యాంకర్ రవి, మేఘనా లోకేష్ జంటగా నటించిన చిత్రం `ఇది మా ప్రేమకథ`. మత్స్య క్రియేషన్స్, పిఎల్‌కె ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయోధ్య కార్తీక్ దర్శకుడు. ఈ సినిమా డిసెంబర్ 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో రవి మాట్లాడుతూ ‘‘ఏడేళ్ళ క్రితం ఇండస్ట్రీకి వచ్చాను. యాంకర్‌గా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను, చేస్తున్నాను. అయితే నాలో ఒక నటుడు దాగి ఉన్నాడు. డైరెక్ట్‌గా సినిమాలు చేయడం కంటే టీవీలో కొంత పాపులర్ అయిన తర్వాత హీరోగా ఎంట్రీ ఇస్తే బాగుంటుందనిపించింది. చిరంజీవిగారు, రజనీకాంత్‌గారు వంటి హీరోలు నాకు ఇన్‌స్పిరేషన్. ఈ సినిమా కోసం ఆరు నెలలు ప్రిపరేషన్స్ జరిగాయి. గత సంవత్సరం అక్టోబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేశాం. నేను, మేఘన ఇద్దరం టీవీ కార్యక్రమాల్లో బిజీగా వుండడం వల్ల డేట్స్ ప్రాబ్లమ్ వచ్చింది. దాంతో షూటింగ్ డిలే అయింది. టోటల్‌గా మేం 40 రోజులు మాత్రమే షూటింగ్ చేశాం. ఈ సంవత్సరం ఆగస్ట్‌లో ఫస్ట్ కాపీ వచ్చింది. సెన్సార్ కూడా పూర్తయింది. క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. ఇందులో నా క్యారెక్టర్ చాలా ఎమోషనల్‌గా వుంటుంది. టీవీ ప్రోగ్రామ్స్‌లో చలాకీగా కనిపించే రవి సినిమాలో ఎలా వుంటాడోనని చాలా మంది ఎదురుచూస్తున్నారు. టీవీల్లో నన్ను ఫ్రీగా చూసేసిన ప్రేక్షకులు టిక్కెట్ కొనుక్కొని నేను నటించిన మొదటి సినిమా చూస్తారా అనేది డిసెంబర్ 15న తెలుస్తుంది. ఈ సినిమా అందరికీ నచ్చితే ఇంకా సినిమాలు చేస్తాను. నచ్చకపోతే మళ్ళీ ఇంకో సినిమా చేసి మెప్పించే ప్రయత్నం చేస్తాను’’ అన్నారు.
దర్శకుడు అయోధ్య కార్తీక్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో ప్రతి సీన్ చాలా నేచురల్‌గా వుంటుంది. సినిమాలో చూసే ప్రతి సీన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి జరిగే వుంటుంది అనిపిస్తుంది. నాకు డైరెక్టర్‌గా ఇది మొదటి సినిమా అయినప్పటికీ యూనిట్‌లోని అందరూ నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. రవి, మేఘన పెర్‌ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా అద్భుతంగా చేశారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
నిర్మాత పి.ఎల్.కె.రెడ్డి మాట్లాడుతూ ‘‘అయోధ్య చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. చెప్పిన దానికంటే స్క్రీన్ మీద అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. కార్తీక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ చాలా బాగున్నాయి. డిసెంబర్ 15న విడుదలవుతున్న మా సినిమా తప్పకుండా అందరి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.
నటుడు లోబో మాట్లాడుతూ ‘‘సినిమా చూసే ప్రతి ఒక్కరికీ ఈ కథ కనెక్ట్ అవుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
సంగీత దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ ‘‘రవి, మేఘన వంటి ఆర్టిస్టులతో సినిమా చేయడం మాకు ఎంతో ప్లస్ అయింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ టీవీ కార్యక్రమాల ద్వారా చాలా పాపులర్ అయ్యారు. కాబట్టి మా సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా చాలా బాగా వచ్చింది. పాటలన్నీ బాగా కుదిరాయి’’ అన్నారు.
గెటప్ శ్రీను మాట్లాడుతూ ‘‘ఈ సినిమాని అందరం ప్రాణం పెట్టి చేశాం. ఒక మంచి సినిమా చెయ్యాలని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మా కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని ఆశిస్తున్నాము’’ అన్నారు.