర్ట్ గొప్పది. తమన్ ఈ సినిమా లైఫ్ మొత్తం మార్చేశాడు. గోపీసుందర్ మంచి ట్యూన్లు ఇచ్చాడు. ప్రతి పాటా యూట్యూబ్‌లో ఒన్ మిలియన్ దాటేసింది. జానీ మాస్టర్, రఘు మాస్టర్, ఫైట్ మాస్టర్లు రామకృష్ణ, వెంకట్ మాస్టర్లు, ఎడిటర్ ప్రవీణ్ పూడి అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టుకీ ధన్యవాదాలు. ప్రతి వేడుకకు స్టేజ్ మీదకు ఎక్కేటప్పుడు ఏదో నెర్వస్‌నెస్ ఉంటుంది. ఎన్నో ప్రామిస్ చేస్తాం. ఆ ప్రామిస్‌లన్నీ నెరవేరుతాయో, లేదోననే బాధ ఉంటుంది. కానీ ఈ సినిమాకు చాలా కాన్పిడెంట్‌గా ఉన్నాం. కామ్‌గా ఉన్నాం. మజిలీ చూసి ఎవరూ రెగ్రెట్ కారు`` అని చెప్పారు.
వెంకటేశ్ మాట్లాడుతూ ``మజిలీ టీజర్ చూడగానే చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నా. ట్రైలర్ చూడగానే చాలా చాలా పెద్ద పెద్ద హిట్ అవుతుందని అనుకున్నా. ఇందాక శివ మాట్లాడుతూ ``సినిమా చూసిన తర్వాత అందరూ చైతూని కౌగలించుకుంటారని అన్నాడు. నేను ట్రైలర్ చూడగానే కౌగలించుకుంటున్నాను. శివ చాలా క్లియర్‌గా చెప్పాలనుకున్నది చెప్పాడు. ట్రైలర్‌ని చూసినప్పుడు ప్రతి పాత్రను, ప్రతి పెర్ఫార్మెన్స్ నూ చాలా బాగా చేయించుకున్నాడు. శ్యామ్, చైతూ, దివ్య చాలా బాగా చేసుకున్నారు. ఏప్రిల్ 5న ఫ్యాన్స్ ఉగాది పెద్ద పండుగను చేసుకోవచ్చు. విష్ణు చాలా మంచి ఫొటోగ్రపీ ఇచ్చాడు. తమన్, గోపీ సంగీతం ప్లస్ అవుతుంది. వండర్ ఫుల్ సినిమా కావాలి. ఇలాంటి సినిమాల్లో చైతూ, శ్యామ్ వండర్‌ఫుల్ జాబ్ చేస్తారు`` అని చెప్పారు.
నాగార్జున మాట్లాడుతూ ``ఈ టీమ్‌ని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. వాళ్లన్నట్టే చాలా కామ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. టీమ్ వర్క్ జరుగుతున్నట్టే అనిపించింది. శివ నిన్నుకోరి సినిమా చూసి చాలా బావుందనుకున్నా. చైతన్య నీ దగ్గరకు వచ్చి సినిమా చేద్దామని అనడం చాలా హ్యాపీ. సంగీతం చాలా బావుంది. రెండు పాటలు బ్లాక్ బస్టర్లు అయ్యాయని విన్నా. టెక్నీషియన్లు అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నా. నేను చైతూ, శామ్ పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలి. `ఏ మాయ చేసావె` చూసినప్పుడు చాలా చక్కటి జంట అని అనుకున్నా. `మనం` సినిమాలో వీళ్లిద్దరూ నాతో కలిసి నటించారు. ఇలా జరగబోతుందని నాకు అప్పుడు తెలియదు. ఇద్దరూ నాకు ఏమాత్రం తెలియకుండా సైలెన్స్ గా రొమాన్స్ చేస్తున్నారని తర్వాత తెలిసింది. సమంత నేనున్నప్పుడు తొలిసారి ఇంటికి వచ్చింది. మా కుక్క పరిగెత్తుకుంటూ సమంత దగ్గరకు వెళ్లింది. అరే.... దీనికి సమంత ఎలా తెలుసు.. అని అడిగాను. అప్పుడు చెబుతుంది... `మామ.. నాకు లియో ఎప్పటి నుంచో తెలుసు` అని చెప్పింది. ఇప్పుడు ట్రైలర్ చూశా. చాలా బావుంది. టీజర్ చూసినప్పుడు కాస్త జివ్వుమంది. బాధ కలిగింది. `వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు` అనేదిలాస్ట్ మాట. తండ్రిగా నాకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. బట్ నేను చెప్పేది సినిమా చూడకముందు... కానీ సినిమా చూసిన తర్వాత మా మంచి అబ్బాయికి, మంచి అమ్మాయి దొరికింది. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదలవుతుంది. మాకు ఏప్రిల్ 6న మాకు మంచి ఉగాది అవుతుంది. ట్రైలర్ చూస్తుంటే రెండు సార్లు నాకు కళ్లల్లో నీళ్లొచ్చాయి. సినిమా చూశాక ఇంకా బావుంటుంది`` అని అన్నారు.