అల్లు అర్జున్, అను ఇమ్యాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై వక్కంతం వంశీ దర్శకత్వంలో శిరీషా శ్రీధర్ లగడపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 4న సినిమా విడదలవుతుంది. ఆదివారం మిలటరీ మాధవరం జెడ్.పి.హైస్కూల్‌లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బిగ్ సీడీని కె.నాగబాబు విడుదల చేశారు. ఆడియో సీడీలను అల్లు అర్జున్ ఆవిష్కరించారు. అలాగే ూధవరంలో ఓ స్టేజ్ నిర్మించాలనే ఉద్దేశంతో మాధవరం ప్రెసిడెంట్ కవులూరి పరిమళకి 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' యూనిట్ కొంత మొత్తంలో నగదుని బహుకరించారు. ఈ కార్యక్రమంలో...
అల్లు అర్జున్ మాట్లాడుతూ - ''సాధారణంగా ఏ సినిమాకైనా ఓ పబ్లిసిటీ చేయాలనుకుంటాం. అది మా ధర్మం అని ఆలోచించినప్పుడు .. మిలటరీకి సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌లో ఏదైనా చేయాలని నేను, మా డైరెక్టర్‌గారు అనుకున్నాం. ఈ ప్రాసెస్‌లో ఏం చేయాలో ముందు తెలియలేదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే.. మా వెస్ట్ గోదావరి.. మా ఆంధ్రప్రదేశ్‌లోనే.. మా ఊరి దగ్గరే మాధవరం అనే ఊరు ఉంది... అది ఎంత ఫేమస్ అంటే దాన్ని మిలటరీ మాధవరం అని పిలుస్తారని తెలియలేదు. తెలుసుకున్న వెంటనే మా సినిమా ఫస్ట్ ఫంక్షన్‌ను ఇక్కడే చేయాలని అనుకున్నాం. ఈ ఊరిలో ప్రతి గడప నుండి రెండు ప్రపంచ యుద్ధాల నుండి ఒకరు వెళ్లి దేశం కోసం పనిచేశారని తెలిసింది. ఇలాంటి ఊర్లో ఫంక్షన్ చేసుకోవడం గర్వకారణంగా ఉంది. నన్ను నమ్మి ఏ రోజూ ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్న నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీషాగారికి ధన్యవాదాలు. నాగబాబుగారికి ఎప్పటి నుండో సినిమా చేయాలనుకుంటున్నాను. ఆయనెలా ఫీల్ అవుతున్నారో కానీ.. నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకెంతో ఇష్టమైన వ్యక్తికి సినిమా చేయడమనేది నా అదృష్టం. అలాగే బన్నీవాస్ నా టార్చర్‌నంత భరించాడు. విశాల్ శేఖర్ సహా సినిమా కోసం పనిచేసిన అందరికీ థాంక్స్. ఈ సినిమాలో హీరోకి ఏకైక గోల్ ఇండియా ఆర్మీలో ఉండి దేశానికి సేవ చేయాలని.. ఆ ఒక వ్యక్తి సమాజానికి అంకితం అయ్యి బ్రతుకుతాడనుకుంటాడు అనే పాయింటే నాకు బాగా నచ్చింది. మాకు షూటింగ్ టైమ్‌లో ఇండియన్ ఆర్మీవాళ్లు ఎంతగానో సపోర్ట్ చేశారు. వారికి నా స్పెషల్ థాంక్స్. మేమంతా మెగా కుటుంబంలోనే హీరోలమే. అందరం ఒకటే. ఏదైనా విషయం గురించి మాట్లాడాలంటే నాకు అనిపించాలి. ఇప్పుడు అనిపించి మాట్లాడుతున్నాను. అదేంటంటే.. 'నెంబర్ వన్ హీరో.. ఎన్నో కోట్లు రూపాయలు వస్తుంది. ఏసీ లైఫ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అలాంటి డబ్బు, సుఖం ఏదీ వద్దు అనుకుని ఎండల్లో జనం కోసం ఏదో చేద్దామని.. కెరీర్ నెంబర్ వన్ పోజిషన్‌లో ఉండగా.. వదులుకుని పవన్‌కల్యాణ్‌గారు వచ్చారు. అలాంటి వ్యక్తిపై చాలా రకాలుగా విమర్శలు చేస్తారు. చాలా ఏళ్ల క్రితం చిరంజీవిగారు వచ్చినప్పుడు చాలా రకాలుగా అన్నారు. విని విని ఈ చెవి అలవాటు పడిపోయింది. మనసు గట్టిపడిపోయింది. అలాగే ఈరోజు పవన్‌కల్యాణ్‌గారిని .. ఎవడెవడో చానెల్ ఉంది కదా అని ఏదేదో అంటుంటారు. మాట్లాడితే మాట్లాడారు. కానీ మొన్న మాట్లాడలేదు. నాకు నచ్చలేదు. చాలా చాలా చాలా తప్పు. మాట్లాడినవాళ్ల తప్పు.. మాట్లాడించినోళ్ల తప్పు.. ఇలా మాట్లాడారని లక్షల మంది జనాలకు చూపిన వాళ్లది ఇంకా పెద్ద తప్పు. నాకు ఇష్టమైన నా తమ్ముడు..మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌కి రంగస్థలం విజయంపై కంగ్రాట్స్'' అన్నారు.
