pizza

తెలుగు మాటకి కంచు-కోట by Srinivas Kanchibhotla

You are at idlebrain.com > news today >

22 July 2025
Hyderabad

కోటకి సహజత్వం తక్కువ, ఆ మాటకొస్తే అసలు లేదనే చెప్పాలి. నటులు జీవితాన్ని క్షుణ్ణంగా చదివి, కాచి వడపోసి, ఆ బ్రతుకు తాలూకు సారాన్ని తమ కళలో నిరంతరం ప్రతిబింబింప చేయాలి, అన్న రూళ్ళ కర్ర పద్ధతులకీ, నినాదాలకీ ఆరామడల దూరం కోట. కోట అంటేనే నటన, కోట అంటేనే నాటకీయత. తను నటిస్తాడు, జీవించడు. ఒక విధంగా నటన అన్నది సహజత్వానికి వ్యతిరేక పదం. పాత్రలో ఒదిగిపోయి, లీనమైపోయి, ఏకమైపోయే నటన ఒక పద్ధతి. ఇందులో నటన కంటే నటుడు ఎక్కువ కనిపిస్తాడు... ఆహా, ఫలాన నటుడు గుడ్డి వాడిలాగా చించేసాడు, చెరిగేసాడు బాపతు... పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, ఆ పాత్ర తాలూకు భావాలు, భాషలు, భూషలు తన మీద ఆవాహన చేసుకునే నటన మరో పద్దతి. ఇందులో పాత్రధారి కంటే పాత్ర ఎక్కువ కనపడుతుంది. రచయిత ఆలోచనలు, దర్శకుడి సూచనలు ఈ రెండిటికీ న్యాయం చేయగల నటుడు దొరికితే, ఆ పాత్ర పరాకాష్టకు చేరుతుంది, ఆ నటన ఉత్కృష్టమవుతుంది. కోట ఈ రెండో జాతికి చెందిన వాడు. సహజత్వం మీద ఒక అడుగు వేసి దాని ఆలంబనగా అమాంతం ఒక్క గెంతు గెంతి, రెండో పాదంతో అభినయ ఆకాశ విశాల విస్త్రుతిని తన పాదాక్రాంతం చేసుకున్న వామనుడు కోట. అచ్తిఒన్ ఇస్ రేచ్తిఒన్ అంటే ఒక పాత్ర నటన అన్నది పరిస్థితుల ప్రతిక్రియగా అభివర్ణింపబడిన మూస ఒరవడిని దాటుకుంటూ.. కాదు తొక్కుకుంటూ పోయి, నటన అన్నది ఒక చర్య కాదు, నటన అన్నది సహజాతమైన అంటే తన నుండి సహజంగానే ఉద్భివించేదనే ఒక లక్షణం అని, నటన అన్నది క్రియా పదం కాదు, అది ఒక విశేషణం అనీ కొత్త భాష్యం చెప్పిన నవయుగ వైతాళికుడు కోట శ్రీనివాసరావు. తను ఏ నటనా పాఠశాలలో చదువుకోలేదు, ఎక్కడా తర్ఫీదు పొందలేదు, ఎవరిచేతా తీర్చిదిద్ద బడలేదు, అతను నటన కేవలం ఒక వ్యాపకం అనుకోలేదు, ఎప్పుడూ దానిని వ్యాపారపరంగా చూడలేదు. అసక్తి, అనురక్తి, అంకిత భావం - కేవలం ఈ త్రిగుణాలతో త్రివిక్రముడిలా అటు రంగస్థలాన్ని, ఇటు వెండి తెరనీ ఏకఛత్రాదిపత్యంగా ఒక రెండున్నర దశాబ్దాల పాటు ఏలాడు. బుల్లితెర అప్పుడే బుడిబుడినడకలు వేసే సమయంలో, విశిష్టమైన ఉచ్ఛారణతో, ఆకట్టుకునే అభినయ కౌశలంతో "హుష్ కాకి", "ఇల్లలికిన ఈగ" లాంటి నాటకాల్లో బిచ్చగాడిలాగా, చుట్టపు చూపుగా వచ్చి పాతుకుపోయిన జడ్డి అతిథి తళుక్కున మెరిసి, ఎవరబ్బా ఈ నటుడు అని ప్రదర్శన తరువాత వచ్చే పాత్రలు-పాత్రధారులు కార్డు కోసం వెతికేట్టు చేసిన నిఖార్సైన కళాకారుడు కోట!

