18 December 2016
Hyderabad
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'శతమానంభవతి`. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం(డిసెంబర్18న) హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో జరిగింది. మొదటి సాంగ్‌ను మిక్కి జె.మేయర్, టెక్నిషియన్ కృష్ణ, రెండవ సాంగ్‌ను అమలాపురం భాస్కర్, ఇల్లపూర్ కృష్ణంరాజు, మూడో సాంగ్‌ను శేఖర్ కమ్ముల, నాలుగో సాంగ్‌ను వంశీ పైడిపల్లి తదితరులు విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, జయసుధ, ఇంద్రజ, శేఖర్ కమ్ముల, శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, వంశీ పైడిపల్లి, డైరెక్టర్ సతీష్ వేగేశ్న తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ ఫైనాన్సియర్ సత్య రంగయ్య, ఆయన కుమారుడు ప్రసాద్, మనవడు రంగ యశ్వంత్ బిగ్ సీడీసీడీని విడుదల చేశారు. ఆడియో సీడీలను సత్య రంగయ్య విడుదల చేసి తొలి సీడీని మిక్కి జె.మేయర్‌కు అందించారు. ఈ సందర్భంగా...
మిక్కి జె.మేయర్ మాట్లాడుతూ - ``దిల్‌రాజుగారి బ్యానర్‌లో `శతమానం భవతి` సినిమా చేయడం ఆనందంగా ఉంది. సెన్సిటివ్ మూవీ. అమెరికాలోని ఉండే తెలుగువారితో పాటు తాత తండ్రులు, మనవళ్లందరూ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. మంచి సాహిత్యం కుదిరింది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
రాజ్‌తరుణ్ మాట్లాడుతూ - ``బ్యూటీఫుల్ టైటిల్. కథ నాకు తెలుసు. శర్వానంద్ ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. తనకు ఈ సినిమాతో మరో సక్సెస్ వస్తుంది. అనుపమ పరమేశ్వరన్ బెస్ట్ నటి. మిక్కి జె.మేయర్ చాలా మంచి సంగీతానందించారు. సినిమాలో చిన్న చిన్న ఎమోషన్స్‌కు కూడా ఈ సినిమాలో మంచి విలువలు ఉంటాయి. సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది`` అన్నారు.
సతీష్ వేగేశ్న మాట్లాడుతూ - ``మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ ఈ పదాలను మనం చిన్నప్పుడు నేర్చుకునే ఉంటాం. అయితే వీటి అర్థాలను పూర్తిగా తెలుసుకునేటప్పటికీ మనం తల్లిదండ్రులకు దూరంగా ఉంటాం. ఇలాంటి ఓ ఆలోచన నుండి పుట్టిన కథే మా `శతమానంభవతి`. మంచి కథలు తెలుగు ఇండస్ట్రీలో లేవా అని అనేవాళ్లు చాలా మంచి ఉన్నారు. అయితే ఓ మంచి కథను రాసుకుంటే ఆ కథను నా కంటే ఎక్కువగా నమ్మి, ఒకటిన్నర సంవత్సరం పాటు ట్రావెల్ చేసి సినిమా చేసిన వ్యక్తి దిల్‌రాజుగారు. ఈ సినిమాకు శతమానం భవతి అనే టైటిల్‌ను కూడా ఆయనే పెట్టారు. ఇక శర్వానంద్‌గారికి కథ చెప్పడానికి వెళ్లినప్పుడు సతీష్‌గారు కథ విని నచ్చితేనే చేస్తానని అన్నారు. ముందు భయపడ్డాను కానీ కథ వినగానే చేస్తానని అన్నారు. 49 రోజుల్లో సినిమాను ఐదు పాటలతో సహా సినిమాను పూర్తి చేశాం. ఇంత తర్వగా సినిమాను పూర్తి చేయడానికి కారణం నా టీమ్. ప్రకాష్‌రాజ్, జయసుధ వంటి నటీనటులను డైరెక్ట్ చేసే అవకాశం కలిగింది. అలాగే మిగిలిన నటీనటులు, టెక్నిషియన్స్‌కు థాంక్స్`` అన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - ``నేను `ఫిదా` సినిమాను ఈ సినిమాతోనే స్టార్ట్ చేశాను. అయితే ఈ టీం సినిమాను త్వరగా పూర్తి చేసేశారు. శర్వానంద్, అనుపమకు ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి. మిక్కి జె.మేయర్ మంచి మ్యూజిక్ అందించారు. దిల్‌రాజు అండ్ టీంకు అభినందనలు`` అన్నారు.
