16 February 2017
Hyderabad
సాయిధరమ్ తేజ్ హీరోగా గ్రాండ్‌గా తెరకెక్కుతున్న చిత్రం `విన్నర్`. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 24న విడుదలవుతున్న సందర్భంగా చిత్రంలో సూయ సూయ...అంటూ పల్లవితో సాగే సాంగ్‌ను పాడిన యాంక్ సుమ కనకాల, పాటలో నర్తించిన మరో యాంకర్ అనసూయ పాత్రికేయులతో ముచ్చటించారు.
సుమ మాట్లాడుతూ - ``విన్నర్ సినిమా కోసం ముందు పాట పాడాలని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అడిగిప్పుడు తను ఏదో తమాషా చేస్తున్నాడని అనుకున్నాను. అయితే తను మాత్రం సీరియస్‌గానే నేను పాట పాడాలని అనడమే కాదు..చెన్నై రమ్మని పిలిచాడు. సరేనని నేను పాట పాడటానికి రికార్డింగ్ స్టూడియో చేరుకున్నాను. అక్కడికి చేరుకునే వరకు నేను పాడబోయే పాట అనసూయ డ్యాన్స్ నెంబర్ సాంగ్ అని నాకు కూడా తెలియదు. థమన్ ఇచ్చిన లిరిక్స్‌లో సూయ సూయ అనే పాట పల్లవి చదవగానే ఇది అనసూయ కోసం రాసిన పాట కదా..అని అడగడంతో థమన్ అవునని అన్నాడు. నేను సరేనని థమన్ గైడెన్స్‌తో పాటను పూర్తి చేసుకుని వచ్చాను. స్టూడియో బయటకు రాగానే అనసూయకు ఫోన్ చేసి నేను పాట పాడానని, అది కూడా తన డ్యాన్స్ నెంబర్ సాంగ్‌ను నేను పాడానని చెప్పగానే ముందు థ్రిల్ అయ్యింది. ఈ పాట పాడిన తర్వాత ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేయజేసి పాట రిలీజ్ చేశారు. పాట రిలీజ్ కాగానే చాలా మంది సింగర్స్ అభినందించారు. కొంత మంది చిన్న చిన్న సలహాలు కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఎస్.పి.బాలసుబ్రమణ్యంగారు పాట విని బాగా పాడానని అప్రిసియేట్ చేయడం మరచిపోలేను. అలాగే ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్న మా అమ్మాయి నా పాట విని ఎమంటుందోనని అనుకున్నాను. అయితే తను సాంగ్ విని బాగానే పాడావని అనడంతో హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు థమన్ కోరిక మీద పాట పాడేశాను కానీ నా ప్రొఫెషన్ మాత్రం యాంకరింగ్. ఈ ఐడియా మాత్రం థమన్, డైరెక్టర్ గోపీచంద్‌గారిదే`` అన్నారు.
అనసూయ మాట్లాడుతూ - ``సుమ అక్క ఈ పాట పాడుతున్నారని నాకు ముందు తెలియదు. థమన్ కూడా నాకు ఏమీ చెప్పలేదు. సుమ అక్క స్టూడియో నుండి బయటకు వచ్చిన తర్వాత అసలు విషయం చెప్పగానే థ్రిల్ అయ్యాను. తర్వాత సంతోషమేసింది. నేను క్షణం మూవీ తర్వాత మరో సినిమాలో నటించలేదు..అందుకు కారణం నన్ను ప్రేక్షకులు క్షణం అనసూయగానే గుర్తు పెట్టుకోవాలనుకున్నానంతే. విన్నర్‌లో సాంగ్ చేయాలనగానే ముందు భయపడి వద్దులెండి అని అన్నాను. అయితే చివరగా లిరిక్స్ కూడా పంపారు. ఆ సాంగ్‌లోని కొన్ని లిరిక్స్ వినగానే నేను సాంగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. రేపు సాంగ్ చిత్రీకరణ అనగానే ఎలా ఉంటుందోనని భయపడ్డాను. కానీ ధైర్యంగా చేసేశాను`` అన్నారు. .