ప్రముఖ నటుడు, దర్శకుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవా హీరోగా, హాన్సిక హీరోయిన్‌గా, ప్రముఖ నటి రేవతి ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించిన తమిళ చిత్రం `గులేబకావళి`. కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కోలీవుడ్‌లో సంక్రాంతికి విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఏప్రిల్ 6 తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. బిగ్ సీడీలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విడుదల చేశారు. ఆడియో సీడీలను ఎన్.శంకర్ విడుదల చేయగా తొలి సీడీని జీవిత అందుకున్నారు. ఈ సందర్భంగా...
రసమయి బాలకిషన్ మాట్లాడుతూ - ``టైటిల్‌లోనే సక్సెస్ కనపడుతుంది. గతంలో ఇదే టైటిల్‌తో సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్‌తో వస్తున్న సినిమా కావడంతో తప్పకుండా సక్సెస్‌ను సాధిస్తుంది. ట్రైలర్, పాటలు చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తి కలుగుతుంది. ప్రభుదేవా మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆయనకు కథ చెప్పి కల్యాణ్ సినిమా చేశాడంటే గొప్ప విషయం. ఇక నిర్మాత మల్కాపురం శివకుమార్ పెద్దా, చిన్న సినిమాలంటూ తేడా లేకుండా విడుదల చేయడంలో తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఎదుటివారిలో ఆనందాన్ని చూసి సంతోష పడే వ్యక్తి అయిన మల్కాపురం శివన్నకు ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయాన్ని సాధించి పేరు తెస్తుందని భావిస్తున్నాను`` అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ``సింగం 3` తర్వాత సినిమాలు చేయడం ఆపేద్దామనే అనుకున్నాను. కానీ ఇండస్ట్రీలో సక్సెస్ అయితే తదుపరి సినిమా ఏంటని అడుగుతారు. ప్లాప్ అయితే ఎవరూ కనిపించరు. కానీ పది మందికి ఆదరణ చూపే ఇండస్ట్రీ ఇది. ఎంతో మంది ఈ పరిశ్రమపై ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. చెన్నైలో తమిళం రాకున్నా కూడా సినిమా చూసి కామన్ ఆడియెన్‌గా ఎంజాయ్ చేశాను. తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందనిపించి.. తెలుగులో మా బ్యానర్‌పై విడుదల చేస్తున్నాను. సినిమాను ఏప్రిల్ 6న విడుదల చేస్తున్నాం`` అన్నారు.
చిత్ర దర్శకుడు కల్యాణ్ మాట్లాడుతూ - ``దర్శకుడిగా నా తొలి చిత్రమిది. తమిళ ప్రేక్షకులకే కాదు.. తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే చిత్రమవుతుందనే నమ్మకం ఉంది. అన్ని ఎలిమెంట్స్ ఉండే సినిమా ఇది`` అన్నారు.
ఎన్.శంకర్ మాట్లాడుతూ ``మిస్టరీ, కామెడీ, సస్పెన్స్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. ఇలాంటి జోనర్ సినిమాలు చాలా వరకు పెద్ద విజయాలనే సొంతం చేసుకున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్‌ను సాధిస్తుందనే నమ్మకం ఉంది`` అన్నారు.
జీవిత మాట్లాడుతూ - ``గరుడవేగ సినిమా రిలీజ్ డేట్ విషయంలో టెన్షన్‌గా ఉన్నప్పుడు మల్కాపురం శివకుమార్‌గారు సపోర్ట్ చేశారు. దాని వల్లనే సినిమాను విడుదల చేయగలిగాం. ఆయన తెలంగాణలో పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నాను. మల్కాపురం శివకుమార్‌గారు మంచి మనసున్న వ్యక్తి. ఆయనకు ఈసినిమా పెద్ద హిట్ సాధించి మంచి పేరు సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు. ప్రభుదేవా, హాన్సిక, రేవతి, మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్: పీటర్ హెయిన్స్, సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్, ఆర్ట్: కదీర్, పాటలు: సామ్రాట్, దర్వకత్వం: కల్యాణ్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.