కె.నాగబాబు మాట్లాడుతూ - ''మిలటరీ మాధవరంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఆడియో విడుదల ఫంక్షన్ చేయడానికి కారణం. ఇక్కడ ఒక్కొక్క ఇంటి నుండి ఒక్కొక్క సైనికుడు మన దేశం కోసం పోరాడుతున్నారనే. ఈ సినిమాలో కూడా బన్ని ఆర్మీ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక్కడున్న సైనిక కుటుంబాల ఆశీర్వాదం కోసం బన్ని ఇక్కడకు వచ్చాడు. తనను అందరూ ఆశీర్వదించాడు. బన్ని గురించి చెప్పాల్సిందే చాలా ఉంది. తను ప్యూర్ సోల్. కల్లా కపటం, కల్మషం తెలియని వ్యక్తి. చాలా మంచి మనసు. మెగాస్టార్ చిరంజీవిగారు మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. నేను, నా తమ్ముడు పవన్‌కల్యాణ్, బన్ని, చరణ్‌గానీ, తేజు, వరుణ్, నిహారికగానీ సహా అందరికీ లైఫ్ వ్యక్తి అన్నయ్య చిరంజీవి. ఆయనకు ఏం చెప్పినా తక్కువే. ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను. 'థాంక్యూ అన్నయ్య.. మా అందరికీ గొప్ప జీవితాన్నిచ్చావు'. అని చెప్పడం కృతజ్ఞత చెప్పుకోలేను. తర్వాత నా తమ్ముడు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పోజిషన్‌లో ఉండి.. కోట్ల రూపాయల సంపాదనను కూడా తృణప్రాయంగా వదిలేసి నిస్వార్ధంగా ముందుకెళుతున్నాడు. తనపై నీచమైన కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు చేస్తున్నారు. కల్యాణ్ బాబు లాంటోడు అన్ని అడ్డంకులను తొలగించుకుని మీ ముందుకు వచ్చినట్లు రాజకీయాల్లోకి రాకూడదు. వస్తే వీళ్ల వేషాలు సాగవు. మీ అందరి భవిష్యత్ కోసం తన భవిష్యత్‌ను వదులుకుని ప్రజల ముందుకు వసున్నాడు. ఎవరైతే తను రాకూడదని కోరుకుంటున్న పార్టీలు, వ్యక్తులున్నారో.. తొక్కేసి, ఏమీ చేయలేక.. కుటుంబంలో వ్యక్తులను కూడా దుర్భాషలాడుతూ నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఒక్కడే అనుకోకండి.. తన వెనకాల చాలా మంది ఉన్నారు. డబ్బులు సంపాదించుకోవడానికి అభిమానులు రూపంలో ఎంతో ఇచ్చాడు. అడ్డుగోలుగా సంపాదించుకోవాల్సిన పని లేదు. ప్రజలకు సేవ చేయడానికి ఒకసారి వీలుకాలేదు. ఈసారి కుదురుతుంది. ఒక్కొక్కడికీ ఉంటుంది'' అన్నారు.
