pizza
Pelliroju music launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 September 2017
Hyderaba
d

పెళ్లిరోజు అనేది ప్రతివారి జీవితంలోనూ ఎంతో ప్రాధాన్యత వహిస్తుందని, ప్రతివారి జీవితానికి స్ఫూర్తిని, శాంతిని సౌభాగ్యాన్ని అందించే శక్తి అందులో ఉందని తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్. కొణిజేటి రోశయ్య చెప్పారు.

సినీయోగ్ సంస్థ నిర్మించిన పెళ్లిరోజు చిత్రం పాటల ఆవిష్కరణ సోమవారం నాడు హైదరాబాదులో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రోశయ్య మాట్లాడుతూ ఇప్పుడు తెలుగు సినిమాలకు పెడుతున్న పేర్లు వినాలంటేనే ఎబ్బెట్టుగా ఉంటుందని, తెలుగుతనాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయని అంటూ, ఈ చిత్రానికి పెళ్లిరోజు అని పేరు పెట్టడం తనకెంతో నచ్చిందని చెప్పారు. ఒకప్పుడు తెలుగు సినిమాలను బాగా చూసేవాణ్ణని, విలువలతో కూడుకున్న ఆ సినిమాల ప్రభావం సమాజం మీద కూడా ఉండేదని చెప్పారు.

ఈ పెళ్లిరోజు సినిమా విడుదలై విజయవంతంగా నడవాలని తాను ఆకాంక్షిస్తున్నానని, మళ్లీ ఈ చిత్ర విజయోత్సవంలో పాల్గొనాలని అభిలషిస్తున్నానని చెప్పారు. పెళ్లి రోజు చిత్ర ఆడియోను రోశయ్య ఆవిష్కరించారు.

కళాభారతి శ్రీమతి జమున ప్రత్యేక అతిథిగా విచ్చేసి, ఈ చిత్ర లోగోను ఆవిష్కరించారు. జమున మాట్లాడుతూ దాదాపు యాభై సంవత్సరాల క్రితం తాను పెళ్లిరోజు అనే చిత్రంలో నటించానని, అందులో పెళ్ళివారమండీ.. ఆడ పెళ్ళివారమండీ.. అనే పాటను గానం చేసినట్టు చెప్పారు. నేను మళ్లీ ఇన్ని సంవత్సరాల తరువాత పెళ్లిరోజు అనే చిత్రాన్ని సురేష్, ప్రవీణ్ నిర్మించారని తెలుసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చానని చెప్పారు.

నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఈనాటి సమాజంలో పెళ్లికోసం తాపత్రయపడే యువతుల జీవితాలను ఆధారంగా చేసుకొని తీసిన ఈ సినిమాలోని పాటలు అర్థవంతంగా ఉన్నాయని, సంగీత దర్శకుడు చక్కటి బాణీలను అందించాడని చెప్పారు.

దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ మాట్లాడుతూ తమిళంలో తాను దర్శకత్వం వహించిన తొలిచిత్రమని, తమిళ ప్రేక్షకులు బాగా ఆదరించారని, కొన్ని మార్పులతో తెలుగులో విడుదల చేస్తున్నామని చెప్పారు. నేటి యువతీ యువకుల మనస్తత్వాలకు, భావాలకు ఈ చిత్రం అద్దం పడుతుందని, పెళ్లి కోసం ఆరాటపడే ముగ్గురు యువతుల మధ్యన జరిగే కథే ఈ పెళ్ళిరోజని చెప్పారు. తెలుగులో కూడా ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం తమకుందని అన్నారు.

సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ మాట్లాడుతూ సంగీత దర్శకుడిగా ఇది తనకు మూడవ చిత్రమని, ఈ చిత్రంలోని పాటలన్ని సందర్భోచితంగా ఉంటాయని, ఇప్పటికే పాటలు బాగున్నాయని అందరూ అనడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు.

హీరోయిన్ మియా జార్జ్ మాట్లాడుతూ పెళ్లిరోజు చిత్రంలో తాను ఓ చక్కటి పాత్రలో నటించానని, తెలుగులో తాను ఉంగరాల రాంబాబు చిత్రంలో నటించానని చెప్పారు. పెళ్లిరోజు విడుదల తరువాత తనకు తెలుగులో అవకాశాలు ఎక్కువగా వస్తాయని చెప్పింది.

మరో హీరోయిన్ రిత్విక మాట్లాడుతూ పెళ్లిరోజు సినిమా తమిళంలో సంచలన విజయం సాధించిందని తెలుగులో కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నానని చెప్పింది.

నిర్మాతలు బల్లా సురేష్, మృదుల మంగిశెట్టి, ప్రవీణ్ మంగిశెట్టి మాట్లాడుతూ తెలుగులో తాము రూపొందించిన ఈ చిత్రం యువతరానికి బాగా నచ్చుతుందని, చక్కటి కథతో రూపొందిన చిత్రమని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మాటల రచయిత : వెంకట్ మల్లూరి, సహా నిర్మాత : వినయ్ తదితరులు పాల్గొన్నారు. థింక్ మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి.

ఇందు వ్యాఖ్యానంతో సభ ఆద్యంతం చక్కగా సాగింది.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved