26 December 2016
Hyderabad
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. చిరంతన్ భట్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల క్యారక్రమం సోమవారం తిరుపతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ, హేమామాలిని, సిరివెన్నెల సీతారామశాస్త్రి, క్రిష్, నారా రోహిత్, చిరంతన్ భట్, శ్రియ, బోయపాటి శ్రీను తదితరులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాతలు అనీల్ సుంకర, డి.సురేష్‌బాబు, కృష్ణప్రసాద్, సాయికొర్రపాటి, అంబికాకృష్ణ మొదటి సాంగ్‌ను విడుదల చేశారు. బాలకృష్ణ అభిమానులు రాజు, జగన్, నవీన్, సతీష్, తిలక్, శ్రీధర్ రెండో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్ మూడో సాంగ్‌ను విడుదల చేశారు. టి.టి.డి. ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ నాలుగోసాంగ్ ను విడుదల చేశారు. రిలయన్స్ డెవలపర్స్ ప్
రతినిధులు ఐదో సాంగ్ ను విడుదల చేశారు.
బిగ్ సీడీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా విడుదలైంది. ఆడియో సీడీలను నారా చంద్రబాబు నాయుడు విడుదల చేయగా తొలిసీడీని వెంకయ్యనాయుడు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎన్.బి.కె నెవర్ బిఫోర్ అనే పుస్తకాన్ని హేమామాలిని విడుదల చేశారు. ఎన్.బి.కె డైరీ, క్యాలెండర్ ను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రిలీజ్ చేశారు.
అనీల్ సుంకర మాట్లాడుతూ - ``సాధారణమైన సినిమాలు తీసి ఎవరైనా సక్సెస్ కొడతారు. కానీ ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం. లెజెండ్ కెన్ మేక్ హిస్టరీ, రిపీట్ హిస్టరీ`` అన్నారు.
అంబికాకృష్ణ మాట్లాడుతూ - ``తెలుగువారి తేజాన్ని ప్రపంచానికి చాటిన చెప్పిన చరిత్రలు చాలా ఉన్నాయి. అటువంటి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి. తండ్రి పేరుతో కాకుండా తల్లి పేరు పెట్టుకున్న శాతకర్ణి చరిత్రను ఈరోజు మనం చూస్తున్నామంటే, క్రిష్‌గారి కృషి, నందమూరి బాలకృష్ణ నటనే కారణం. మన తెలుగువారి చరిత్రను అందిస్తున్న క్రిష్ అండ్ టీంకు అభినందనలు తెలుపుతున్నాను`` అన్నారు.
కృష్ణప్రసాద్ మాట్లాడుతూ - ``బాలకృష్ణగారి మనసు బంగారం. ఆయన మనసుకు తగిన విధంగా మంచి టీం దొరికింది. ఒక అన్‌టోల్డ్ స్టోరీని మనకు తెలియజేస్తున్న ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుంది`` అన్నారు.
సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ - ``గర్జించే సింహానికి, రగులుగున్న కాగడాకు, ఓకేసారి వంద సినిమాలకు.. మాటలు రాయడమంటే మాటాలా, నలబై మూడేళ్లుగా నటిస్తూ మనల్ని అలరిస్తున్న ఇంకా ఫ్రెష్‌గా ఎ.టి.ఎం. నుండి బయటకు వచ్చిన రెండు వేల రూపాయల నోటులా ఉన్న బాలయ్యకు మాటలు రాయడమంటే మాటలా, ...కానీ నేను రాశాను. బాలకృష్ణగారి సినిమాకు మాటలు రాయడం నా కల. క్రిష్‌గారు బాలకృష్ణగారు గౌతమిపుత్ర శాతకర్ణి రోల్ చేస్తున్నారని చెప్పగానే నా ఒళ్లు జలదరించింది. నా డైలాగ్స్ సార్‌కు నచ్చుతాయా..నా పక్కన 99 సినిమాలు కూర్చొని ఉంది. మహానుభావులు రాసిన మాటలు చెప్పిన ఆయనకు నా మాటలు నచ్చుతాయా అనుకున్నాను. కానీ నచ్చాయని అనగానే ఇక చాలనుకున్నాను. కరవాలం, కలం కలిసి జర్నీ చేస్తే ఎలా ఉంటుందో, ఈ సినిమా అలా ఉంటుంది. క్రిష్‌గారు నాకు మార్గదర్శి. ఆయనతో పనిచేసిన ప్రతిసారి రచయితగా నాకు జన్మనిచ్చారు. ఇలాంటి ఓ అద్భుతమైన సిినిమానచ్చిన క్రిష్‌గారికి, నిర్మాతలకు జీవితాంతం రుణపడి ఉంటాను. చిరంతన్ భట్ అద్భుతమైన సాంగ్స్‌ను ఇచ్చారు. గొప్ప సినిమాకు పనిచేశానని జీవితాంత గర్వంగా చెప్పుకునే సినిమా ఇది`` అన్నారు.
నందమూరి బాలకృష్ణ అభిమాని రాజు మాట్లాడుతూ - ``అన్నగారు ఎన్టీఆర్‌గారంటే ప్రాణం, ఆయన తర్వాత బాలయ్యబాబుగారే మాకు అన్నీ. బాలకృష్ణగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. బాలయ్యబాబులా కష్టపడే వ్యక్తిని ఇంత వరకు నేను చూడలేదు. సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది`` అన్నారు.
ఎ.కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ - ``భగవంతుడి ఆశీస్సులు, అభిమానుల అండదండలు బాలయ్యకు ఎప్పుడూ ఉంటాయి. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. ఈ మధ్య ఎక్కడకు వెళ్లినా గౌతమిపుత్ర శాతకర్ణి టీజర్ బావుందని అప్రిసియేట్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న బాలయ్య వందో సినిమా వందరోజులు డెఫనెట్‌గా ఆడుతుంది`` అన్నారు.
బి.గోపాల్ మాట్లాడుతూ - ``ఈరోజు అందరికీ పెద్ద పండుగ. బాలయ్య బాబు 100 సినిమాలు చేయడం ఎంత కష్టమో తెలుసు. ఆరోజుల్లో రాముడున్నా, కృష్ణుడన్నా, వేంకటేశ్వరుడన్నా సీనియర్ ఎన్టీఆర్‌గారే గుర్తుకొచ్చారు. ఈరోజు శాతకర్ణి అంటే బాలయ్య బాబునే అందరికీ గుర్తుకొస్తున్నారు. బాలయ్యగారు మాత్రమే చేయగల సినిమా ఇది. ఎక్కడకు వెళ్లినా గౌతమిపుత్ర శాతకర్ణి టీజర్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని అంటున్నారు. ఈ చిత్రమొక చరిత్రలో నిలిచిపోయే చిత్రం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రిష్ చాలా మంచి డైరెక్టర్. గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
టి.టి.డి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ - ``అప్పట్లో ఎన్టీఆర్‌గారు తిరుపతిలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టి సుందర నగరంగా తీర్చిదిద్దారు. ఆయన కుమారుడుగా బాలకృష్ణగారు ఎన్నో విభిన్నమైన సినిమాలు చేస్తున్నారు. వీరిని మించిన నటులు లేరు, ఇక రారు. నటన పరంగా రాణిస్తూ పౌరాణికమైన పాత్రల్లో మెప్పించే వంశం నందమూరి కుటుంబం. తర్వలోనే బాలకృష్ణ కుమారుడు కూడా సినిమాల్లోకి రాబోతున్నాడు. ఈ కుటుంబానికి వేంకటేశ్వరస్వామి తోడుగా ఉంటాడని కోరుకుంటున్నాను`` అన్నారు.
తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ - ``గౌతమిపుత్ర శాతకర్ణి ఒక అద్భుతమైన చిత్రం. చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం సంక్రాంతి పండుగరోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా చరిత్ర క్రియేట్ చేసేలా అందరూ అండగా నిలవాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ - ``విశ్వాన్ని యేలే వేంకటేశ్వరుని పాదాల చెంత గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల కావడం ఆనందంగా ఉంది. ఇది చారిత్రాత్మక కథ. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశాన్ని హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు పాలించిన ఐదు రాజ వంశాలు తెలుగుజాతివే. అందులో ఐదు వంశం శాతావాహనులు. ప్రపంచాన్ని మన తెలుగు జాతివైపు తిప్పేంత గొప్పగా నాలుగు వందల సంత్సరాలు పరిపాలన చేశారు. అందులో గొప్ప చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి. తల్లి గొప్పతనం తెలిసిన వ్యక్తిగా తన తల్లిపేరునే తన పేరుగా మార్చుకున్న వ్యక్తి. విడిపోయి కొట్టుకుంటున్న భారతజాతిలో 32 రాజులను జయించి, వారి ఖడ్గాలను కరిగించి, ఓకే ఖడ్డంగా మార్చి, ఆ ఖడ్డానికి శాంతి ఖడ్డం అనే పేరు పెట్టడమే కాకుండా శాలివాహన శకంతో కాలాన్ని మలుపు తిప్పాడు. రెండు సంత్సరాల పాటు తీయాల్సిన ప్రాజెక్ట్. ఎంతో కష్టపడి సినిమాను తీసిన నిర్మాతలు రాజీవ్‌రెడ్డి, సాయిబాబు, బిబో శ్రీనివాస్‌లకు అభినందనలే కాదు, తెలుగు జాతి కృతజ్ఞతలు కూడా చెప్పాలి. క్రిష్‌పై ఉన్న నమ్మకంతో ఆయన అభిరుచి తగ్గట్లు ఎంతో రిస్క్‌తో ఈ ప్రాజెక్ట్‌ను చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయితే ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తాయి. ఎవరైనా ఎక్కడి నుండైనా నడక ప్రారంభించి వారి గమ్యాన్ని చేరుతారు. కానీ క్రిష్ గమ్యం అనే చిత్రం నుండే తన నడకను మొదలు పెట్టాడు. ఇప్పుడు ఒకటవ శతాబ్దానికి చేరుకున్నాడు. మరెన్ని శతాబ్దాలు వెనక్కి వెళ్లి మన చరిత్రను ఆవిష్కరిస్తాడో తెలియదు. క్రిష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో పాటలు రాయడం ఒక అగ్ని పరీక్షలా అనిపిచింది. చిరంతన్ భట్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. సాయిమాధవ్ బుర్రా ఆద్యంతం మహా కావ్యంలా ఈ సినిమాను మలిచాడు. ప్రతి ఒక మాటను తూటాలా రాశారు. పాటలు, మాటలు, సంగీతం కలిసి త్రివేణి సంగమంలా కలిశాయి. బాలకృష్ణ మాత్రమే చేయగల పాత్ర గౌతమిపుత్ర శాతకర్ణి`` అన్నారు.
Shriya Glam gallery from the event |
|
|
|
హేమామాలిని మాట్లాడుతూ - ``గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా, మంచి జర్నీగా భావిస్తున్నాను. చాలా ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌గారు యాక్ట్ చేసిన పాండవ వనవాసం చిత్రంలో చిన్న రోల్ చేశాను. ఇప్పుడు ఆయన తనయుడైన బాలకృష్ణగారి 100వ చిత్రంలో తల్లి పాత్రలో నటించాను. యూనిట్ అందరూ చాలా కష్టపడ్డారు. గౌతమిపుత్ర శాతకర్ణి సూపర్‌డూపర్ హిట్ చిత్రంగా సక్సెస్ సాధిస్తుంది`` అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ``గజ గజలాడే చలిలో వేడి పుట్టాలంటే బాలయ్యగారు డైలాగ్ చెప్పాల్సిందే. భగ భగలాడే నిప్పు కూడా కన్నీరు పెట్టాలన్నా బాలయ్యగారు డైలాగ్ చెప్పాల్సిందే. బాలయ్యబాబు ఒక వజ్రాయుధం. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే అనే డైలాగ్‌ను సింహా సినిమాలో చెప్పినట్టు లెజెండ్ 1000 రోజులతో చరిత్ర క్రియేట్ చేశారు. బాలయ్యబాబు 100వ సినిమాగా ఎలాంటి సినిమా చేస్తారోనని అందరూ ఆసక్తిగా చూస్తుంటే తన కీర్తి కోసం కాకుండా అమరావతి ఖ్యాతి ప్రతి తెలుగువాడికి తెలియాలని గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేశారు. ఇంత మంచి సినిమాను మన ముందుకు తీసుకొస్తున్న క్రిష్‌ను అభినందించాలి. ఇది కేవలం 100వ సినిమాయే కాదు. 100 సెంటర్స్‌లో 100 రోజులు ఆడాల్సిన సినిమా`` అన్నారు.