ఆత్మ సంతృప్తి మాట పక్కనుంచి మనసులో ప్రతి కళాకారుడు కోరుకునేది ఈలలూ, చప్పట్లూ, వన్స్ మోరులే! దానికి తగినంత పారితోషికం ముడితే బంగారానికి తావి అబ్బినట్టే కాని, ఆర్టిస్టు అనిపించుకున్న వాడి అసలు ప్రాణ వాయువు అభినందనలే. రంగస్థల వేదికకు పెద్దైపోయి నెమ్మదిగా రామంతపూర్ దూరదర్శన్ వైపు అడుగులు, మరి కొంత కాలానికి బుల్లితెర కురచైపోయి వెండితెర వైపు పరుగులు, 80వ దశకం లబ్ద ప్రతిష్టులైన స్టేజ్ ఆర్టిస్ట్లు అనిపించుకున్న వారిదందరిదీ ఇదే దారి... కోట అందుకు మినహాయింపు కాదు... అంతకు మునుపు చిన్న చితకా వేషాలు తన పేరుని తెర మీద చూసుకోవాలన్న తపన కోసం చేసినా, ఉల్క లాగా విసురుగా భూమి బద్దలయ్యే వేగంతో వచ్చి 'ఈ రంగం నాది ' అని ఘంటాపథంగా గంట బజాయించి మరీ నొక్కి వక్కాణించిన పాత్ర, ప్రతిఘటన చిత్రంలో కాశయ్య పాత్ర. కమర్షియల్ తెలుగు సినిమాలో తెలంగాణా మాండలీకంలో పూర్తి నిడివిగల పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశాడు కోట. ఆ ఉచ్ఛారణలో కానీ, పద విరుపులో కానీ, మాండలీకంలో కానీ, నుడికారంలో కానీ, అచ్చమైన తెలంగాణా బిడ్డగా ఒదిగిపోయాడు ఈ కృష్ణా జిల్లా కంకిపాడు కుర్రాడు. గింక గప్పని సంది సైన్మాలలో తెలంగాణా యాస లో ఎవ్వడ్ బాత్ చిడాయించాలన్నా కోటన్నే రావాలి, కోటన్నే కొట్టాలి. ఆ తరువాతి కాలంలో జయప్రకాశరెడ్డి రాయలసీమ యాసకి అంటుకుపోయినట్టు, కోట తెలంగాణా ప్రాంతానికి దత్త పుత్రుడయ్యాడు, ఆ భాషలో సొగసుకి ముద్దు బిడ్డ అయ్యాడు. విలన్ వేషంలో తెలంగాణా మాండలీకం అంటే గొంతుని మంద్రం చేసి, తల కిందకు దించి, కను బొమలు కిందకి చేసి "ఏంది వయా!" అన్నా, అదే నవ్వు తెప్పించాల్సిన పాత్ర అంటే (ఉర్దూ భాషతో సంపర్కం వల్ల) ఆ మాండలీకంలో ఉన్న హ్రస్వాలతో హాస్య తంత్రులని అంతే సుతారంగా మీటి చక్కలిగింతలు పెట్టేవాడు. తనే చెప్పుకున్నట్టు, ఆ మాండలీకం మీద పట్టు సాధించడానికి ప్రత్యేకంగా చేసిన కోర్సులు, కసరత్తులు ఏమీ లేవు. నటుడికి ప్రాధమికంగా ఉండాల్సిన పరిశీలన, అనుకరణ లక్షణాలు కోట కి పుష్కలంగా ఉండడంతో దక్కనీ తెలుగుని పుక్కిట పట్టడానికి ఆట్టే సమయం పట్టలేదు. ప్రతిఘటన కాశయ్య పాత్ర ఊపుకు కొనసాగింపుగా, అవే అనుకరణ అనుసరణ మంత్రాలని త్రికరణసుద్ధిగా నమ్ముకుని కోట చెలరేగిపోయిన మరో పాత్ర, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీయార్ పై సహనటులు కృష్ణ, ప్రభాకర్ రెడ్డి కలిసి కోట భుజం మీద నించి సంధించిన వ్యంగం.... కాదు కాదు... పూర్తి ఎగతాళి అస్త్రం, "మండలాధీశుడు". వ్యంగానికి ఎగతాళికీ ఉన్న తేడా - మోతాదు. హద్దులో ఉంటే వ్యంగ్యం అవుతుంది, మోతాదు మించితే ఎగతాళి అవుతుంది. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న కోట ఎన్టీయార్ ని అనుకరించలేదు.... అచ్చగా దింపేశాడు అనే చెప్పాలి. రాజకీయ జీవితపు తొలి రోజుల్లో ఎన్టీయార్ విపరీత పద్ధతులను (నాటకీయ ఫక్కీలో రాజకీయ ప్రసంగాలు, తెర వదిలినా తెరమరుగవని విచిత్ర వేషధారణ) ఏ ఒక్కదానినీ వదలకుండా పదిలంగా పది కాలాల పాట అందరికీ గుర్తుండే విధంగా నకలు దించేసాడు కోట. తన నట జీవితంలో వైవిధ్యమైన, విపరీత ధోరణులున్న ఈ రెండు పాత్రలు తన నటజీవితానికి అతి ముఖ్యమైన పునాది రాళ్ళు అయినాయి. ఇక వెనకకి తిరిగి చూసుకోలేదు కోట.

తెలుగునాట కేరెక్టర్ ఆర్టిస్టులుగా పేరుమోసిన వారికీ (యస్వీ రంగారావు నించి కైకాల సత్యనారాయణ వరకూ) కోట కి ఉన్న ప్రధామైన తేడ, కోటని ఎప్పుడూ కరుణరస పాత్రలు వరించకపోవడం. ఎంత ఘాటు విలన్లకైనా అక్కడో ఇక్కడో మూర్తీభవించిన మానవత్వాన్ని నింపుకున్న పాత్రలు పడినా, విచిత్రంగా కోట విషయం వచ్చే సరికి తనని ఒక విలన్ గానో, లేదే హాస్య నటుడుగానో దర్శక రచయితలు చూడగలిగరే తప్ప, అంత గంభీరమైన గొంతు ఉన్న నటుడికి, హావభావలు అంత చక్కగా పలికించగల కళాకారుడికి నెమ్మదించే పాత్రలు ఎక్కడా పడలేదు. అది కోటకి ప్రేక్షక లోకానికీ ఇద్దరికీ తీరని లోటే. ఆ లోటు రెండితలు భర్తీ చేసే లాగా హాస్య పాత్రలకు పెట్టింది పేరయ్యాడు కోట. దానికి ప్రధాన కారణం అతని గాత్రం. ఏ పదాన్ని ఎక్కడ నొక్కాలో, ఈ మాటని ఎక్కడ వత్తాలో, పదాల మధ్యలో సరిగ్గా ఎంత నిడివి ఉండాలో - ఇంగ్లీషులో చెప్పాలంటే మంచి "టైమింగ్" ఉన్న నటుడు అతను. "అహ నా పెళ్ళంట" లో తన నటనకి లోకం నీరాజనం పట్టినా, జంధ్యాల చిత్రాలకంటే, కోటకి తన విశ్వరూపం చూపించగల అవకాశాలు దక్కింది మాత్రం జంధ్యాల శిషుయుడైన ఇవీవీ చిత్రలలోనే. గోదావరి జిల్లా యెటకారానికి, కృష్ణ జిల్లా నుడికారం జత కలిస్తే ఆత్రేయపురం పూత రేకు పొరల మధ్య బందరు నల్ల హల్వాని కూరి కొరికి తిన్నట్టే! ఇవీవీ సినిమాలు కమేడియన్ నటుల భువన విజయాన్ని తలపించేది. దిగ్గజాల నుండి పిపీలకాల దాక, గట్టి నటుల నుండి పొట్టి వారి దాక, అతని సినిమాలలు ఒక దశాబ్ద కాలం పాటు కమేడియన్ల కూర మార్కెట్టే! ఆ సంత మొత్తానికీ ముఠా మేస్త్రీ మాత్రం కోటానే! కామిడీ పరంగా కోటని ఇవీవీ వాడుకున్నంత లబ్జుగా మరే దర్శకుడూ వాడుకోలేదనే చెప్పాలి. విజయ వారి చిత్రల్లో రేలంగోడు లాగా, ముళ్ళపూడి రమణ చిత్రల్లో రామలింగయ్య లాగా, జంధ్యాల చిత్రాల్లో (చనిపోయే దాకా) సుత్తి వీరభద్రరావు లాగా, ఇవీవీ కి కోట. తన మిగతా చిత్రాలన్నీ ఒక ఎత్తు, ఇవీవీ "హలో బ్రదర్" చిత్రంలో కోట "తాడి మట్టయ్య" పాత్ర ఒక ఎత్తు!

కోట పెద్ద నటుడు - రాసి, వాసి పరంగానే కాదు - తన అభినయ పరంగా కూడా. కోట నటన లో "నటన" ప్రమాణం, పరిమాణం కాస్త అధికమే, అలా అని "అతి" ఎక్కడా కనపడదు. పాత్ర పరిధి ఏదో తెలుసుకుని ఆ సరిహద్దు గీతని దాటకుండా తప్పకుండా తొక్కి మాత్రం వచ్చే నటన కోటది. అందుకే తన చేష్టలు, విన్యాసాలు, చేతులు అన్నీ పనిలోకి పెట్టి ఒళ్ళు దాచుకోకుండా పని చేసిన నటుడు కోట. అలాంటి నటుడు అన్నీ కట్టుకుని కూర్చుకుని చేయాలంటే? కోడి రామకృష్ణ "శత్రువు" కోటలోని మితికి చక్కని ఉదాహరణ. ఆ పాత్రలో అన్నీ నియంత్రణ రేఖకి లోబడే ఉంటాయి - మాటలు పొదుపుగా, చేతలు పొందికగా, ప్రతి సీను చివర మకుటంగా "థాంక్స్" అనడం, సరైన పాత్ర పడితే విస్త్రుతి పెంచి భయ భ్రాంతికి గురించేయడమే కాదు, తగ్గించుకుని, కుదించుకుని ఔరా అని రెండో వైపు కూడా తన కత్తి పదునే అనిపించగలిన అరుదైన నటుడు కోట. చిన్నది పెద్దది కాదు, అసలు "నటించడం" అన్నదే తీసేస్తే? రాంగోపాల్ వర్మ "శివ" సినిమాలో తళుక్కున మెరిసి పోయిన ఎమెల్యే "మాచిరాజు" పాత్ర. నిడివి తక్కువైన తన కెరీర్లో మునుపెన్నడు ఆ తరువాత ఎప్పుడూ చేయని సహజమైన పాత్ర అది. ఆకు రౌడీల అండగా ఎదిగి అవసరం తీరిన తరువాత అరిటాకులా వాడుకు పారేసే ఎమెల్యే పాత్రలో కోట తొలిసారిగా మలిసారిగ సహజసిద్ధమైన నటన కనపరిచాడు.

తెలుగు సినిమాలలో తెలుగు సరిగ్గా పలకగలిగే నటులే కరువైపోతున్న ఈ రోజుల్లో, నటుడికి ఒక్క భాష మీద పట్టు ఉంటే చాలు, తత్తిమావన్నీ తరువాతే అని ఢంకా బజాయించి మరీ నిరూపించిన చివరి నటుడు కోట.

"పాత్ర" అన్న పదానికి నిలువెత్తు రూపం కోట - తోడుకున్న వాడికి తోడుకున్నంత, నింపగలిగిన వాడికి నింపుకున్నంత, వాడుకోగలిగిన వాడికి వాడుకున్నంత!

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved