01 May 2018
Hyderabad
స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మహానటి'. అలనాటి మహానటి సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ఈ చిత్రంలో కీర్తిసురేశ్ టైటిల్ పాత్రలో నటించారు. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత తదితరులు కీలకపాత్రధారులు. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఆడియో సీడీలను విడుదల చేసి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, కుమారుడు సతీశ్‌లకు అందించారు. ఈ సందర్భంగా...
కింగ్ నాగార్జున మాట్లాడుతూ - ''నందమూరి తారక రామారావుగారు, నాన్నగారు, సావిత్రిగారి పేర్లు తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పేర్లు. వాళ్లు లేకుండా మాయా బజార్ సహా నాకు ఇష్టమైన సినిమాలు మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి ఇలా ఎన్నెన్నో సినిమాలు లేవు. 'వెలుగు నీడలు' సినిమాలో సావిత్రిగారు నన్ను ఎత్తుకుని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఒక మనిషిపై బయోపిక్ తీయాలంటే ఒక అర్హత కూడా ఉండాలి. అది సావిత్రిగారికి దక్కింది.. తెలుగు సినిమాకు చెందిన తొలి బయోపిక్ ఇదేనని అనుకుంటున్నాను. ఒక స్త్రీని ఎంతో ఎత్తున నిలబెట్టి ఓ బయోపిక్ తీస్తున్నందుకు తెలుగు ఇండస్ట్రీ తరపున గర్వంగా ఉంది. తీసిన వాళ్లుకూడా ఇద్దరు ఆడపిల్లలే. ఈ సినిమాలో ఇరవై మంది పిల్లలు పనిచేశారని, ఈ ఆడియో వేడుక సెట్ కూడా వేసింది ఆడపిల్లలేనని నాకు తెలిసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్త్రీకి ఇచ్చిన గౌరవం అలాంటిది. ఈ సినిమాలో నటించినవారికి, నిర్మించిన వారికి, డైరెక్టర్‌కి సావిత్రిగారంటే ఎవరో తెలియదు. కీర్తిసురేశ్ మహానటి సావిత్రిగారి పాత్రలో నటించే అవకాశాన్ని, అదృష్టాన్ని దక్కించుకుంది. నేను ఈ సినిమాలో నటించలేకపోయినందుకు ఈర్ష్య పడుతున్నాను. కానీ నా అబ్బాయి నాగచైతన్య, కోడలు సమంత ఈ సినిమాలో నటించారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే చాలా గుడ్ ఫీలింగ్ వచ్చింది. నాకు అలాంటి ఫీలింగ్ ఇచ్చిన సినిమా ఏదీ తప్పు కాలేదు. దత్తుగారు ఎన్నో హిట్ చిత్రాలు చేశారు. అయితే ఈ సినిమా ఆయనకు డబ్బు పేరుతో పాటు గౌరవాన్ని కూడా తెచ్చిపెడుతుంది. టీంకు ఆల్ ది బెస్ట్'' అన్నారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ''నా కెరీర్ ఎన్టీఆర్‌గారు, సావిత్రిగారు నటించిన పాండవ వనవాసం సినిమాతో ప్రారంభమైంది. ఆవిడ జీవితం గురించి తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. మే 9న అలాంటి గొప్ప వ్యక్తి జీవితం గురించి తెలుసుకునే అవకాశం కలగబోతుంది. వైజయంతీ మూవీస్‌లో 14 సినిమాలు డైరెక్ట్ చేసిన ఏకైక దర్శకుడిని నేనే. నాగాశ్విన్ నేను చేసిన సినిమాలను దాటి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ - ''సావిత్రిగారి గొప్పతనం గురించి మాట్లాడే అర్హత జన్మలు ఎత్తినా రాదేమో. ట్రు లేడీ సూపర్‌స్టార్ మహానటి సావిత్రిగారు. చాలా అరుదుగా ట్రాక్ తప్పుతుంటాం. ఏం మాట్లాడాలో తెలియక మాటలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ఆవిడ గురించి మాట్లాడే అర్హత మాకెవ్వరికీ లేదు. ఎక్కడ మొదలు పెట్టాలో.. ఎక్కడ ఆపాలో తెలియడం