pizza
Krishnam Raju Birthday (20 January) press meet
50 ఏళ్ల రెబల్‌ స్టార్‌...
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

20 January 2018
Hyderabad

రౌద్రపూరిత నటకు ప్రతిరూపమై...రెబల్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. 1966లో చిలకా గోరింకా చిత్రంతో మొదలైన ఆయన ప్రస్థానం....దిగ్విజయంగా 50 ఏళ్లకు చేరుకుంది. ఇవాళ కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పాత్రికేయులతో ముచ్చటించారు.

చిలకా గోరింకా చిత్రంలో ఎస్వీ రంగారావు గారితో కలిసి నటించిన సన్నివేశం నా నటనకు తొలి అడుగు. అభినయంలో ఆయన శిఖర సమానుడు. ఎస్వీఆర్‌ అంత నటించానని నేను చెప్పుకుంటే అబద్ధమే అవుతుంది. కానీ ఆయనను అందుకునేందుకు ప్రయత్నించాను. ఆ శిఖరానికి సగం చేరుకున్నాను. చిలకా గోరింకాలో నటించాకే నాలో నటుడు ఉన్నాడనే ఆత్మవిశ్వాసం కలిగింది. మనం నటుడిగా ప్రయత్నించవచ్చు అని అనుకున్నాను. ఆ తర్వాత కొంతకాలం అవకాశాలు రాలేదు. నేనంటే నేనే చిత్రంలో స్టైలిష్‌ విలన్‌గా నటించాను. ఆ చిత్రానికి పేరు రావడంతో ప్రతినాయకుడిగా పదికి పైగా సినిమాలు వచ్చాయి. కానీ అందులో ఒకటీ రెండు చిత్రాలు మాత్రమే ఎంచుకున్నాను. వాటిలోనూ నటనకు అవకాశం ఉండీ...ప్రత్యేకంగా ఉండే వాటికే ప్రాధాన్యమిచ్చాను. కొందరు తమకోసం సినిమాలు చేసుకున్న వాళ్లున్నారు. మరికొందరు తమ కోసం సినిమాలు చేస్తూ పరిశ్రమ అభివృద్ధికి పాటుపడ్డారు. మరికొందరు కేవలం చిత్ర పరిశ్రమ కోసమే సినిమాలు చేశారు. రామ్‌గోపాల్‌ వర్మ లాంటి వాళ్లు తమ కోసం సినిమా చేసుకునేవాళ్లు. ఎంఎస్‌ రాజు లాంటి నిర్మాతలు కేవలం ఇండస్ట్రీ కోసం సినిమాలు రూపొందించారు. మా గోపీకృష్ణ పతాకంపై పరిశ్రమ అభివృద్ధి కోసం ఆలోచిస్తూనే, మా వంతు ప్రయత్నాలు చేశాం.

