రోడ్డు బాగుచేయమంటే.. ఏకంగా 16 లేన్ల సూపర్ ఎక్స్ప్రెస్ హైవే వేసేసిన కాంట్రాక్టర్ రాజమౌళి - ప్రశాంత్ నీల్
ఎలివేషన్ అన్న పదానికే ఎలివేషన్ ఇవ్వగల దర్శకుడు ప్రశాంత్ నీల్. ఊపిరి బిగబట్టుకొని ప్రేక్షకులు కుర్చీలకు అతుక్కుపోయేలా చేయగలిగే దర్శకుడు అతను. అలాంటి దర్శకుడు మరో దిగ్గజ దర్శకుడికి ఎలివేషన్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించగలమా! ఊహలకే అందనంత ఎత్తులో ఉంటుంది.
వివరాల్లోకి వెళ్తే ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి నీల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన భర్త మాటలను జోడిస్తూ ఓ స్టేటస్ పెట్టారు. ఆ స్టేటస్ లో తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడైన రాజమౌళిని కీర్తిస్తూ ప్రశాంత్ నీల్ చెప్పిన మాటలను ఆమె చేర్చడం జరిగింది. ఆ స్టేటస్ లో.. "ఒక రోడ్డు సరిచేయాల్సి వచ్చింది. అప్పుడు వాళ్లు ఒక కాంట్రాక్టర్ ను పిలవడం జరిగింది. ఆ వచ్చిన ఆ కాంట్రాక్టర్ రోడ్డుని సరిచేయలేదు. ఏకంగా 16 లేన్లతో సూపర్ ఎక్స్ప్రెస్ హైవేనే నిర్మించాడు. ఆ పాన్ ఇండియా హైవేను నిర్మించిన కాంట్రాక్టర్ పేరే రాజమౌళి" అంటూ రాజమౌళిపై తన గౌరవాన్ని వ్యక్తం చేశారు ప్రశాంత్ నీల్. 'బాహుబలి-The Epic' విడుదల సందర్భంగా బాహుబలి బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ అన్న మాటలను స్టేటస్ రూపంలో లిఖితా రెడ్డి నీల్ పెట్టడంతో సోషల్ మీడియాలో రాజమౌళి అభిమానులు ప్రశాంత్ నీల్ పై ప్రశంశలు కురిపిస్తున్నారు.