pizza

రగిలే అక్షర జ్యోతి, రామోజీ
Srinivas Kanchibhotla tribute to Ramoji Rao

You are at idlebrain.com > news today >

8 June 2024
Hyderabad

జరిగే పని మాట్లాడాలి కాని చేసే మనిషి కాదు అన్న సూత్రానికి నిలువెత్తు నిదర్శనం రామోజీ రావు. తెలుగు నాట తనంటే తెలియని వాళ్ళని ఒక చేతి వేళ్ళ మీద లెక్కించచ్చు, కాని తెర వెనుక ఉన్న అసలు రామోజీ రావు ఎవరు అని అడిగితే, అదే నిష్పత్తి తిరగబడుతుంది. కారణం అంటే, చేసే పని - చేయించే మనిషి, అఙ్ఞాతి సూత్రం. ఆధునిక తెలుగు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన మనుషుల గురించి చెప్పుకోవాలంటే, ఒక అల్లూరి, ఒక పొట్టి, ఒక గిడుగు సరసన చేరదగ్గ పేరు ఒక చెరుకూరి. గుండు సూది నుండి విమానాల దాక అనేది ఒక వ్యాపార పంథా (టాటా), సబ్బు బిళ్ళల నుండి సాఫ్ట్ వేర్ వరకు అనేది మరో మార్గం (విప్రో), వీటి సరసన ఠీవిగా తలెత్తుకుని గర్వంగా నిలబడగలిన నూతన వ్యావాపర విగ్రహ వాక్యం, పచ్చళ్ళ నుండి పత్రికల దాక. వినిమయ వస్తువుల వెంబడి మాత్రమే వెల్తూ, వినియోగ దారుల చిటికెన వేలు విడవకుండా పట్టుకుని సఖ్యం సాప్తపదీనం చేస్తూ ఉంటుంది ఆర్ధిక వ్యవస్థ అన్న ప్రాధమిక వ్యాపార సూత్రాన్ని తిరగరాసి, వాటి సరసన "వార్త " కూడా సమాజాన్ని అంతే ప్రభావితం చేయగలదు అన్న కొత్త ఒరవడి నాంది పలికిన అభినవ వార్తా వైతాళికుడు, వ్యాపార ధురీణుడు రామోజి. అల్లూరి అల్లే స్వాతంత్ర్య సమరాలు చేయలేదు, పొట్టి అల్లే ప్రత్యేక రాష్ట్రా పోరాటాలు చేయలేదు, గిడుగు అల్లే ఆధునిక వ్యావహారిక భాషోద్యమాలు చేయలేదు, అయినా తెలుగు నాట సమాచారం అన్న వింటి మీద, వార్త అన్న అక్షర తుణీరాన్ని చేత బట్టి, సామాజిక కురుక్షేత్రంలో ప్రస్తుత స్థితిగతుల మీద యెడ తెగని యుద్ధం చేసిన అభినవ అర్జునుడు రామోజీ. ఇంత చేసినా, తను స్థాపించిన పత్రికలో వచ్చే వార్తకు మల్లే, రాసినది మాత్రమే తెలియాలి, రాసే వాడి చరిత్ర మాత్రం గుప్తం, గోప్యం, గుంభనం.