లేదు. ఆమె ఎలా పోయారో అనడం కంటే.. ఆవిడ ఎలా బ్రతికారు అని కళ్లకు కట్టినట్లు చూపించే చిత్రమిది. కొంత మంది జీవితం, సాధించిన విజయాలను ఆదర్శంగా పొందడం చాలా అవసరం. అలాంటి ఒక అద్భుతమైన జీవితాన్ని కళ్లకు కట్టినట్టుగా మన ముందుకు తీసుకు రాబోతున్నాడు నాగాశ్విన్. నాగికి ఎంత ఎక్స్‌పీరియెన్స్ ఉందనడం కంటే.. సావిత్రిగారంటే ఎంత ఇష్టమో తెలుసు. ఒక దర్శకుడిగా కాదు.. ఓ అభిమానిగా ఈసినిమాను తను తెరకెక్కించాడు. తనకు అండగా స్వీటీ, స్వప్న నిలబడ్డారు. తను కన్న కలను నిజం చేయడానికి స్వీటీ, స్వప్న, దత్తుగారు తప్ప ఎవరూ అర్థం చేసుకోలేరు. మనమేదైనా గొప్ప పని చేసేటప్పుడు అన్ని మనకు అలా కుదురుతుంటుంది. దాన్ని కొందరు దేవుడని అంటారు. నేను ప్రకతి అని అంటాను. ప్రకృతి అంటే దేవుడనే అర్థం. అలాగే ఆ మహానటి పాత్ర వేయడానికి కీర్తిసురేశ్‌ను ప్రకృతి చూపించింది. అదే ప్రకృతి దుల్కర్, విజయ్ దేవరకొండ, సమంత స హా ప్రతి ఒక్కరినీ ముందుకు తీసుకొచ్చింది. పెద్దవాళ్లు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయినా.. వాళ్ల ఆత్మ మన చుట్టూ తిరుగుతుంటుంది. అలా సావిత్రిగారు పట్టుబట్టి నా జీవితాన్ని సినిమాగా తీయమని ప్రేరేపించి ఉంటారు. స్వప్న ఈ సినిమాలో తాతగారి వేషం చిన్న అతిథి పాత్రలో నేను వేస్తే బావుంటుందని ఫీలైంది. నా దగ్గరకు వచ్చింది. కానీ తాతగారు పాత్ర వేషం వేసే అర్హత నాకు లేదు. ఆయన పాత్ర పోషించే అవకాశం ఈ జన్మలో జరగని పని. నాకు రామారావుగారి పాత్ర పోషించే దమ్ము లేదు. కానీ హ్యాట్సాఫ్ టు కీర్తిసురేశ్, దుల్కర్, విజయ్ దేవరకొండ, సమంత. వీరు ఛాలెంజ్‌గా తీసుకుని వాళ్ల పడ్డ కష్టం నాకు తెలుసు. మనకు తెలిసిన ఓ వ్యక్తి పాత్రలో నటిస్తే కుదరదు. జీవించాల్సి ఉంటుంది. ఈ నలుగురు అద్భుతంగా నటించారు. రేపు సినిమా విడుదలైతే అందరూ ఆ విషయాన్ని అంగీకరిస్తారు. మిక్కి బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు. ఈ మధ్య ఆడవాళ్ల మీద ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. ఈ సినిమా చూస్తే మనం ఎందుకు మగాళ్లుగా పుట్టామా? అనిపిస్తుంది. ఈ సినిమాలో ఆడవారి బలం ఏంటో తెలుస్తుంది. ఆడవారు తలుచుకుంటే ఏమీ సాధిస్తారో.. ఈ సినిమా చూసి తెలుసుకుని, ఆడవాళ్లను గౌరవిస్తారని అనుకుంటున్నాను'' అన్నారు.
దర్శకుడు నాగాశ్విన్ మాట్లాడుతూ - ''మనం ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నామంటే సావిత్రిగారే కారణం. స్వప్న, ప్రియాంకకు ఈ కథ చెప్పిన తర్వాత.. సినిమాలో చాలా డెప్త్, బాధ్యత ఉందని భావించాం. అర్హత పెంచుకోవడానికి ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. రెండు సంవత్సరాలు రీసెర్చ్ చేసి నా డైరెక్షన్ టీమ్ ఎంతగానో సపోర్ట్ అందించారు. సావిత్రిగారిపై ఉన్న ప్రేమతోనే కీర్తిసురేశ్, సమంత, దుల్కర్, విజయ్ సహా అందరూ నటించారు. సినిమా బాగా వచ్చింది. నా టీం ఎంతో బాగా సపోర్ట్ చేసింది. అందరికీ థాంక్స్'' అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ''నాగాశ్విన్ తొలి సినిమాను హిమాలయాల్లో తీస్తే.. మహానటి చిత్రాన్ని 1980 బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించారు. ఇలాంటి చిత్రంలో ఓ చిన్న పాత్ర చేయడం గౌరవంగా భావిస్తున్నాను'' అన్నారు.