చిరంతన్ భట్ మాట్లాడుతూ - ``గౌతమిపుత్ర శాతకర్ణిలో నేను భాగం కావడం అదృష్టంగా బావిస్తున్నాను. బాలకృష్ణగారి 100వ సినిమాకు మ్యూజిక్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు క్రిష్, నిర్మాతలు సాయిబాబు, రాజీవ్‌రెడ్డిగారికి థాంక్స్. ఇదొక ఎపిక్ మూవీ. విజువల్స్ పరంగా, కంటెంట్ పరంగా, అన్నింటి పరంగా ఇదొక గొప్ప చిత్రం. సినిమాను ఎవ్వరూ మిస్ కావద్దు. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ - ``శాతవాహనులు అనే పేరులో శాతము అంటే సింహం కాబట్టి సింహాన్ని వాహనంగా చేసుకున్నవారే శాతవాహనులు అంటే తెలుగువారు. అప్పట్లో 33 గణ రాజ్యాలను శాతకర్ణి గెలిచి ఒకే రాజ్యంగా చేసినప్పుడు ఆయన జెండాలను ప్రతి ఇంటిపై నాటారు. మన తెలుగువారికి నరసింహ స్వామి దైవం. అందుకేనేమో బాలకృష్ణగారు సింహా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాలు చేశారు. అందులో ఆయన నరసింహస్వామి భక్తుడిగా కనపడ్డారు. ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు శాతకర్ణి గురించి ఒక శాతం తెలిస్తే, ఇప్పుడు 70-80 శాతం మందికి తెలుసు. బాలకృష్ణగారు ఒప్పుకోవడం వల్లనే ఇది సాధ్య కావడంతో వేదికపైనే ఉగాదిని సెలబ్రేట్ చేశాం. ఈ సినిమా టైటిల్‌కు ముందు మా అమ్మగారి పేరు పెట్టాను. ఈ సినిమాతో మా అమ్మగారి పేరు నిలబెడతాను. అలాగే పెళ్లైన తర్వాత పట్టుమని పదిరోజులు కూడా నా భార్యతో ఉండలేదు. నా భార్య చాలా గర్వపడే సినిమా తీశాను. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఒక రూపం నా కంటి ముందు ఆవిష్కృతమైంది. గౌతమిబాల వేసిన శాసనాల ఆధారంగా కొంత విషయం సంగ్రహించాను. లండన్‌లో మనకు తెలియని మన జాతి గొప్పతనం ఎక్కడో ఉంది. సివిల్స్ చదివే ఓ పుస్తకంలో ముప్పై ఐదు పేజీలు గౌతమిపుత్ర శాతకర్ణి గురించి విషయం దొరికడంతో సినిమాను అక్కడ నుండి స్టార్ట్ చేశాం. బి.ఎన్.శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణగారు శాతకర్ణి గురించి చెప్పిన విషయాలను తెలుసుకున్నాను. ఈ క్రమంలో మహారాష్ట్రలోని కొంత మంది మిత్రులకు శాతకర్ణి సినిమా చేస్తున్నానని చెప్పగానే నువ్వు మహారాష్ట్ర వీరుడు కథ చేస్తున్నావా అన్నారు. అదేంటి శాతకర్ణి తెలుగువాడు అన్నాను. అంటే వీర శివాజీ తల్లి జిజియా బాయి శివాజీకి నువ్వు గౌతమిపుత్ర శాతకర్ణి అంత గొప్పవాడివి కావాలని అనే చెప్పేదని వారు చెప్పారు. అలాగే కన్నడలో నూట్రవర్ కన్నడ్ అని పిలుచుకుంటారని తెలిసింది. అలాగే మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో శాతకర్ణి గురించి తెలిసింది. పాశ్చాత్యుల దగ్గరున్న చరిత్ర మన దగ్గర లేదు. గౌతమిపుత్ర శాతకర్ణి ఏ గ్రీకులోనో, రోమ్‌లోనో పుట్టి ఉంటే ఆయనపై వంద పుస్తకాలు వచ్చుండేవి. పది సినిమాలు వచ్చుండేవి, కనీసం మూడు ఆస్కార్‌లైనా వచ్చుండేవి. కానీ ఖర్మ మనమేం చేయలేదు. ఆయన గురించి చదువుతుంటే నా రక్తం మరిగింది. మరి ఇలాంటి చక్రవర్తి ఎలా ఉండాలి. ఆ శాతకర్ణి చూపు తీక్షణంగా ఉండాలి. ఆయన నడుస్తుంటే కాగడా రగులుతున్నట్లు ఉండాలి. కథే కథానాయకుడిని ఎన్నుకుంటుంది. అడుగో బసవతారకమ్మపుత్ర బాలకృష్ణనే శాతకర్ణిగా సరిపోతాడని శాతకర్ణి నాకు చెప్పినట్టు అనిపించింది. ఇది నేనేదో ఆవేశంతో చెబుతున్న మాటలు కావు, ఆలోచించి చెబుతున్న మాటలు. కేవలం