పూలు అమ్మినా, పాలు అమ్మినా, పచ్చళ్ళు పెట్టినా, రామోజి అసలు అభిరుచి మాత్రం అక్షర రంగమే అన్నది నిర్వివాదాంశం. వార్తాపత్రికలు తన ముందూ చాలా ఉన్నాయి, తన తరువాత కూడా చాలా వచ్చినాయి. అయినా తెలుగునాట "ఈనాడు " కు ఉన్న స్థానం, ఇళ్ళ లోగిళ్ళల్లో ఉదయమే వినిపించే ఎమ్మెస్ సుబ్బలక్ష్మి సుప్రభాతం లాగా, పొద్దున్నే ప్రతి తెలుగు వాడి నోటికి చేరే చిక్కటి కాఫీ రుచి లాగా, కళ్ళాపితో శుభ్రం చేయబడి ముగ్గులతో నింపబడిన ముంగిళ్ళలాగా, పది కాలాలు పదిలం. అందుకు కారణం ఒక్కటే, ఏం చెప్తున్నాం అన్నది కాదు, ఎలా చెప్తున్నాం అన్న దాని దృష్టి పెట్టడం చేత. అదే, ఈనాడును మునుపున్న వార్తపత్రికల నుండి వేరు చేసి, వార్తాపత్రికలని వెలుతురు సోకని గ్రంధాలయాల గదుల నుండి బయటికి తెచ్చి జనబాహుళ్యం చేతుల్లోకి తెచ్చిపెట్టింది, గుండెల్లో చోటు చేసి పెట్టింది. అప్పటి ఛందస, ఛాందస, గ్రాంధిక భాషా శృంఖలాలలో బందీ అయ్యి, పండితుల నాట వెట్టి కూలిగా బతుకీడుస్తున్న భాషకు, గిడుగు రామ్మూర్తి వ్యావహారిక భాషోద్యమం ఏ విధంగా స్వాతంత్ర్యం సంపాదించి పెట్టి సామాన్యుల ఇళ్ళల్లో కూడా స్వేచ్ఛామతిగా తిరిగే అవకాశం కల్పించిందో, ఈనాడు రాక అదే రీతిగా వార్తాపత్రికా భాషను గ్రాంధికానికీ వ్యావహారికానికీ సయ్యోధ్య తెచ్చి సాహిత్య స్థానాన్ని సముపార్జించి పెట్టింది. ఈ శైలి వార్తని సమాచారంగా మలచడంలో ఎంతో దోహదపడి, ప్రజలను చైతన్యవంతులను చేయడంలో చాల కీలక పాత్ర పోషించింది. భాషని ఈ విధంగా వాడాలన్న నిర్ణయం ఒక వ్యాపారత్మక నిర్ణయం ఖచ్చితంగా కాదు. భాష మీద ఎంతో అభిమానం ఉంటే తప్ప, ఆ భాషని అందరికీ చేర్చాలన్న తపన ఉండదు. ఆ తపనను, ఒక తపస్సు లాగా, ఒక యఙ్ఞంగానో చేస్తే, ఆ ఆశయంలోని నిబద్ధత, ఆ ఆచరణలోని పట్టుదల సూటిగా పాఠకుడి మనసుకీ బుద్ధికీ చేరి, ఆ మాట మీద ఒక నమ్మకం కల్పిస్తాయి. #ణ్టృ# రాజకీయ ఉత్థాన పతనాలకు, గెలుపు ఓటములకు కొమ్ము కాసిన, కాడి మోసిన ఈనాడు మాట కున్న మంత్రశక్తి అదే - విశ్వసనీయత. ఆ విశ్వాసం, విశ్వసనీయత వెనుక ఉన్న మాట మీద గౌరవం తెచ్చి పెట్టినది మాత్రం, రామోజీకి భాష మీద ఉన్న ప్రేమ.