అందుకే ఎవరున్నా లేకున్నా...మా సంస్థ అలాగే కొనసాగుతోంది. తొలి తరంలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు మంచి కథాబలమున్న చిత్రాలు చేశారు. అప్పుడు మన సినిమా గొప్పగా ఉండేది. ఇక ఆ తర్వాత కొన్నాళ్లు యాక్షన్‌ సినిమాలు వచ్చాయి. వాటిలో పది నిమిషాలకో ఫైట్‌ ఉండేది. ఫైట్‌ ఫైట్‌కు సిగరెట్‌ తాగేందుకు హాల్‌లో నుంచి ప్రేక్షకులు వెళ్లేవారు. అలా కొన్నాళ్లు థియేటర్‌లో సిగరెట్‌ నిషేధించారు. మూసలో వెళ్లే తెలుగు సినిమా దారి మార్చాలని ప్రయత్నం చేశాను. సొంతంగా గోపీకృష్ణ సంస్థ పెట్టడానికి కారణం అదే. కృష్ణవేణి, మనఊరి పాండవులు లాంటి కథలు ఆ కాలంలో చెబితే ఏ నిర్మాత ముందుకొచ్చేవాడు కాదు. కొడుకు ఊరంతా తిరిగితే గర్వంగా చెప్పుకునే తండ్రి...కూతురు సాయంత్రం బయటకెళ్తే కోపంతో ఊగిపోతాడు. అబ్బాయి తప్పు చేస్తున్నాడని తెలిసినా ఏమీ అనడు. కూతురు చేసేది తప్పో ఒప్పో తెలియకున్నా నిందిస్తాడు. ఇది సమాజంలో ఆలోచనా తీరు. కృష్ణవేణి చిత్రాన్ని రూపొందించడం ఆ కాలంలో కత్తి మీద సాము. కానీ మేమా ప్రయత్నం చేశాం. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులకు కూడా ఆ అమ్మాయి చేసిది సరైందా కాదా అనే అనుమానం వస్తుంటుంది. చివరకు ఆమె నిజాయితీ తెలుస్తుంది. మహాభారతం కథను ఒక ఊరికి ఆపాదిస్తూ...మనఊరి పాండవులు సినిమా కథను తయారుచేశారు బాపు రమణ. ఇది వేరే నిర్మాతలకు చెబితే చేయలేము అన్నారట. నాకు చాలా కొత్తగా అనిపించింది. సహజంగా ఉన్నట్లు తోచింది. గోపీకృష్ణ సంస్థలో చేద్దామన్నాను. కేవలం 30 రోజుల్లో సినిమా పూర్తయింది. సినిమా ఘన విజయం సాధించి...పాతిక వారాలు ఆడింది. అలా కొత్తదారిలో మన సినిమాను తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. మన ఊరి పాండవులు లాంటి చిత్రాన్ని విడుదల చేద్దామటే ఇప్పుడు థియేటర్‌లు కూడా ఇవ్వరు అది వేరే విషయం. నా పుట్టిన రోజుతో పాటు 50 ఏళ్ల పండగను కూడా జరపాలని అనుకుంటున్నాం. అందుకే ఈ పుట్టిన రోజుకు అభిమానులను కలవడం లేదు. స్వర్ణోత్సవం సందర్భంలో అందరినీ కలుస్తాను.

30 - 40 ఏళ్లుగా నన్ను అభిమానిస్తున్న వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. వాళ్లకు స్వర్ణోత్సవ వేడుకల్లో సన్మానం చేయాలని అనుకుంటున్నా. మరో రెండు మూడు నెలల్లో ఆ వేడుకను నిర్వహిస్తాము. ఆ సందర్భంలో చిత్ర పరిశ్రమ సన్నిహితులతో ప్రత్యేకంగా సమావేశమవుతాను. బాహుబలి తర్వాత తెలుగు సినిమా ఎల్లలు లేనంతగా ఎదిగింది. హాలీవుడ్‌ చిత్రాలకు పోటీగా విదేశాల్లో వసూళ్లు సాధించింది. బాహుబలి స్ఫూర్తిగా ఎవరైనా సినిమాలు చేయొచ్చు. ఆ సినిమాను చూసి వీళ్లు సినిమా చేస్తారట అని ఎవరూ నిందించవద్దు. గొప్ప చిత్రంతో పోల్చుకుని ప్రయత్నించినప్పుడు అంతా ప్రశంసించాలి, ప్రోత్సహించాలి గానీ నిరుత్సాహపరచవద్దు. అంత చేరువ కాకున్నా... అంత పేరు తెచ్చుకునే అవకాశం ఇతర చిత్రాలకూ లేకపోలేదు. బాహుబలి లాంటి సినిమాలు చేయాలనుకునే వాళ్లకు సాంకేతికంగా సహకరించేందుకు ఓ సంస్థను ప్రారంభించబోతున్నాం. ఇందులో బాలీవుడ్‌లో పేరున్న దర్శకుల నుంచి సాంకేతిక నిపుణులు, పేరున్న సంస్థలు భాగస్వాములుగా ఉంటాయి. ప్రతిష్ఠాత్మక చిత్రాలు చేయాలనుకునేవాళ్లకు సలహాలు, సూచనలు అందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. నేను కృష్ణవేణి సినిమా నిర్మిస్తున్నప్పుడు...మానభంగం చేయాల్సిన సన్నివేశంలో నటీనటులు దూరంగా ఉండాల్సి వచ్చేది. అమ్మాయిని తాకడానికి కూడా అనుమతి లేదు. కేవలం మాటలతోనే అభిప్రాయాలు తెలిపాలి. అలా ఉండేవి సెన్సార్‌ నిబంధనలు. ఇక చారిత్రక చిత్రాల సంగతి వేరు. నేను బొబ్బిలి బ్రహ్మన్న సినిమా చేస్తున్నప్పుడు కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆ పాత్రను మరింత గొప్పగా చేసి చూపించాం కానీ..చరిత్ర గీటు దాటలేదు. చరిత్రను తెరకెక్కించేప్పుడు దర్శకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. దేశమంతా పద్మావతి చిత్రం గురించి చర్చ జరుగుతోంది. రాజపుత్ర మహారాణి వాళ్ల వంశానికి, ఆ ప్రాంతానికి ప్రతీక. ఆమె జీవిత కథతో సినిమా చేస్తున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