సమంత అక్కినేని మాట్లాడుతూ - ''సావిత్రిగారిపై చేసిన మహానటిలో నేను చిన్న భాగమైనందకు గర్వంగా ఉంది. ఈ సినిమాకు ఓ రిస్క్ తీసుకున్నాను. నేను మెయిన్ క్యారెక్టర్ కాకపోయినా.. ఈ కథ నేను చెప్పడంతోనే ప్రారంభమవుతుంది. సావిత్రిగారి సినిమాలో ఓ సీన్ చేయడానికి వెంటనే అంగీకరించాను. నాకు అవకాశం ఇచ్చిన నాగాశ్విన్‌కి థాంక్స్. స్వప్న, ప్రియాంకగారికి థాంక్స్'' అన్నారు.
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ - ''ఎవడే సుబ్రమణ్యంతో నాగాశ్విన్ జర్నీ స్టార్ట్ అయ్యింది. అదే టీంతో పాటు ఇప్పుడు కీర్తిసురేశ్, సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కలిశారు. నేను ఈ సినిమాలో నటించలేకపోయినందుకు ఈర్ష్యగా ఉంది. నాగాశ్విన్‌లో ఓ నిజాయతీ ఉంటుంది. తనలో ఉన్న సిన్సియారిటీ ఈ సినిమాలో కూడా కనపడింది. మే 9 కోసం వెయిట్ చేస్తున్నాను, ఆరోజున మహానటి సావిత్రిగారిని అందరం చూడబోతున్నాం'' అన్నారు.
కీర్తిసురేశ్ మాట్లాడుతూ - ''ఈ సినిమా నేను చేస్తే బావుంటుందని ఓ రోజు నాని చెబితే విన్నాను. తర్వాత సినిమాలో భాగమయ్యాను. నాగాశ్విన్, స్వప్న నా దగ్గరకు వచ్చి మహానటి సినిమా చేస్తున్నాం. టైటిల్ పాత్ర నువ్వు చేయాలి అనగానే ముందు నేను నో చెప్పేశాను. ఎందుకంటే ఆమె పాత్రను నేనెలా చేయగలను, చాలెంజింగ్ రోల్ అని ఆలోచించాను. కానీ నాగాశ్విన్ నాకు చాలా ధైర్యం ఇచ్చాడు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాగికి థాంక్స్. కెమెరామెన్ డానీ.. స్పెయిన్‌కు చెందిన వ్యక్తి అయిన సావిత్రి గారి గురించి తెలుసుకుని అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. అలాగే తోట తరణి, శివమ్ సహా అందరూ ఎంతో ఎఫర్ట్ పెట్టారు. మిక్కి గ్రేట్ మ్యూజిక్ అందించారు. సమంత ఈ సినిమాలో స్టోరీని డ్రైవ్ చేసే పాత్రలో నటించారు. దుల్కర్ చిన్నప్పట్నుంచి తెలుసు. తనతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. విజయ్‌దేవరకొండతో కలసి నటించలేదు. కానీ తను ఎంతో అద్భుతమైన నటుడు. అలాగే రాజేంద్రప్రసాద్, క్రిష్, భానుప్రియగారు సహా ఎంతో మంది స్టార్స్ నటించారు. నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి నటించిన సినిమా ఇది. సావిత్రిగారు ఇచ్చిన బ్యూటీఫుల్ జర్నీగా ఈ సినిమాను భావిస్తున్నాను'' అన్నారు.
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ - ''తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు. అలాంటి ఇండస్ట్రీలో 'మహానట'ి సినిమాలో నటించడం గొప్ప విషయంగా భావిస్తున్నాను. విజయ్ దేవరకొండ, సమంత, చైతన్య, కీర్తిసురేశ్‌లతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో నాకు ఇక్కడ చాలా మంది స్నేహితులు ఏర్పడ్డారు'' అన్నారు.