కథను పదినిమిషాల్లోనే విని, పద్నాలుగు గంటల్లోనే ఈ సినిమా చేస్తున్నట్లు చెప్పిన వ్యక్తి బాలకృష్ణగారి వల్లే ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. ప్రణాళిక బద్ధంగా వెళ్లాం. ఎప్పుడో శాతకర్ణి అమరావతిని రాజధానిగా చేసుకుని ఏలడం ఏంటి, తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని కావడమేంటి? అంతా దైవ సంకల్పం. తెలుగు జాతి గర్వపడే సినిమా తీశాను. ఇది టికెట్స్ తెగడానికి కాకుండా నాలోని కోపంతో చెబుతున్న మాటలు. ఇలాంటి సినిమాను ఒప్పుకున్న బాలయ్యబాబుగారికి ధన్యవాదాలు. నాతో పాటు ఆయన కూడా కెప్టెన్‌గా ముందున్నారు. పద్నాలుగు నుండి పదహారు గంటలపాటు కష్టపడి పనిచేశారు. తెలుగు జాతి గొప్పతనాన్ని తెలియజేసే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు సంక్రాంతికి వస్తుంది`` అన్నారు.
శ్రియ మాట్లాడుతూ - ``బాలయ్యగారితో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. చాలా కష్టపడే తత్వమున్న వ్యక్తి. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. హేమామాలిని గారితో నటించడం మరిచిపోలేని అనుభూతి. దర్శకుడు క్రిష్, నిర్మాతలు సాయిబాబు, క్రిష్‌లకు థాంక్స్`` అన్నారు.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ - ``నాకు సినిమావాళ్లు, వారిలోని సత్తా కూడా నాకు తెలుసు. మన తెలుగుజాతి చరిత్రను తెరకెక్కించి మన భావితరాలకు మన చరిత్రను తెలియజేసే ప్రయత్నం చేయడం చాలా గొప్ప విషయం. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. సినిమాలు వినోదం కోసం కాకుండా సినిమాలు సందేశాత్మకంగా, విజ్ఞాన వంతంగా తీయడం అరుదుగా జరుగుతుంటాయి. గౌతమిపుత్ర శాతకర్ణి ఒక సందేశంతో, ప్రభోదంతో మన చరిత్రను మనకు గుర్తు చేసే విధంగా రూపొందింది. సినిమా నేపథ్యమే, ఇతివృత్తమే నేను ఇక్కడికి రావడానికి కారణం. తెలుగువారికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి వంటి గొప్ప సినిమా చేయడం ఆనందంగా ఉంది. భారతదేశానికి తొలి చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి సినిమాను రూపొందించిన దర్శకుడు క్రిష్, నిర్మాతలకు, ఇతర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నాను`` అన్నారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ - ``తెలుగువారి రాజహంస ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. మనకంటూ ఓ దేశాన్ని, గుర్తింపునిచ్చి ఏకచత్రాధిపత్యంగా పాలించిన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి. శాతకర్ణిపై సినిమా చేయాలని నాన్నగారికి కోరిక ఉండేది. అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చేయడంతో బిజీగా ఉండి చేయలేకపోయారు. ఇప్పుడు నేను ఈ సినిమాను చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కోటిలింగాల్లో విడుదల చేసిన `గౌతమిపుత్ర శాతకర్ణి` ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాశీలో గౌతమిబాల వేసిన శాసనాలు ఆధారంగా ఈ కథను ప్రారంభించారు. క్రిష్‌గారు తెలుగువారు గర్వపడే సినిమాలు చేశారు. నా 100వ సినిమాగా ఏం చేయాలని ఆలోచిస్తూ ఎన్నో కథలు విన్నాను. ఆ సందర్భంలో క్రిష్ వచ్చి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చెప్పారు. నచ్చడంతో సినిమా