13 February 2016
Hyderabad
ఆది పినిశెట్టి, నిక్కి గల్రాని జంటగా నటించిన సినిమా `మలుపు`. ఆదర్శ చిత్రాలయ బ్యానర్ పై రూపొందింది. సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకుడు. సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మించారు. మలుపును ఈ నెల 19న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ ``మా పెద్దబ్బాయి సత్య మీదున్న నమ్మకంతో మా సొంత సంస్థలో ఈ సినిమాను చేశాం. అమెరికన్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్‌లో డైరక్షన్ కోర్సు చేశాడు సత్య. తను సిద్ధం చేసుకున్న స్క్రిప్టుల్లో ఇది కూడా ఒకటి. తన స్నేహితుల జీవితంలో జరిగిన కొన్ని యథార్థ ఘటనల నేపథ్యంలో ఈ కథను అల్లుకున్నాడు. మా చిన్నబ్బాయి ఆది అయితే ఈ కథకు న్యాయం చేయగలడనే ఉద్దేశంతో అతన్నే హీరోగా తీసుకున్నాం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలాగా తెరకెక్కించలేదు. చూసే ఆడియన్‌కి ఆ ఫీలింగ్ ఉంటుంది. మంచి సినిమా చూశామనే తృప్తి ఉంటుంది. నేను ఏ నమ్మకంతో ప్రొడక్షన్ చేశానో, ఆ నమ్మకాన్ని సత్య నిలబెట్టుకున్నాడు. ఆది దర్శకుల హీరో. ఈ సినిమా మా ఇద్దరబ్బాయిలకు చాలా మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది`` అని చెప్పారు.
దర్శకుడు సత్య ప్రభాస్ పినిశెట్టి మాట్లాడుతూ ``ఇది వైవిధ్యమైన సినిమా. మా నాన్నగారు లేకుంటే ఈ సినిమాను చేయడం వీలయ్యేది కాదు. ఆదికున్న మార్కెట్‌ను మించి ఖర్చుపెట్టాం. నేను చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో మా నాన్నగారు స్వయంగా నిర్మించారు. ఈ సినిమాలో ఆది చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. తనకు ఎన్ని మంచి ఆఫర్లు వచ్చినా కాదనుకుని, ఈ సినిమాకు కమిట్ అయి నిలుచున్నాడు. కంటెంట్ బావుంటే ప్రేక్షకులు చూస్తారనే నమ్మకంతో ఈ సినిమా చేశాను. నాకు సహకరించిన బృందానికి ధన్యవాదాలు`` అని తెలిపారు.
ఆది మాట్లాడుతూ ``ఎన్నో అందమైన మలుపుల తర్వాత ఈ నెల 19న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా షూటింగ్ చాలా సరదాగా జరిగింది. డిసెంబర్ 31 రాత్రి నలుగురు స్నేహితుల జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమాను చేశౄం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉండే అంశాలన్నీ ఉంటాయి. అయితే కమర్షియల్ ఫార్ములాలో ఉండదు. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాక్టర్ మిస్ కాదు. ప్రేక్షఖులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది`` అని చెప్పారు.
నిక్కి మాట్లాడుతూ ``ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశాను. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను`` అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రగతి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.