ఝుమ్మందినాదం చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది తాప్సీ. మధ్యలో హిందీలో వరుసగా సినిమాలు చేసింది. ప్రస్తుతం `ఆనందో బ్రహ్మ` అనే హారర్ కామెడీతో మరలా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి తాప్సీ గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడింది. ఆ విశేషాలు..
* గంగ.. ఇప్పుడు ఆనందోబ్రహ్మ.. వరుసగా హారర్ సినిమాలు చేస్తున్నారు?
- వరుసగా కాదండీ.. కాన్సెప్ట్ నచ్చితేనే చేస్తున్నాను. వాస్తవానికి నాకు హారర్ సినిమాలంటే ఇష్టం ఉండదు. కాసింత భయం కూడా. కానీ ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చి చేశా.హారర్ కామెడీ జోనర్‌లో సాగే సినిమా ఇది.
* దర్శకుడు కథ చెప్పగానే ఏమనిపించింది?
- మహి.వి. రాఘవ్ ఈ కథను చాలా బాగా నెరేట్ చేశాడు. నిజానికి తను నాకు ముందు కథ చెప్పలేదు. కాన్సెప్ట్ చెప్పాడంతే. ఆ తర్వాత కథగా, సీన్స్ గా మేం మలచుకున్నాం. ఆఖరికి ప్రమోషన్ ఎలా చేయాలో కూడా డిస్కస్ చేసుకున్నాకే మీడియా ముందుకు వచ్చాం.
* అంతగా ఎగ్జయిటింగ్ పాయింట్ ఏం ఉంటుంది?
- మామూలుగా అన్నీ చిత్రాల్లో మనుషుల్ని దెయ్యాలు భయపెట్టినట్టు చూపిస్తాం. కానీ ఇందులో అందుకు పూర్తిగా విరుద్ధమన్నమాట. దెయ్యాలు మనుషుల్ని చూసి ఎలా భయపడ్డాయన్నది కాన్సెప్ట్ . ఆద్యంతం ఫన్నీగా ఉంటుంది.
* స్క్రిప్ట్ పరంగా మీ సలహాలను దర్శకుడు ఏమైనా తీసుకున్నారా?
- యస్. చాలా సందర్భాల్లో మహి డిస్కస్ చేసేవాడు. సీన్లు ఎలా ఎలివేట్ చేయాలనే విషయం మీద మేం బాగా డిస్కస్ చేసుకునేవాళ్లం. నేను చెప్పిన సలహాలు నచ్చితే తీసుకునేవాడు. లేకుంటే తన పంథాలో వెళ్లేవాడు. హి ఈజ్ వెరీ గుడ్ అట్ హిస్ వర్క్. పైగా ఈగోలు ఉండవు. కష్టపడతాడు. తనని తాను గట్టిగానే విమర్శించుకోగలడు. చాలా పాజిటివ్ గుణాలున్నాయి.
Taapsee interviewgallery
* ఈ సినిమా ప్రమోషన్స్ లో కాసింత హుషారుగా పాల్గొంటున్నట్టున్నారు?
- ఇందులో పెద్ద హీరో లేడు. పైగా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా. అందుకే ప్రమోషన్ గట్టిగా చేయాలని నిర్ణయించుకున్నా. ఈ సినిమాకే కాదు, ఇకపై నేను ఏ సినిమా చేసినా ఇలాగే ప్రమోషన్ చేస్తా.
* సినిమాలను కావాలనే తగ్గించుకున్నారా?
- ఇంతకు ముందు ప్రతి సినిమానూ చేసేదాన్ని. దాంతో సక్సెస్ రేట్ పెద్దగా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు కాస్త ఆచితూచి చేస్తున్నాను. అందుకే సక్సెస్ రేట్ కాస్త పెరిగినట్టు కనిపిస్తోంది. అలాగని భవిష్యత్తులో కమర్షియల్ చేయనని అనుకుంటే పొరపాటుపడ్డట్టే. కథ, అందులో నా పాత్ర బావుంటే మంచి గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమే.
* హిందీ సినిమాల మీద దృష్టి పెట్టడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా?
- అలాంటిదేమీ లేదండీ. ప్రతి రోజూ కష్టపడాలనుకునే తత్వం నాది. మంచి స్క్రిప్ట్స్ వచ్చాయని చేశాను. అయినా టాలీవుడ్ కన్నా బాలీవుడ్ గొప్పదని ఎవరన్నారు? అలాంటివేమీ లేవండీ. ఇప్పుడు హిందీతో పోలిస్తే తెలుగులోనే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. హిందీలో నాలుగో, ఐదో సినిమాలు హిట్ అయ్యాయంతే. తెలుగులోనే ఎక్కువ సినిమాలు హిట్ అయ్యాయి.
* మీ డ్రీమ్ రోల్ ఉందా?
- నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే స్పోర్ట్స్ కాన్సెప్ట్ తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నా. నేను ఏ సినిమా చేసినా, ఆ సినిమాకు వెళ్తే ఆడియన్స్ సంతృప్తి చెందాలి. అలాంటి సినిమాలు చేయాలని ఉంది.