ఇంద్రజ మాట్లాడుతూ - ``విదేశాల్లో మన తెలుగువాళ్లు ఎక్కువైపోయి అక్కడంతా తెలుగు రాష్ట్రాల్లా తయారయ్యాయి. వీటిని ఆధారంగా చేసుకుని దిల్‌రాజుగారు టైటిల్‌కు తగ్గట్టే చాలా గొప్ప సినిమా చేశారు. విదేశాలకు తమ పిల్లలను పంపి బాధపడే తల్లిందండ్రులు దిల్‌రాజుగారికి థాంక్స్ చెబుతారు. ఇటువంటి కథను ఎంచుకున్న సతీష్‌గారికి, ఈ కథను నమ్మి సినిమా చేసిన దిల్‌రాజుగారికి థాంక్స్`` అన్నారు.
Anupama Parameswaran Glam gallery from the event |
|
|
|
నిఖిల్ మాట్లాడుతూ - ``దిల్‌రాజుగారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఆడియో వేడుక జరగడం ఆనందంగా ఉంది. దిల్‌రాజుగారు ఎంత పెద్ద స్టార్స్‌తో అయినా సినిమాలు తీయగలరు. అంతే కాదు.. చిన్న హీరోలతో కూడా సినిమాలు చేయడమే కాదు. చిన్న సినిమాలకు మంచి హైప్ తీసుకొచ్చే నిర్మాత దిల్ రాజుగారు. శర్వానంద్ మంచి కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు. సంక్రాంతి సమయంలో వచ్చే ఈ సినిమా పెద్ద హిట్ కొడుతుందని భావిస్తూ టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ``తాతగారిగా దిల్‌రాజుగారు జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇది. కాబట్టి `శతమానం భవతి` దిల్‌రాజుగారికి స్పెషల్ మూవీ. ఒక కుటుంబ విలువలను మళ్లీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది దిల్‌రాజుగారే. ఇది ఆయన గురించి గర్వంగా కూడా చెబుతాను. మిక్కి అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. ఇకపై పెళ్లి వేడుకల్లో ఈ సినిమా పాటలే వినపడతాయి. సమీర్‌రెడ్డిగారు బ్యూటీఫుల్ విజువల్స్ అందించారు. శర్వానంద్ నేను డైరెక్టర్ కాకముందు నుండి నాకు పరిచయం. శర్వాను నమ్ముకున్న ప్యాషనే తనను ఈ స్థానంలో నిలబెట్టింది. తనకు `శతమానంభవతి` మరో పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
జయసుధ మాట్లాడుతూ - ``రామానాయుడుగారి నుండి ఎంతో మంది నిర్మాతలను చూశాను. ఈ జనరేషన్‌లో దిల్‌రాజుగారికి సినిమాపై ఉన్నంత ప్యాషన్ మరో నిర్మాత దగ్గర చూడలేదు. ఇప్పటి పరిస్థితుల్లో మన సంస్కృతి సంప్రదాయాలను, కుటుంబ విలువలను మరచిపోకూడదని మంచి మెసేజ్‌లతో కూడా చిత్రాలను చేసే నిర్మాత దిల్‌రాజు అండ్ టీం. నేను ఆయన బ్యానర్‌లో చేసిన సినిమాలన్నీ నాకు చాలా మంచి పేరు తెచ్చాయి. బొమ్మరిల్లు సినిమా అయితే ఓ నటిగా నాకు గుర్తుండిపోతుంది. అలాగే శతమానం భవతి సినిమాకు అలాగే నిలిచిపోతుంది. అందరూ అరిస్టులు, టెక్నిషియన్స్ ఓ ఫ్యామిలీలా కలిసిపోయారు. శర్వానంద్ తన సినిమాల విషయంలో సెలక్టివ్‌గా ఉంటాడని విన్నాను. ఈ సినిమాలో తనతో నటించేటప్పుడు ఆ విషయం నాకు తెలిసింది. ప్రకాష్‌రాజ్‌తో నటించడం గర్వంగా అనిపిస్తుంది. సతీష్ అందరినీ కంఫర్ట్ జోనర్‌లో ఉంచి అందరితో తనకు కావాల్సిన నటనను రాబట్టుకున్నారు. సమీర్ ఫోటోగ్రఫీ అవుట్ స్టాండింగ్‌గా ఉంటుంది. బ్యూటీఫుల్ మూవీ. సంక్రాంతి టైంలో విడుదలవుతున్న ఈ సినిమాకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ - ``నేను ఈ రోజు ఇక్కడ వరకు ట్రావెల్ చేశానంటే అందుకు కారణం మా ఫ్యామిలీ సభ్యులే. సపోర్ట్ చేసిన కాస్ట్యూమ్ కృష్ణ, జయసుధగారికి థాంక్స్. నేను ఈ సినిమాను ఎంత ప్యాషన్‌గా తీసుకున్నానో, సినిమాలో పనిచేసి ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నిషియన్ అంతే ప్యాషన్‌గా తీసుకోవడం వల్ల సినిమా చాలా త్వరగా పూర్తయ్యింది. సతీష్‌కు ఈ కథ ఐడియాకు వచ్చినప్పుడు నాకు చెప్పాడు. మనమైనా, మన తల్లిదండ్రులైనా, లేదా మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు పల్లెటూరు నుండి వచ్చినవారే. ఈ ఫాస్ట్‌లైఫ్‌లో పడి మనం చాలా ఎమోషన్స్‌ను మిస్ అయిపోతున్నాం. అందుకే ఈ మూడు జనరేషన్స్ మధ్య జరిగే కథ అని తెలియగానే ఎగ్జయిట్ అయ్యాను. మంచి సినిమాను నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ సతీష్‌కు థాంక్స్. ఈ సినిమాకు ముందు సాయిధరమ్‌తేజ్, తర్వాత రాజ్‌తరుణ్ అని కొన్ని రోజుల అనుకున్నాం. రకరకాలుగా అనుకున్నాం కానీ డేట్స్ లేవు. సినిమా ఏమో సంక్రాంతికి విడుదల కావాలి. అయితే శర్వానంద్ మరో సినిమా చేయకుండా మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాడు. నాకు, శర్వాకు మధ్య పన్నెండేళ్ల క్రితం నుండి మంచి రిలేషన్ ఉంది. అందువల్ల ఈ కథకు శర్వానంద్ అయితే సరిపోతాడనిపించి నేను యు.ఎస్ వెళ్లినప్పుడు శర్వానంద్ యు.ఎస్‌లోనే ఉన్నాడు. అయితే నేను ఫోన్‌లోనే తనకు పదిహేను నిమిషాల పాటు కథ చెప్పాను. కథ నచ్చింది కానీ ఫ్యామిలీ స్టోరీ కదా..పూర్తి కథ వింటానని అన్నాడు. దిల్‌రాజన్న కోసం కథ వినాలకున్నట్లు ముందు డైరెక్టర్ చెబితే కథ విన్నాడు. కథ విన్నాను.., కథ సూపర్బ్‌గా ఉంది నేను సినిమా చేస్తానని అన్నాడు. అలా అందరినీ సెలక్ట్ చేసుకుని సినిమాను పూర్తి చేశాం. మిక్కి ఎక్సలెంట్ మ్యూజిక్ అందించాడు. రామజోగయ్యశాస్త్రి, శ్రీమణిగారు చాలా మంచి సాహిత్యానందించారు. కొత్త సినిమా అని చెప్పను కానీ..ప్రతి మూమెంట్ బ్యూటీఫుల్‌గా ఉంటుంది. పల్లెటూర్లో పుట్టిన ప్రతివారు ఒకసారి వెనక్కి వెళతారు. మన స్మృతులను గుర్తు చేసుకునేలా సినిమా రూపొందింది. సంక్రాంతికి సినిమాను అందిస్తున్నాం. మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం`` అన్నారు.
నటీ నటులు :
శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్ , ప్రకాష్ రాజ్ , జయసుధ , ఇంద్రజ , శివాజీ రాజా , ప్రవీణ్ , సిజ్జు , శ్రీ రాం , మధురిమ , నీల్యా , ప్రమోదిని, మహేష్ , భద్రం , హిమజ , ప్రభు తదితరులు
సాంకేతిక నిపుణులు :
ఛాయాగ్రహణం – సమీర్ రెడ్డి
సంగీతం - మిక్కీ జె. మేయర్
సాహిత్యం - శ్రీ సీతారామశాస్త్రి , రామజోగయ్య శాస్త్రి
కూర్పు - మధు
కళా దర్శకుడు – రమణ వంక
కథ - కథనం –మాటలు-దర్శకత్వం - వేగేశ్న సతీష్.