27 March 2018
Hyderabad
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు నేడు (మంగళవారం) హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వందలాది మంది అభిమానులు రక్తదానం చేసారు. అనంతరం అభిమానులంతా కలిసి బర్త్ డే కేక్ కట్ చేసి చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, `రంగస్థలం` చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుడు, నిర్మాత సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. అలాగే 100 సార్లు రక్తం దానం చేసిన దాతలందరీకి బహుమతులు అందించారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, `మా కుటుంబంలో ఉన్న ప్రతీ యాక్టర్ పుట్టిన రోజుకి, అలాగే వాళ్ల కుటుంబంలో ఏ శుభసందర్భం వచ్చినా ఆభిమానులంతా ఆ ఎమోషన్ ను రక్తదానం రూపంలో చూపిస్తున్నారు. ఈ సెంటిమెంట్ ను మీలో ఉంచుకుని మాతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అందుకు వాళ్లకు ఎప్పటికీ రుణపడే ఉంటాం. రామ్ చరణ్ ఓ సారి బాంబే లో యాక్టింగ్ కోర్సు ట్రైనింగ్ కి వెళ్లాడు. ఆర్టిస్ట్ కొడుకు ఆర్టిస్ట్ అవ్వాలనేమి లేదు. అలా కొంత మందే అవుతారు. కానీ కోర్స్ పూర్తిచేసి వచ్చిన తర్వాత మాకొక వీడియో చూపించాడు. అది చూసి అతను స్టార్ అవుతాడని ఆరోజే మేమంతా నిర్ణయానికి వచ్చేసాం. తర్వాత అతనితో రెండవ సినిమా `మగధీర` చేసే అవకాశం నా కొచ్చింది. ఆ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిందో మీ అందరికీ తెలుసు. రాజమౌళి గారు ఆ సినిమా చరణ్ తో చేసినందుకు, ఆ అవకాశం చిరంజీవి గారు నాకు ఇచ్చినందుకు ఇద్దరికీ ఈ సందర్భంగా ధన్యవాధాలు తెలుపుతున్నా. ఆ తర్వాత రామ్ చరణ్ కు చాలా హిట్లు వచ్చాయి. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత చరణ్ తో `ధృవ` సినిమా చేశాం. అది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు `రంగస్థలం` తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమాలన్నింటి కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అందులో సందేహం లేదు. నిర్మాత నవీన్ చాలా కాలం నుంచి స్నేహితులు. ఆయన చరణ్ తో మంచి సినిమా చేశారు. పెద్ద విజయం అందుకోబోతున్నారు. చివరిగా మరోసారి చరణ్ కు హ్యాపీ బర్త్ డే` అని అన్నారు.
`రంగస్థలం` నిర్మాతలలో ఒకరైన నిర్మాత నవీన్ మాట్లాడుతూ, ` ముందుగా రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్ డే . రంగస్థలం సినిమా చాలా బాగా వచ్చింది. చాలా నమ్మకంగా ఉన్నాం. అంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. `మగధీర` తర్వాత చెర్రీ కెరీర్ లో `రంగస్థలం` పెద్ద హిట్ అవుతుంది. ఇందులో రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారు. ఈనెల 30న అందరూ థియేటర్ కు వచ్చి సినిమా చూడాలి` అని అన్నారు.
అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుడు మాట్లాడుతూ, ` మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా దాదాపు 600 మంది అభిమానులు రక్తం దానం చేసారు. వాళ్లందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. 100 సార్లు రక్తదానం చేసిన వారందరికీ అవార్డులను కూడా అందిస్తున్నాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించాం` అని అన్నారు.