పూజా కె. దోషి, హరీశ్ కల్యాణ్, సాయి రోణక్, సుదర్శన్, మోహన్ రామన్, డా. మంజేరి షర్మిల, గురురాజ్ మానేపల్లి తదితరులు నటించిన సినిమా `కాదలి`. పట్టాభి.ఆర్.చిలుకూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాలోని పాటలను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. రామ్‌చరణ్ ఆడియో బిగ్ సీడీలను విడుదల చేశారు. కేటీఆర్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. సురేశ్‌బాబు అందుకున్నారు.
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ``కొత్తవాళ్లతో సినిమా అనగానే నటీనటులు ఎలా ఉంటారోననే భావన ఉంటుంది. కానీ ఈ సినిమాలో నటులు బావున్నారు. పట్టాభికి ఉన్న అనుభవంతో అందరి దగ్గర నుంచి మంచి ఔట్పుట్ తీసుకుని ఉంటాడని భావిస్తున్నాను`` అని చెప్పారు.
దశరథ్ మాట్లాడుతూ ``పట్టాభికి మంచి అవగాహన ఉంది సినిమా పరిశ్రమ మీద. తను పరిశ్రమలోకి వచ్చిన కొత్తల్లో చాలా కలివిడిగా ఉండేవాడు. ఈ సినిమా సంగీతం బావుంది. ట్రైలర్స్ చూస్తుంటే ప్రేమదేశం సినిమా లాగా ఉంది`` అని చెప్పారు.
సంగీత దర్శకులు ప్రసన్ ప్రవీణ్ శ్యామ్ మాట్లాడుతూ ``ఇది మా రెండో సినిమా. మా తొలి చిత్రం మలుపు. పట్టాభిగారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది`` అని అన్నారు.
సురేశ్‌బాబు మాట్లాడుతూ ``పట్టాభి ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. తన అభిప్రాయాలను కచ్చితంగా చెబుతాడు. ఈ సినిమా చాలా మంచి హిట్ కావాలి. మేం ఏం అడిగినా కేటీఆర్‌గారు చేస్తారు. జీఎస్టీ ప్రాబ్లమ్ ఉందని గత సారి చెప్పినప్పుడు వెంటనే అరుణ్ జైట్లీ దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు సినిమాకి జీఎస్టీని 28 శాతానికి పెంచారు. దీని వల్ల ప్రాంతీయ భాషా చిత్రాలకు పలు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయంలో పెద్ద, చిన్న చిత్రాలకు ఒకే రకమైన శాతం కాకుండా, ప్రాంతీయ చిత్రాలకు మరోలా ఉంటే బావుంటుంది. తెలుగు పరిశ్రమకు ఎప్పటినుంచో మద్దతిస్తున్న కేటీఆర్‌గారు ఈ విషయంలోనూ సహకరించాలి.`` అని తెలిపారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ``తెలుగు సినిమాకి తమిళ్ టైటిల్ పెట్టినప్పుడే అందులో ఏదో ఉందని అనిపిస్తుంది. హ్యాపీడేస్, పెళ్లి చూపులులాగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలి`` అని చెప్పారు.
వనమాలి మాట్లాడుతూ ``సంగీత దర్శకులు మంచి సంగీతాన్నిచ్చారు. ఆనంద్‌గారు ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది`` అని తెలిపారు.
కేటీఆర్ మాట్లాడుతూ ``పట్టాభి ఆర్. చిలుకూరి నా బాల్య మిత్రుడు. తన కల ఈ చిత్రం. పొలిటికల్ లీడర్స్ వస్తే ఈ సినిమా అంతగా జనాలకు ఎక్కదనే ఉద్దేశంతో మేం చరణ్‌ని పిలిచాం. పిలవగానే వచ్చారు చరణ్. సినిమా చాలా బాగా వచ్చింది. అంతా కొత్తవారితో చేస్తున్న ఈ సినిమా చాలా రెఫ్రెషింగ్‌గా ఉంది. ట్రైలర్ చాలా బావుంది. కొన్ని సినిమాలు ఇటీవల బాగా ఆడుతున్నాయి. పెళ్లిచూపులు లాంటివి బెంచ్ మార్క్ గా నిలుస్తున్నాయి. కంటెంట్ కింగ్‌లాగా ఉంది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని భావిస్తున్నాం. పట్టాభి పాతికేళ్ల క్రితమే సినిమా గురించి మాట్లాడేవాడు... సినిమాల్లో ఉండాలని అనుకున్నాడు. ఐటీ ఇండస్ట్రీ హైలో ఉన్నప్పుడు పట్టాభి ఆ రంగాన్ని వదులుకుని ఈ రంగంలోకి వచ్చారు. వెంకటేశ్‌గారికి పట్టాభి చాలా పెద్ద ఫ్యాన్. పట్టాభి సురేశ్ ఆఫీసుకి ఒక ఉత్తరం రాస్తే పిలిచి అవకాశమిచ్చారు. సురేశ్‌గారు డిసర్వ్ అప్లాజ్.. దిల్‌రాజుగారు, సురేశ్‌గారు ఎప్పుడు కలిసినా పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలని మాట్లాడుతుంటారు. బాహుబలి2 తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. కేలిఫోర్నియాలో లోకల్ గేమింగ్ కంపెనీ వాళ్లు ఆ సినిమా గురించి మాట్లాడటం గ్రేట్. ఒక దేశానికి ఒక ట్యాక్స్ అనేది మంచిదే. కానీ సంస్కృతి, స్వరూపాలు అనేవి కాపాడుకోవాలంటే 28 శాతం పెడితే కుదరదని చాలా మంది అంటున్నారు. ఈ మధ్య కమల్‌హాసన్‌గారు కూడా దీని గురించి చెప్పడం విన్నాను. దక్షిణాది పరిశ్రమలన్నీ కలిసి అరుణ్‌జైట్లీగారిని కలుద్దాం`` అని తెలిపారు.
రామ్‌ఛరణ్ మాట్లాడుతూ ``దాసరిగారు చనిపోయిన తర్వాత జరుగుతున్న పెద్ద ఫంక్షన్ ఇది కాబట్టి అందరం ఒక నిమిషం మౌనం పాటిద్దాం. మిస్ యూ దాసరిగారు. ఈ సినిమా విషయానికి వస్తే నన్ను ఈ కార్యక్రమానికి పిలిచిన కేటీఆర్‌గారికి ధన్యవాదాలు. సురేశ్‌గారు జీఎస్టీ గురించి చెప్పగానే స్పందించినందుకు కేటీఆర్‌గారికి ధన్యవాదాలు. నా కెరీర్లో మోస్ట్ ఫేవరేట్ చిత్రం నా కెరీర్లో ఆరంజ్. అలాంటి సినిమాను మరలా మరలా చేయాలని అనుకుంటాను. అలాంటి కళ, కలర్స్ ఉన్న ఈ సినిమా ఎక్కువ ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ప్యాషన్‌ని నమ్మి చేస్తున్న పట్టాభికి కంగ్రాట్స్. నా తొలి సినిమాలో కూడా నేను ఇంత బాగా చేయలేదేమో. వాళ్లు అంత బాగా చేశారు.`` అని చెప్పారు.