interview gallery



ఇక సినిమాకు వ్యతిరేకంగా అల్లర్లు చేసే వాళ్లకు సెన్సార్‌కు సంబంధం లేదు. ఎవరికి నచ్చినట్లు సినిమాలు చేసుకునే అవకాశం అందరికీ ఉంది. అయితే ఎవరేం చేసినా చూసుకునేందుకు సెన్సార్‌ ఉంది. ఆ తర్వాత ఆ సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించుకునే అధికారం ప్రేక్షకులకు ఉంది. అలాంటప్పుడు వర్మ శృంగార చిత్రాలు రూపొందించినా భయపడాల్సింది ఏముంది. ఆయన సంగతి సెన్సార్‌ చూసుకుంటుంది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడటం లేదు అనుకుంటుందట. యూట్యూబ్‌లో అన్ని రకాల వీడియోలు ఉన్నాయి. పిల్లలు కావాల్సింది చూస్తుంటారు. వాళ్లను భయపెట్టడం కాదు వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావాలి. గత ఎన్నికల్లో ఖరగ్‌పూర్‌లో ప్రచారం చేశాను. అక్కడ తెలుగువాళ్లు 30 శాతం ఉన్నారు. నేను వస్తున్నానని తెలిసి అంతా వచ్చారు. మీకేం కావాలి. ఏ అవసరాలు రాబోయో ప్రభుత్వం తీర్చాలి అని అడిగాను. వాళ్లు చెప్పినవి తీరుస్తామని మాటిచ్చాను. చరిత్ర సృష్టిస్తూ ఖరగ్‌పూర్‌లో భాజపా గెలిచింది. అలాగే వారణాసిలోనూ విజయం సాధించాం. రాబోయో ఎన్నికల కోసం నన్ను కర్నాటకతో సహా మరికొన్ని రాష్ట్రాలకు ప్రచార బాధ్యతలు ఇవ్వబోతున్నారు. వాటి గురించి మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది. ఈ సమయంలో సినిమాలకు కొద్ది సమయమే కేటాయించగలను. అయితే నటనకు అవకాశమున్న మంచి పాత్రలు వస్తేనే ఒప్పుకుంటాను. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో చిన్న పాత్ర నాది. కేవలం నాలుగైదు సన్నివేశాలుంటాయి. ఈ చిన్న పాత్రకు నేనెందుకయ్యా అని దర్శకుడిని అడిగితే...సార్‌ పాత్ర చిన్నదే కానీ మీరు నటిస్తే ఆ పాత్రతో కథ మరో స్థాయికి వెళుతుంది అన్నారు. దర్శకుడి మాటలు నచ్చాయి. చేస్తానన్నాను. అలా నన్ను సహజంగా చూపించే పాత్రలు వస్తే ఖచ్చితంగా నటిస్తాను. సాధారణ ఎన్నికల వేడి ఇంకా మొదలవలేదు. తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి అంత బలం లేదు. ఎన్నికలకు నెల రోజుల ముందు కూడా పరిస్థితిలో మార్పు రావొచ్చు. పార్లమెంటు సీట్లు మాత్రం భాజపా గెల్చుకుంటోంది. స్థానిక ఓట్లను మాత్రం ముఖ్యమంత్రి ఎవరు, వాళ్ల పనితీరు ఏంటన్నది ప్రభావితం చేస్తుంటుంది. దేశానికి ప్రధానిగా మరోసారి మోడీ రాబోతున్నారు. సర్వేలు కూడా అదే చెబుతున్నాయి. గతంలో పెళ్లి మాటెత్తితేనే వద్దనేవాడు ప్రభాస్‌. ఇటీవల కాస్త మెత్తబడుతున్నాడు. బాహుబలి తర్వాత చూద్దాం అన్నాడు. ఇప్పుడు సాహో అంటున్నాడు. ఏమైనా పెళ్లి విషయంలో అతని ఆలోచనలో మార్పు వచ్చింది. ప్రభాస్‌ సాహో తదుపరి సినిమా మా సంస్థలో ఉంటుంది. దర్శకులు ఎవరన్నది చెబుతాను.



 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved