విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం `పెళ్లిచూపులు`. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. డి.సురేష్ బాబు సమర్పణలో ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై రాజ్‌కందుకూరి, యష్ రంగినేని నిర్మాతలుగా ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వందరోజుల వేడుక శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో ..
హీరో విజయ్ దేవర కొండ మాట్లాడుతూ - ``ప్రతి ఒక్కరికీ అమ్మ నాన్న పేరు పెడతారు. అందరూ ఆ పేరును నిలుపుకోవడానికి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. నాకు అలాగే మా అమ్మనాన్న విజయ్ దేవరకొండ అని పేరు పెట్టారు. కానీ పెళ్లిచూపులు చిత్రంతో నాకు ఒక గుర్తింపు వచ్చింది. ఇంత మంచి గుర్తింపు నిచ్చిన సినిమాను డైరెక్ట్ చేసిన తరుణ్ భాస్కర్, నిర్మాతలు రాజ్ కందుకూరి, యష్ రంగినేని, సురేష్ బాబులకు థాంక్స్. సినిమాను నిర్మించే దశలో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తూ చేశాం. ఆ ఎంజాయ్ మెంట్ ఇప్పుడు వంద రోజుల వేడుకగా కళ్ల ముందు కనపడటం ఎంతో ఆనందంగా ఉంది`` అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ``కంటెంట్‌ను నమ్మి కొత్తవారైనప్పటికీ ఒక మంచి టీంతో చేసిన సినిమా పెళ్ళిచూపులు. ప్రేక్షకులు ఆదరణ అపూర్వమని చెప్పాలి. వారి ఆదరణతో కొన్ని థియేటర్స్‌లోనే ముందుగా విడుదల చేసిన తర్వాత థియేటర్స్‌ను పెంచుతూ వెళ్లాం. ఇప్పుడు సినిమా వందరోజులు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది`` అన్నారు.
డి.సురేష్ బాబు మాట్లాడుతూ - ``సినిమా వందరోజుల వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఒక బ్రిలియంట్ యూనిట్. అందరి కృషితోనే ఇంత మంచి సక్సెస్ సాధ్యమైంది. సినిమా చూసేటప్పుడు ఎంతో ఎంజాయ్ చేశాను. సినిమాపై నమ్మకంతో సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షోస్ వేశాం. చూసిన వారందరూ సినిమా బాగుందని అనడంతో మాలో ఇంకా నమ్మకం పెరిగింది. చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన చిత్రమిది`` అన్నారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ - ``సినిమా వందరోజులు ఆడుతుందని అనుకోలేదు. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో అనుకున్నాం. అయినా షూటింగ్ చేసేటప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాం. ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు. దర్శకుడు కావాలనే నా కల ఈ సినిమాతో నిజమైంది సిన్సియర్ ఎఫర్ట్‌తో చేసే ఏదైనా సక్సెస్ అవుతుందని ఈ చిత్రం ప్రూవ్ చేసింది`` అన్నారు.
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ - ``ముందు ఈ సినిమాను నేను చూడలేదు. అయితే నేను ఎక్కడికి వెళ్లినా అందరూ పెళ్లిచూపులు గురించే మాట్లాడేవారు. దాంతో సినిమా విడుదలైన వారం తర్వాత సినిమా చూశాను. బాగా ఎంజాయ్ చేశాను`` అన్నారు.
Ritu Varma Glam gallery from the event
నందినీ రెడ్డి మాట్లాడుతూ - ``అందరనీ నవ్వించిన సినిమా. ఒక చిన్న సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం చాలా గొప్ప విషయం. చిన్న సినిమా చేయడం చాలా కష్టమైన పని. నిర్మాతను మెప్పించి దర్శకుడు తరుణ్ ఈ సినిమాను తెరకెక్కిస్తే, సినిమా నచ్చి సినిమాను రిలీజ్ చేయడానికి సురేష్ బాబుగారు ముందు రావడం ఇంకా ప్లస్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ ఇండస్ట్రీకి కొత్త ఉత్తేజాన్నిచ్చింది`` అన్నారు.
మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - `` సినిమా ఆడియో విడుదలైన తర్వాత సినిమా టీంలో భాగమయ్యాను. సినిమా చూడగానే తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన తీరు బాగా నచ్చింది. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని ముందే చెప్పాను. సినిమా ఇండస్ట్రీలో పెళ్లిచూపులు కొత్త ప్రాసెస్‌ను స్టార్ట్ చేయించింది. కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని ప్రూవ్ చేసిన చిత్రం ఒక మంచి మార్పుగా భావించవచ్చు`` అన్నారు.
యష్ రంగినేని మాట్లాడుతూ - ``అన్నీ రకాల ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. మంచి కంటెంట్ ఉంది. ఒక ఫీల్ గుడ్ మూవీగా సినిమాను తరుణ్, విజయ్, రీతు అందరూ మలిచారు. కంటెంట్ నచ్చడంతో సినిమాలో నేను భాగమయ్యాను. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
రీతూవర్మ మాట్లాడుతూ - `` సినిమాలో చాలా మంచి రోల్ చేశాను. రోల్‌ను ఫీలై చేశాను. అందరూ నా నటనను అప్రిసియేట్ చేయడం ఆనందంగా ఉంది`` అన్నారు.
ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, నందు తదితరులు పాల్గొన్నారు. చిత్రయూనిట్‌కు నందినీ రెడ్డి, సురేష్‌బాబు షీల్డులను అందించారు.