ఇళయదళపతి విజయ్ నటించిన `తెరి` చిత్రం తెలుగు లో `పోలీసోడు` అనే టైటిల్ తో విడుదల కానుంది. సమంత, అమీ జాక్సన్ నాయికలు.
అట్లీ దర్శకత్వం వహించారు. రాజు, కలైపులి యస్.థాను నిర్మిస్తున్నారు. శిరీష్, లక్ష్మణ్ సహ నిర్మాతలు. ఈ సినిమా ప్రెస్‌మీట్ హైదరాబాద్‌లో శనివారం రాత్రి జరిగింది.
దిల్‌రాజు మాట్లాడుతూ ``నేను ఇటీవలే చెన్నైకి వెళ్లాను. అప్పుడు `తెరి` సినిమా ట్రైలర్స్, పాటలు చూశాను. నిజానికి `రాజారాణి` ని తెలుగులో తీయాల్సింది. కానీ కుదరలేదు. ఓ తమిళ సినిమాను మా సంస్థ తెలుగులోకి తీసుకొస్తోందంటే ఎంత వైవిద్యమైన సినిమా అయి ఉంటుందో అందరికీ తెలిసిందే. వైశాలీ, ఓకే బంగారం వంటివన్నీ మేం అలా తీసుకొచ్చినవే. `పోలీసోడు`లో సమంత, విజయ్ జోడీ బావుంది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలున్నాయి. వచ్చేవారం సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అని అన్నారు.
అట్లీ మాట్లాడుతూ ``రాజారాణి తర్వాత తెలుగులో సినిమాలు చేయమని చాలా మంది అడిగారు. నేను తమిళంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేసిన తర్వాతే తెలుగులో సినిమా చేస్తానని చెప్పాను. నా తదుపరి సినిమా తెలుగులోనే ఉంటుంది. పోలీసోడు ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. పిల్లల్ని బాగా పెంచితే మంచి దేశం సిద్ధమవుతుందని చెప్పే సినిమా ఇది`` అని అన్నారు.
సమంత మాట్లాడుతూ ``నేను పాతిక సినిమాలు చేశాను. ప్రతి సినిమాకూ ఏదో ఒక రకంగా టెన్షన్ పడ్డాను. కానీ ఎలాంటి టెన్షనూ లేకుండా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. ఎమోషన్, సెంటిమెంట్, ఫ్యామిలీ అంశాలు మిళితమైన చిత్రమిది`` అని చెప్పారు.
ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం - స్క్రీన్ప్లే - అట్లి .ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్ . సంగీతం - జి . వి . ప్రకాష్ కుమార్. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ , సహా నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు - రాజు , కలయిపులి ఎస్ థాను.