మొదలైంది. ఇలాంటి సినిమా చేయడానికి మంచి అభిరుచులున్న నిర్మాతలు కూడా కావాలి. అలాంటి నిర్మాతలు ఈ సినిమాకు దొరికారు. చిరంతన్‌భట్‌గారు సినిమాకు అద్భుతమైన సంగీతానందించారు. సాయిమాధవ్‌గారు ఎంతో పవర్‌ఫుల్ డైలాగ్స్ రాశారు. జ్ఞానశేఖర్‌గారు ప్రతి సీన్‌ను ఎంతో గొప్పగా చూపించారు. ఈ సినిమా చేయడం గొప్ప సంకల్ప బలంగా భావిస్తున్నాం. హేమామాలినిగారు లేకుండా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఉండేది కాదు. అలాగే శివరాజ్‌కుమార్‌గారు ఈ సినిమాలో మంచి పాత్రలో, ఓ మంచి సాంగ్‌లో నటించారు. వ్యవసాయం చేసేలా రైతులా నేను కూడా వంద రకరకాలైన పాత్రలు చేశాను. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కానీ సమయం లేదు మిత్రమా..సినిమా సంక్రాంతికే. ఈ సందర్భంగా నాకు అండగా నిలబడ్డ ప్రేక్షకులకు, అభిమానులకు థాంక్స్`` అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ - ``బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి వందరోజులు కాదు, వెయ్యి రోజులు ఆడుతుందని నమ్మకంగా చెబుతున్నాను. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా దక్షిణాదిన వెయ్యి రోజులు ఆడిన చిత్రంగా నిలిచింది. లెజెండ్ సినిమానే వెయ్యి రోజులు ఆడిందంటే, చరిత్ర ఉన్న చిత్రం, మన పూర్వ వైభవాన్ని చాటి చెప్పిన చిత్రం వెయ్యి రోజులు కాదు, అంత కంటే ఎక్కువ రోజులే ఆడుతుంది. బాలకృష్ణగారు తన 100వ సినిమా కథ కోసం చాలా రోజులు వెయిట్ చేశారు. అలాంటి సందర్భంలో రాష్ట్రం విడిపోవడం జరిగింది. మన రాష్ట్రానికి ఏ రాజధానిని పెట్టాలని అనుకున్నప్పుడు రామోజీరావుగారు రీసెర్చ్ చేసి నూతన రాజధానికి అమరావతి అనే పేరు పెట్టమని నాకు పంపారు. చాలా మంది అమరావతి అనే పేరు వినగానే ఎక్కడా వివాదాలు లేకుండా సహకరించారు. తెలుగువారి చరిత్ర మళ్లీ మన ముందుకు వచ్చింది. మా తెలుగు తల్లి గీతంలో అమరావతి ఉన్నా మనం ఎప్పుడూ ఆలోచించలేదు. స్వాతంత్ర్యం రాక ముందు మనం చెన్నైలో ఉన్నాం. స్వాతంత్ర్యం తర్వాత పొట్లి శ్రీరాములు త్యాగం వల్ల తెలుగు రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మళ్లీ అందరం అమరావతికి వచ్చాం. లండన్‌లోని మ్యూజియంలో అమరావతి గ్యాలరీ ఉంది. నేను అడిగినప్పుడు అమరావతి లాజిస్టిక్ హబ్ ఉన్నదని వారు తెలియజేశారు. అలాంటి అమరావతిని రాజధానిగా చేసుకుని రాజ్య పాలన చేసిన గౌతమిపుత్ర శాతకర్ణిపై సినిమా చేసిన క్రిష్, టీంను అభినందించాలి. చరిత్రలో మొట్టమొదటిసారి తల్లి పేరు పెట్టుకున్న రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. శాతావాహనులు 400 ఏళ్లు, 46 చక్రవర్తులు పరిపాలించారు. అఖండ భారతదేశాన్ని ఏర్పాటు చేసి అమరావతి నుండి పరిపాలన సాగించారు. ఇలాంటి గొప్ప నాయకుడి గురించి సినిమా చేసినందుకు బాలకృష్ణగారిని అభినందిస్తున్నాను. హేమామాలినిగారు బాలకృష్ణగారి తల్లి పాత్రలో నటించడం విశేషం. క్రిష్ చాలా కసితో, పట్టుదలతో ఈ సినిమాతో పవిత్ర కార్యక్రమంలా ఈ సినిమాను చేశారు. ఇక సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, చిరంతన్‌భట్ మ్యూజిక్, సీతారామశాస్త్రి సాహిత్యం, శ్రియ నటన ఇలా అందరూ తమవంతుగా చక్కగా నటించారు. తెలుగు జాతి చరిత్ర గుర్తు పెట్టుకునేలా సినిమా ఉంటుందని భావిస్తున్నాను`` అన్నారు.