వక్కంతం వంశీ మాట్లాడుతూ - ''బయటేదో సమస్య ఉంటే ఇంట్లో నుండి పిల్లలను బయటకు పంపించం. అలాంటిది ఈ ఊరు.. ఈ దేశం కోసం ప్రతి ఇంటి నుండి ఒకరిని పంపింది. వాళ్ల పేర్లు తెలియదు కానీ.. వాళ్ల ఇల్లు మాత్రం ఇండియా. ఐదు మంది ఉన్న ఇంటిని ఓ యజమాని ఎలా కాపలా కాస్తాడో తెలియదు కానీ.. నూట పాతిక కోట్ల మంది ఉన్న ఇంటికి కాపలా కాస్తున్నారు సైనికులు. వాళ్లే నిజమైన యజమానులు. అలాంటి వాళ్లున్న గడ్డపై నేను కూడా పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఏమీ ఆలోచించకుండా ఓ కథను రాసుకున్నాం. ఈ సినిమా జర్నీలో చాలా మంది సైనికులను, వారి కుటుంబాలను కలిశాం. చాలా విషయాలు తెలుసుకున్నాం. చాలా ఎమోషనల్‌గా ఉంది. అందరినీ సినిమా అలరిస్తుందని నమ్ముతున్నాం. చాలా సినిమాలకు రైటర్‌గా పనిచేశాను. దర్శకుడిగా మొదటి సినిమా. మూడున్నరేళ్ల కల. నాపై నమ్మకంతో ఎటువంటి సమస్యలు రాకుండా సినిమా పూర్తి కావడానికి కారణమైన నిర్మాత లగడపాటిగారికి, సమర్పకులు నాగబాబుగారికి..కో ప్రొడ్యూసర్ బన్నీవాసుగారికి థాంక్స్. విశాల్ శేఖర్ ఏదో తెలుగు సినిమా అని కాకుండా.. నేషనల్ మూవీలా భావించి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. బన్ని గురించి ఏం చెప్పినా తక్కువే. 130రోజలు తనతో ప్రయాణం చేశాను. నా మూడున్నరేళ్ల కలను తీర్చిన మగాడు. నాలో రచయితను మాత్రమే కాదు.. దర్శకుడిని కూడా నమ్మాడు. ఆయన బిజినెస్ స్ట్రాటజీకి భిన్నంగా.. ఏమీ ఆలోచించకుండా.. కథ విన్నారు.. సినిమా చేశారు. తను ఓ ఎక్స్‌పీరియెన్స్‌డ్ డైరెక్టర్‌తో ఎలా ఉంటాడో.. ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేసిన నాతో కూడా అలాగే ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సూర్య పాత్ర పదేళ్లు మీ గుండెల్లో నిలిచిపోతాడు. మిమ్మల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు.. మీకు కోపం తెప్పిస్తాడు. లైఫ్‌లాంగ్ మీ గుండెల్లో నిలిచిపోతాడు. మంచి జ్ఞాపకాలతో థియేటర్ నుండి ప్రేక్షకులు బయటకు వెళతారు. గొప్ప సినిమా చూశామని అందరరూ తలలు ఎగరేసుకుని ప్రేక్షకులు బయటకు వెళతారు'' అన్నారు.
నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ - ''రాయలసీమ నీళ్ళు తాగితేనే పౌరుషం వస్తుందని అంటారు. కానీ ఇక్కడ గాలి పీల్చుకుంటేనే పౌరుషం వస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా బాక్సాఫీస్ బద్ధలే. యావత్ ప్రపంచానికి మిలటరీ మాధవరం దేశభక్తి గురించి చాటుతుంది. బన్ని అభిమానులు కోరుకునేలా ఇరగదీశాడు. బన్నికి దేశం పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది. ఈ సినిమా కోసం తను పడ్డ కష్టం నాకు తెలుసు. వక్కంతం వంశీ భవిష్యత్‌లో టాప్ డైరెక్టర్ అవుతాడు.గతంలో బన్ని నటించిన 'రేసుగుర్రం' సినిమాకు వంశీగారు రైటర్‌గా పనిచేశారు. ఆ సినిమా కంటే ఎన్నో రెట్లు ఈ సినిమా బావుంటుంది. అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అవుతుంది'' అన్నారు.