14 May 2018
Hyderabad
స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్.నారాయణమూర్తి రూపొందించిన చిత్రం `అన్నదాతా సుఖీభవ`. మే 18న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్బంగా సోమవారం ఆడియో ఫంక్షన్ జరిగింది. మాజీ పార్లమెంట్ సభ్యుడు, రైతు నాయకుడు యలమంచిలి శివాజీ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా...
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ - ``500 సంవత్సరాల క్రితం శిస్తు కట్టలేదని కవి శ్రీనాథుడితో రాళ్లు మోయించారు. కొరడాలతో కొట్టించారు. అప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. 500 సంవత్సరాల తర్వాత కూడా రైతు పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చునని మా `అన్నదాతా సుఖీభవ` సినిమాలో చూపిస్తున్నాం. యు.పి.ఎ., ఎన్.డి.ఎ ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలను కన్నబిడ్డల్లాగా చూస్తూ.. రైతులను సవతి బిడ్డల్లా చూస్తున్నారు. వేల కోట్లు రుణాలు ఎగ్గొడుతున్న పారిశ్రామిక వేత్తలను ఏమీ అనడం లేదు. వారికి రుణాలు మాఫీ చేస్తున్నారు. కానీ రైతులను మాత్రం రుణాలు కట్టమని వేధిస్తున్నారు. రైతులకు కూడా రుణ మాపీలు చేయాలి. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి. దళారీ వ్యవస్థను రూపు మాపి, ప్రభుత్వమే పంటను కొని రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలి. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టని రైతు సంక్షేమ పథకాలను సీ.ఎం.కె.సి.ఆర్ ప్రవేశ పెట్టారు. పంట పెట్టుబడి కోసం ఎక్కడా అప్పులు చేయకుండా ముందుగానే ఎకరాకు నాలుగువేల రూపాయలు ఇస్తున్న కె.సి.ఆర్‌గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను`` అన్నారు.
రైతు నాయకుడు యలమంచిలి శివాజీ మాట్లాడుతూ - ``రైతుల బాగు కోసం కె.సి.ఆర్‌గారు రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారు. రైతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన పథకమిది. చరిత్ర సృష్టించిన రైతులపై సినిమాలు తీసిన నారాయణమూర్తిగారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను`` అన్నారు.
సుద్ధాల అశోక్ తేజ మాట్లాడుతూ - ``మాకు నారాయణమూర్తన్నతో మంచి అనుబంధం ఉంది. ఏదైనా సమస్య ఉంటే ముందు ఆయనతోనే మనసు విప్పి చెప్పుకుంటాం. రైతు బంధు పథకాన్ని కె.సి.ఆర్‌గారు ప్రవేశ పెట్టిన సందర్భంలోనే నారాయణమూర్తన్న అన్నదాతలపై సినిమా చేయడం గొప్ప విషయం `` అన్నారు.
గొరేటి వెంకన్న మాట్లాడుతూ ``రైతుల సమస్యలను కూడా కమర్షియల్ పంథాలో తెరకెక్కించిన నారాయణమూర్తిగారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను` అని తెలిపారు.