పత్రికా రంగంలో జయకేతనం ఎగరవేసిన తరువాత, సమాజం మీద అంతే ప్రభావం చూపగలిగిన మరో రంగం - సినిమా - వైపు రామోజి అడుగులు. వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో, కొత్త వ్యాపారంలో అడుగు పెట్టే ముందు విఙ్ఞులు చేసే మొదటి పని, దిగే ముందు దాని లోతు ఎంత ఉన్నదో బేరీజు వేసుకోవడం, దానికి తగ్గ సంపత్తిని సమకూర్చుకోవడం. ప్రజల నమ్మకం చూరగొన్న ఒక రంగం నించీ దేని మీదా ఎవరి మీదా ఏ మాత్రం నమ్మకం లేని మరో రంగం వైపు ధీమాగా అడుగుల వేసిన రామోజీకున్న ధైర్యం వెనుక ఉన్న నమ్మకం, సినిమా రంగానికి సంబంధించినంత వరకూ అతని పునాది పెట్టుబడి, తను నమ్ముకున్న వార్తాపత్రికే. ఒక సినిమా పత్రికకు ఒక వార్తా పత్రికకున్న ప్రాముఖ్యత, ప్రాబల్యం, ప్రభావం కల్పించడం అన్నది, అందునా సినిమా వార్తలను పాఠకులను తప్పు దారి పట్టించని నీలి వార్తలుగా కాక, సినిమా పత్రికను వార్తా పత్రికకు దీటుగా దాని పక్కనే సముచిత స్థానం "సితార " సినిమా పత్రిక ద్వారా కల్పించడం, రామోజీ దార్శనికతకు దృష్టాంతం. అసలు సినిమా అంటేనే ఒక చిన్న చూపు ఉన్న సమాజంలో, అందునా సినిమా పత్రికకు రాసే వాడు అంటే, బతకలేక బడిపంతులన్నట్టు, పాత్రికేయుడు కాలేక సినిమా పాత్రికేయుడయ్యాడు అనుకుంటున్న రోజులలో, సినీ వార్తలకూ, సినీ సమీక్షలకూ భాషా పరమైన గౌర్వరం కల్పించదగ్గ ఉన్నత ప్రమాణాలు పాటించే విధంగా, ఒక సినీ పత్రికను నడపడం రామోజీ సంస్కారాన్ని సూచిస్తుంది. ఇక తన సంస్థ ద్వారా తను తీసిన సినిమాలు కూడా, వార్త పత్రికకు పొడిగింపుగానే తోస్తుంది. సమాజంలోని యధార్ధతను, వాస్తవికతను తన చిత్రాలలో ప్రతిబింబించే విధంగా చిత్ర నిర్మాణం ఉండడం, అక్షరానికి (వార్తకు) దృశ్య రూపమివ్వడమే. దానికే ఒకే తార్కాణం, ఆ రోజుల్లో సమాజాన్ని కుదిపేసిన రాజకీయ సంచలనం - ప్రతిఘటన.

అతని ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, అన్న బాగా నానిన నానుడి రామోజీకి వర్తించినట్టుగా తెలుగు నాట బహుశ మరెవరికీ వర్తించదేమో. వెండి తెర నుండి బుల్లి తెరకు రంగప్రవేశం. అవే ప్రమాణాలు, అవే సూత్రాలు, అదే గౌరవం, అవే విలువలు. హైదరబాదుకి పరిశ్రమ పూర్తిగా వచ్చేసిన తరువాత, పరిశ్రమ అవసరాలను గుర్తించి, అయిడియాతో లోపలికి వచ్చి సినిమా రీలుతో బయటికి వెళ్ళే విధంగా సర్వం స అన్నట్టున్న స్టుడియో నిర్మాణంలోనూ అవే ప్రమాణాలు. ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలో ఒదిగిపోయే లక్షణమున్న నీరులాగా, రామోజీ ఆలోచనలు, వ్యాపార నిర్ణయాలు కుడాను. ఏ రంగంలో ప్రవేశిస్తే ఆ రంగంలో తను అనుకున్న పెట్టుకున్న లక్ష్యం, లాభం కాదు, వినిమయం కాదు, గౌరవం. మొదట ప్రజలకు తన సంస్థనుండి వస్తున్న వస్తువు మీద గౌరవం కలిగితే, నమ్మకం కుదిరితే, ఆ వస్తువును సమాజం స్వచ్చందంగా అందలం ఎక్కించి ఊరేగిస్తుంది అన్నది తను నమ్ముకున్న ఏకైక వ్యాపార సూత్రం. అది ప్రియా పచ్చళ్ళకైనా, సితార పత్రికకు అయినా, ఈనాడు వార్తా పత్రికకైనా, మార్గదర్శి పొదుపు సంస్థ అయినా - అదే గౌరవరం, అదే విశ్వసనీయత, వీటి అన్నిటి వెనక ఉన్నది, మాట మీద నమ్మకం. తన జీవితము చివరంటా భాషా దాస్యం చేదిసిన సేవలకు మెచ్చి శారదా దేవి పెట్టని కీర్తి కిరీటము లేదు, తొడగని కలికితురాయి లేదు. రామోజీ అంటే వ్యాపారము కాదు, సంస్థలూ వ్యవస్థలూ కావు, తెర వెనుక నెరిపిన మంత్రాంగం కాదు, తను నిర్మించిన భారీ యంత్రాంగం కాదు, ఎప్పుడో నాలుగున్నర దశాబ్దాల కాలం క్రింద చిన్న భాష దీపం వెలిగించిన పద దాసుడు రామోజీ, నేడు చిరంతనమూ రగిలే అక్షర జ్యోతి, రామోజీ.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved