pizza

‘హరిహర వీరమల్లు’ ఎందుకు చూడాలంటే...

You are at idlebrain.com > news today >

25 July 2025
Hyderabad

• వీరమల్లు మనలో ఒకడు
ఒక సినిమా ప్రేక్షకుడిగా... ఇంకా చెప్పాలంటే భాషలు, హీరోలతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలు చూసే ఒక సినిమా ప్రేమికుడిగా చెబుతున్న మాటలివి...
సినిమా ఎందుకు చూడాలి అనే ప్రశ్న సాధారణంగా రాదు. ఎందుకంటే ప్రధానంగా వినోదం కోసమే సినిమాకు వెళ్తారు. అందులోనూ ప్రేక్షకుల అభిరుచులు ఆధారంగా సినిమాను ఎంచుకోవడం ఉంటుంది. ఆ ఎంచుకోవడాన్ని బేస్ చేసుకొనే మాస్, క్లాస్, యాక్షన్, లవ్, థ్రిల్లర్... ఇలా రకరకాల వర్గీకరణలు ఉంటాయి. వీటికి భిన్నంగా తప్పనిసరిగా అన్ని తరహాల ప్రేక్షకులు చూడాల్సిన సినిమాలు అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటి చిత్రమే ‘హరిహర వీరమల్లు’.

అసలు హరిహర వీరమల్లు చిత్రాన్ని ఎందుకు చూడాలి..? పవన్ కల్యాణ్ హీరోగా నటించాడనా? ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక వస్తున్న సినిమా కాబట్టా? కోహినూర్ డైమండ్ గురించి, మొఘలుల దురాగతాల గురించి తీశారు కనుకనా?... ఎందుకు ఈ సినిమా చూడాలి. ఎందుకు చూడాలి అంటే -

వర్తమాన భారతీయ సమాజంలో సనాతన ధర్మం గురించి మాట్లాడితే – చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని తప్పుబడతారేమో... సెక్యులర్ విధానాలకు భిన్నంగా ఉన్నారు అంటారేమో అనే ఎవరికి వారే సంకెళ్ళు వేసుకొని బతికేస్తున్నారు. ఇది ఒక విధంగా భయంతో కూడిన బతుకే. తమ ధర్మం గురించి తాము సగర్వంగా చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు ఉంది... ఇతర ధర్మాన్ని అనుసరించేవాళ్లు ఏం చేసినా తప్పుబట్టలేని నిస్సహాయత ఏమిటి? ఈ దురవస్థ మొఘలుల కాలంలో ఇంకెంత అరాచక స్థాయిలో ఉందో వెల్లడిస్తూ... సనాతన ధర్మం అంటే మతం కాదు, జీవన విధానం అని చెప్పిన చిత్రం ‘హరిహర వీరమల్లు’.

సనాతన ధర్మం అంటే శాశ్వతమైన మరియు సార్వత్రికమైన ధర్మం అని అర్థం. ఇది ఒక జీవన విధానం, దీనిలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మరియు ఇతర గ్రంథాలు మార్గదర్శకాలుగా ఉంటాయి. మనకు జీవన విధానాన్ని నేర్పే ధర్మం తాలూకు శక్తికి భయపడి, ఆ ధర్మం మూలాలను, వాటిని బోధించే గురువులను, వేదోపనిషత్తులను నాశనం చేయాలని దుర్మార్గాలకు తెగించినవాడే మొఘలాయీ ఔరంగజేబు.

కానీ మనం స్కూలు స్థాయి నుంచి చరిత్ర పాఠాల్లో ఔరంగజేబు గురించి ఏం చదువుకున్నాము... సామ్రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేశాడు... తన మతాన్ని అభిమానించుకొంటూ, ఆ మత ధర్మం ప్రకారం సాధారణ జీవితం గడుపుతూ, టోపీలు అల్లుకొని వాటిపై వచ్చే ఆదాయంతో జీవించాడు అని చదివించారు. పాఠశాల స్థాయి నుంచి మొఘలులు గొప్పవారు, బాబర్ వీరుడు, అక్బర్ అన్ని మతాలను ఆదరించాడు, షాజహాన్ గొప్ప ప్రేమికుడు, ఔరంగజేబు సాధారణ జీవి అంటూ సూడో సెక్యులర్ పాఠాలు చెప్పారు.

ఔరంగజేబు లాంటి మొఘలాయిల చీకటి కోణాలను పాఠ్య పుస్తకాల్లోకి రాకుండా చేశారు. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాలి... మన దేవతా మూర్తులను ఆరాధించకూడదు, అంతేనా విగ్రహాలను ధ్వంసం చేయడం, కాల్చి వేయడం లాంటి దుశ్చర్యలకు తెగబడ్డారు.

ఈ రోజు మనం అనుసరిస్తున్న జీవన విధానాన్ని కాపాడేందుకు ఎందరో పోరాడి బలైపోయారు. ఢిల్లీ పీఠంపై కూర్చొన్న మొఘలాయిల నుంచి సనాతన ధర్మాన్ని కాపాడుతున్న గురువులను రక్షించుకొనేoదుకు బయలుదేరిన వీరుడు హరిహర వీరమల్లు.

• ప్రతి ముస్లిం ఔరంగజేబు కాదే?
ఈ చిత్ర కథనంలోని ప్రతి లేయర్ లో సనాతన ధర్మ విలువలను చూపిస్తూ... ఆ కాలంలో ఆ విలువలను కాలరాసేందుకు చేసిన కుతంత్రాలను చిత్రించారు. అదే సమయంలో సనాతన ధర్మం ఏనాడూ పర ధర్మాలను ద్వేషించదని చెప్పారు. ధర్మానికి విఘాతం కలిగితే ప్రతి ఒక్కరూ పోరాడాల్సిందేనని చెబుతూనే – వీరమల్లు పోరాటం ముగిశాక... నెత్తుటి కత్తి ఒక చేత, మరో చేతిలోకి ముస్లిం చిన్నారిని తీసుకోవడం ద్వారా మన సనాతన ధర్మం ఎవరినీ ద్వేషించదు.. కడుపున పెట్టుకొని కాపాడుతుంది అని చెప్పారు.

ప్రతి ముస్లిం ఔరంగజేబులా ఉండరు అనే విషయాన్ని – వీరమల్లులో ప్రస్ఫుటంగా చెప్పారు. ఎలాగో చెబుతా... వీరమల్లును వెంటబెట్టుకొని తీసుకువెళ్లే గుల్ఫమ్ ఖాన్, అబ్దుల్లా ఎవరు? వాళ్ళు వీరమల్లు నేపథ్యం, ఆలోచనలు తెలుసుకున్నాక ఎలా ముందుకు సాగారో చూపించారు ఈ సినిమాలో.

ఔరంగజేబు, అతని తైనాతీలు, సేనల మతమౌఢ్యం చూపించారే తప్ప ఎక్కడా – సగటు ముస్లింను తప్పుగా, ఔరంగజేబుకు ప్రతిబింబాలుగా చూపలేదే? కరవు కాటకాలతో, చుక్క నీరు కోసం సాధారణ ముస్లింలు ఏ విధంగా అల్లాడిపోయారో చూపించారు. వారి కష్టానికి కదిలిపోయి అండగా నిలిస్తే వీరమల్లును ముస్లింలు ఎంత నిండు మనసుతో ఆశీర్వదించారో చూపించారు. అలాగే ఢిల్లీకి ప్రవేశించే ప్రాంతంలో హిందువులు, ముఖ్యంగా గర్భంతో ఉన్న హిందూ మహిళ పట్ల ఔరంగజేబు సేనలు చేస్తున్న పైశాచికాన్ని చూస్తూ కూడా ఏమీ చేయలేకపోతున్నామే...నిస్సహాయ స్థితిలో ఉన్న ముస్లిం మహిళల భావోద్వేగాన్ని చూపించారు.

• ఆనాటి చారిత్రక పరిస్థితులకు ప్రతీకలు... ఆ పాత్రలు
ఢిల్లీ పాదుషా... ఆ కింద గోల్కొండ నవాబు... అతని కింద దొరలు... ఇలా పాలన వ్యవస్థ చూపుతూ ఢిల్లీ పాదుషాకి తీసిపోని విధంగానే దొరల ఆలోచనలు ఉన్నాయనే విషయాన్ని చెప్పారు. దొరలు తమ పరిధిలోని రైతాంగాన్ని, కూలీలను, మహిళలను ఎంత వేధించారో చూపించారు. ‘పంచమి’ అనే కథానాయిక పాత్ర అణగారిన వర్గాలకు, దేవదాసీలకు ప్రతీక. ఆ పాత్రకు ‘పంచమి’ అని పేరుపెట్టడం ద్వారా చిత్ర రూపకర్తల ఆలోచన వెల్లడవుతోంది.

• హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాలా?
చతుర్వేదాలు, ఉపనిషత్తులు, కళలు, యుద్ధ కళలు, సంస్కృతిని కాపాడేందుకు అనుసరించే గురుకుల వ్యవస్థను చిత్రంలోని పాత్రల ద్వారా చూపించారు. వాళ్ళు ధర్మాన్ని కాపాడుతుంటే – ఢిల్లీ పాలకుడు మత మౌఢ్యంతో వేధించడం.. హిందువుగా జీవించాలంటే జిజియా పన్ను చెల్లించాలని వేధింపులకు, హింసకు పాల్పడటాన్ని బలంగా చూపించారు. చరిత్ర పాఠాల్లో కూడా జిజియా పన్ను గురించి తప్పుగానే చెప్పారు. గెడ్డం పెంచుకొంటే జిజియా పన్ను వేశారు అని ఒక హాస్య ఘట్టంలా చెప్పారు తప్ప – హిందువుగా జీవించేందుకు పన్ను అని వెల్లడించలేదు.

గతంలో వచ్చిన చారిత్రక చిత్రాలకు భిన్నమైనది హరిహర వీరమల్లు. రాజుల మధ్య యుద్ధాలు, రాజ్య దురాక్రమణలు లాంటి కథలే తెరపైకి ఎక్కువగా వచ్చాయి. హిందుత్వ కోణంలో శివాజీ, శంభాజీ లాంటివారి కథలు స్పృశించారు. ఏవి వచ్చినా అవి పాలకుల కోణంలో నడిచినవే. ఇక్కడ హరిహర వీరమల్లు తీసుకొంటే – ఒక సాధారణ వీరుడు సనాతన ధర్మం కోసం పోరాడేందుకు మొఘలాయి పాలకుడికి ఎదురు వెళ్తున్న క్రమాన్ని చూపించారు. సరిగా ఈ అంశం దగ్గరే సగటు ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. వీరమల్లుని ఏదైనా రాజ్య పాలకుడిగా చూపించి ఉంటే సాధారణ ప్రేక్షకుడు చూసే దృక్కోణం మారేది. వీరమల్లు మనలో ఒకడు. మన ధార్మిక విశ్వాసాలకు, ధర్మంపై మనకున్న అనురక్తికి, సంస్కృతిని కాపాడుకోవాలనే తపనకు ప్రతినిధిగా కనిపిస్తాడు.

సనాతన ధర్మం ఒక జీవన విధానం. ఇది వ్యక్తి జీవితంలోని అన్ని అంశాలను, సంబంధాలను, నైతికతను, ధర్మాన్ని కలిగి ఉంటుంది. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన, నిత్యమైన ధర్మం. ఈ విషయాలను ఒక చలన చిత్ర కథకి కావలసిన సకల హంగులతో హరిహర వీరమల్లును చూపించారు. కాబట్టే సాంకేతిక అంశాలు, హంగామాల విషయాన్ని పక్కకు నెట్టేశాను. టికెట్ తీసుకొని తెర ముందు కూర్చోన్న ప్రేక్షకుడిగా సినిమాలోని భావోద్వేగాలతో కనెక్ట్ అయినవాడిగానే ఈ మాట చెబుతున్నాను.
ధర్మో రక్షతి రక్షితః

– శరత్ చంద్ర

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved