19 September 2019
Hyderabad
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ప్లస్ బేనర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'వాల్మీకి'. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా టైటిల్‌ను మార్చాలని బోయ సంఘం, వాల్మీకి వర్గం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ మేరకు చిత్ర యూనిట్ టైటిల్‌ను `గద్దలకొండ గణేశ్‌గా మార్చింది. ఈ సందర్భంగా గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో..
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ - " వాల్మీకి టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి కొన్ని వర్గాల వారి నుండి నిరసనలు మొదలయ్యాయి. అప్పటికీ మా టీమ్ నమ్మకం ఏంటంటే వాల్మీకి మహర్షి తప్పు చేసినట్లు ఎక్కడా చూపించలేదు కాబట్టి రేపు సినిమా చూసిన తర్వాత డెఫనెట్‌గా ఎవరైతే నిరసనను తెలియజేశారో, వారి మనోభావాలు దెబ్బ తిన్నాయని బాధపడుతున్నారో వారు సినిమాను చూసిన తర్వాత కచ్చితంగా మమ్మల్ని మెచ్చుకుంటారనే నమ్మకంతో ఉన్నాం. అలాగే ఏమైనా అభ్యంతరాలుంటే సెన్సార్ పరిధిలోకి వస్తుందనుకున్నాం. సెన్సార్ సభ్యులు సినిమా చూశారు. వాల్మీకి మహర్షి గురించి ఎక్కడా తప్పుగా చెప్పడం కానీ.. చూపించడం కానీ లేదు కాబట్టి.. సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందని అనుకున్నాం. అయితే బోయసంఘంవారు, వాల్మీకి వర్గంవారు టైటిల్‌లో తుపాకీ ఉందనే అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దాన్ని మార్చాం. అనంతపురం, కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి సినిమా రేపు రిలీజ్ అనగానే సినిమాను ఆపేయాలంటూ ఉత్తర్వులు మాకు వచ్చాయి. రేపు రిలీజ్ వరకు ఈ సమస్యను ఇంత వరకు ఎందుకు తీసుకొచ్చారనే భావన అందరి మనుసుల్లోఉంటుంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలని నేను, మా నిర్మాతలు 14-15 గంటలు పాటు నిద్రాహారాలు లేకుండా ఆలోచించాం. ఈ పరిస్థితిని కావాలనే ఎవరూ తెచ్చుకోరు. మేం ఓ మంచి టైటిల్‌ను పెట్టాం. ఇలాంటి టైటిల్‌ను పెట్టడం ద్వారా వాల్మీకి మహర్షి గొప్పతనం తెలియనివారికి కూడా తెలుస్తుందని అనుకున్నాం. 30-40 కోట్లు ఖర్చుపెట్టి 200 మంది టెక్నీషియన్స్ ఈ సినిమాపై పనిచేస్తూ ఓ వ్యక్తినో, వర్గాన్నో, కులాన్నో, ఓ సంఘాన్నో విమర్శించడానికి ఈ పనిచేయలేదు. వాల్మీకి మహర్షి గురించి రెండు గొప్ప డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నా సినిమాలు చూడని మా నాన్నగారు కూడా తొలిసారి ఆయన టైటిల్ అనౌన్స్ చేయగానే.. చాలా మంచి టైటిల్ పెట్టావని ఫోన్ చేశారు. సినిమా ఎలా ఉందో తెలియకుండా నేను ఎవరికీ క్షమాపణ చెప్పాలో అర్థం కావడం లేదు. ఏ జిల్లాలో ఈ సినిమాను ఆపాలని నిర్ణయం తీసుకున్నారో దాని వల్ల అక్కడ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతారు. వారికి ఎలాంటి నష్టం జరగకూడదని భావించాం. నేను ముందు ఈ దేశ పౌరుడ్ని. తర్వాతే డైరెక్టర్‌ని.. రైటర్‌ని. ఏ వ్యక్తి కూడా ప్రభుత్వానికి అతీతులు కాదని నమ్మే వ్యక్తిని. సినిమాను చూడకుండా ఇంత డిస్ట్రబ్ చేయడమనేది చిన్న బాధను కలిగిస్తుంది. అందరికీ చెప్పేదొక్కటే `వాల్మీకి` టైటిల్‌ను గద్దలకొండ గణేష్‌గా పరిగణించాలని కోరుతూ టైటిల్‌ను మారుస్తున్నాం. పబ్లిసిటీ మెటీరియల్ అంతా కొత్త టైటిల్‌తోనే ముందుకు వస్తుంది. ఎవరి మనోభావాలైతే దెబ్బతిన్నాయన్నారో వారికి నేను సవినయంగా చెప్పేదొక్కటే వాల్మీకి సోదరులారా.. బోయ సోదరులారా మీరు నా సినిమాను చూడాలని కోరుతున్నాను. సినిమా చూసిన తర్వాత ఏదో మూల నిజమే కదా! వాల్మీకి మహర్షిని ఎక్కడా తప్పుగా చూపించలేదని మీ అంతరాత్మకు అనిపిస్తే నాకు అదే చాలు. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ - ``ఓ రకంగా ఇది చాలా బాధాకరమైన విషయం. సినిమా బిజినెస్ అనేది ఓపెనింగ్స్‌తో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. కానీ మాకు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదు. సెన్సార్ బోర్డు అప్రూవ్ చేస్తే.. సినిమా చూడకుండా సినిమాను ఆపే హక్కుఎవరికీ లేదని సుప్రీమ్‌కోర్టు ఆర్డర్ కూడా ఉంది. అయితే కొందరు వారి సెంటిమెంట్స్‌ను హర్ట్ చేశామని అనుకుంటున్నారో వారికి రేపు సినిమా చూశాక అర్థమవుతుంది. సెన్సార్ సభ్యులు ఎలాంటి అభ్యంతరం తెలియజేయలేదు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా టైటిల్ మార్చాల్సి వస్తుంది. మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నష్టపోకూడదని వెంటనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. మేం వేరే వాళ్లని కించపరిచేలా ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలనుకోవడం లేదని అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సినిమాలో హీరో పేరు `గద్దలకొండగణేష్`నే టైటిల్‌గా మార్చాం`` అన్నారు.
కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ - ``ఈరోజు సాయంత్రం వరకు అసలు టైటిల్ వెనుక అర్థాన్ని వివరించడానికి ప్రయత్నించాం. కానీ కుదరలేదు. సినిమా ఇండస్ట్రీ అందరికీ అన్నం పెట్టే ఇండస్ట్రీ. అందరూ బావుండాలనే టైటిల్‌ను మార్చాం. గోపీ చెప్పినట్లు ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలో మరొకరిని తక్కువగా చేసి చూపెట్టం`` అన్నారు.