'రుద్రమదేవి'కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహం
అనుష్క టైటిల్ పాత్రధారిగా గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ దర్శకనిర్మాణంలో రూపొందిన చిత్రం రుద్రమదేవి. రాగిణీ గుణ సమర్పణ. అల్లుఅర్జున్; రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్ లో విడుదల అవుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
దిల్‌రాజు మాట్లాడుతూ ''రుద్రమదేవి గుణశేఖర్‌గారి డ్రీమ్. ఎన్నో సంవత్సరాలు కష్టపడి రూపొందించిన చిత్రం. ఈ ప్రయాణంలో నేను ఒకటిన్నర సంవత్సరం పాటు ట్రావెల్ చేశాను. ఈ సినిమాని అనౌన్స్ చేయగానే అందరిలాగానే నేను కూడా వర్కవుట్ అవుతుందా అని అనుకున్నాను. అయితే స్క్రిప్ట్ విన్న తర్వాత నేను, శిరీష్, లక్ష్మణ్ థ్రిల్ పీలై ట్రావెల్ చేశాం. ఎన్నో అడ్డంకులు ఎదురైనా సినిమాని ఈ రోజు విడుదల రెడీ చేశారు గుణశేఖర్. సినిమాని నేను 2డి, 3డిలో చూశాను. 3డిలో సినిమా చూడటం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. అలాగే ఈరోజు సీఎం కేసీఆర్‌గారిని కలిశాం. ఆయన సినిమాకి వినోదపు పన్ను మినహాయించారు. అందుకు ఆయనకు థాంక్స్. అలాగే రేపు చంద్రబాబు నాయుడుగారిని కలవబోతున్నాం. అయన కూడా ప్రోత్సాహిస్తారని నమ్మకంగా ఉన్నాం'' అన్నారు.
గుణశేఖర్ మాట్లాడుతూ ''ఇదొక చారిత్రాత్మక మలుపు. సీఎం కేసీఆర్‌గారిని కలవగానే నన్ను మెచుకుని వెంటనే ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేశారు. ఆయన అందించిన ప్రోత్సాహానికి థాంక్స్ అనే మాట చిన్నదై పోతుంది. ఈ ఘటన కళల పట్ల కేసీఆర్‌గారికి ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తుంది. కాకతీయుల చరిత్రను ఫాలో అవుతూ ఆయన కూడా మిషన్ కాకతీయను చేయడం యాదృచ్చికమే అయినా ఆయన అందించిన ప్రోత్సాహం మరచిపోలేను. అలాగే మీడియా సపోర్ట్ కూడా మరచిపోలేం. రేపు చంద్రబాబునాయుడుగారిని కూడా కలవబోతున్నాం. ఆయన కూడా తన వంతు ప్రోత్సాహాన్ని అందిస్తారని భావిస్తున్నాం'' అన్నారు.
అనుష్క మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం గుణశేఖర్‌గారు తొమ్మిదేళ్ళు కష్టపడ్డారు. దర్శకుడిగా, నిర్మాతగా ఇలాంటి సినిమా చేయడం సులభం కాదు. అలాగే ఈ సినిమా టీమంతా రెండున్నరేళ్ళ కష్టం. ఈ సినిమా కోసం వినోదపు పన్ను మినహాయింపు చేసిన కేసీఆర్‌గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రేక్షకులు ఉహించిన దానికంటే సినిమా బావుంటుంది. మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం'' అన్నారు.
ఈ కార్యక్రమంలో రాగిణి గుణ, నీలిమ గుణ, యుక్తాముఖి తదితరులు పాల్గొన్నారు.