స్వప్న దత్ మాట్లాడుతూ - ''ఈ సినిమా మేం మొదలుపెట్టినప్పుడు చాలా మంది చాలా క్వశ్చిన్స్ అడిగారు. మీరెందుకు సావిత్రిగారి సినిమా చేస్తున్నారు? మీకు వర్కవుట్ అవుతుందా? వంటి చాలా ప్రశ్నలు వేశారు. నాగాశ్విన్‌తో రెండు సినిమాలు క్రాంటాక్ట్ చేయించుకున్నాను. 'ఎవడే సుబ్రమణ్యం' తర్వాత నెక్స్‌ట్ ఏ సినిమా చేయబోతున్నావ్? అని తనను అడిగితే తను సావిత్రిగారి బయోపిక్ చేయాలనుకుంటున్నానని అనగానే.. ఆరోజే ఈ సినిమా తీయాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకు కారణం తనపై మాకున్న అతి నమ్మకం. అంతే తప్ప వర్కవుట్ అవుతుందా? లేదా? అని ఆలోచించలేదు. నాగిపై, సావిత్రిగారిపై ఉన్న నమ్మకమే ఈ సినిమా. వైజయంతీ మూవీస్‌ను నెక్స్‌ట్ స్టెప్‌ను తీసుకెళ్లాం. ఈ బ్యానర్‌కి ఓ గౌరవం తేవాలనుకున్నాం. అందులో భాగంగానే మహానటి సినిమా చేశాను. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే మా టీమే కారణం. ప్రతి ఒక్కరూ ఎంతగానో కష్టపడ్డారు. ఈ సినిమాను నమ్మి మరో హీరోయిన్ సినిమాను డ్రైవ్ చేయడానికి ఒప్పుకున్న నటి సమంత. అంత పెద్దస్టార్ హీరోయిన్ అయిన సమంత అలా చేయడం ఆమె విజన్, గట్స్‌ను తెలియజేస్తున్నాయి. మలయాళంలో సూపర్‌స్టార్ అయిన దుల్కర్ ఓ క్యారెక్టర్‌ను చేస్తున్నానని భావించి జెమినిగణేషన్‌గారి పాత్రలో నటించారు. అలాగే విజయ్ దేవరకొండ కూడా తనదైన సపోర్ట్ అందించారు. నాగాశ్విన్ ఈ సినిమా కోసం మూడేళ్లుగా సరిగ్గా తినలేదు, నిద్రపోలేదు కూడా. అంతలా కష్టపడ్డాడు. అలాగే విజయ చాముండి గారు, సతీశ్‌గారు మాపై నమ్మకంతో ఈ సినిమా చేయమని ప్రోత్సాహం, ధైర్యం అందించారు'' అన్నారు.
సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ - ``ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. అమ్మ పుట్టినప్పటి నుండి ఏమేం చేసిందనేది చూసేలా నాగాశ్విన్ సినిమా చేశారు. నేను పుట్టిన సీన్‌ను కూడా నేను చూశాను. ఇంత కంటే ఏం కావాలి. సినిమా గురించి ఇంత కంటే ఏం చెప్పలేను. అమ్మనాన్న కథ ఏంటో అందరితో పాటు చూడాలని ఎదురుచూస్తున్నాను. అప్పటి తరం నుండి ఇప్పటి తరం వరకు అమ్మగారి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు. ఇంత కంటే గొప్ప ఇంకేం కావాలి`` అన్నారు.
సావిత్రి తనయుడు సతీశ్ మాట్లాడుతూ - ``అమ్మగారు ఈరోజు మన మధ్యలోనే ఉన్నారు. ఆమె ఆత్మ ఇప్పటి తరం నటుల్లో ఉంది. మహానటి బయోపిక్ చేస్తున్నారని తెలియగానే నేను ఇదేదో ట్రాజెడీ స్టోరీలా ఉంటుందని భయపడ్డాను. నాగాశ్విన్‌గారు కథ చెప్పినప్పుడు కథను ఈ కోణంలో కూడా ఆలోచించవచ్చా? అనిపించింది. సినిమాను నాగాశ్విన్‌గారు డిఫరెంట్‌గా తెరకెక్కించారు. తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
సాయిమాథవ్ బుర్రా మాట్లాడుతూ -`` నా జీవితంలో ఇది చాలా స్పెషల్ మూవీ. ఎందుకంటే ఇందులో ఎస్.వి.రంగారావు, ఎల్.వి.ప్రసాద్‌గారు, కె.వి.రెడ్డిగారు ఇలా ఇండస్ట్రీలో లెజెండ్స్ అని చెప్పుకునేవారందరికీ డైలాగ్స్ రాశాను. నా తరంలో ఇంత గొప్ప అవకాశం మరే రచయితకు దొరకలేదని అనుకుంటున్నాను. ఎన్నో భావోద్వేగాలు సినిమాలో కనిపిస్తాయి. కీర్తి సురేశ్‌గారిని చూస్తే అచ్చం సావిత్రిగారే గుర్తుకొచ్చారు. ఆమె కాళ్లకు దణ్ణం పెట్టాలనిపించింది. అలాగే సమంతగారి క్యారెక్టర్ అంతా ఒకవైపు ఉంటే.. సినిమా అంతా మరోవైపు ఉండేలా అద్భుతంగా నటించారు. విజయ్ దేవరకొండ తన నటనతో మనల్ని సినిమా అంతా తనతో ట్రావెల్ చేయించుకుంటారు. సినిమా గురించి రీసెర్చ్ చేసిన తర్వాత ఆయనతో లవ్‌లో పడిపోయాను. సినిమాను చూసే ప్రేక్షకుడు సినిమా మూడ్‌లోకి వెళ్లి సినిమా చూస్తారు`` అన్నారు.