4 October 2017
Hyderabad
‘‘తెలుగువారు మరచిపోలేని, మరచిపోకూడని, మరచిపోని గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావుగారు. అటువంటి గొప్ప వ్యక్తిపై ‘మన అక్కినేని’ పేరుతో ఓ చక్కటి ఫొటో బయోగ్రఫీని ప్రముఖ సినీ పరిశోధకుడు సంజయ్ కిషోర్ తీసుకురావడం చాలా సంతోషకరం’’ అని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
మంగళవారం సాయంత్రం విజయవాడలోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో ప్రముఖ సినీ పరిశోధకులు సంజయ్ కిషోర్ రచించి, సేకరించి, రూపొందించిన ‘మన అక్కినేని’ పుస్తక ఆవిష్కరణోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు, గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ప్రత్యేక అతిథులుగా ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఆత్మీయ అతిథులుగా ‘కిమ్స్’ ఛైర్‌పర్సన్ బొల్లినేని కృష్ణయ్య, ప్రముఖ సినీ దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు.
పుస్తకావిష్కరణ అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ– ‘‘అక్కినేనిగారు అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్నీ, వారి జీవితంలో వివిధ పార్శా్వలను చిత్రసమేతంగా మనకు కళ్ళకు కట్టినట్లు ‘మన అక్కినేని’ పుస్తకంలో చూపించారు. çపది కాలాల పాటు, పది తరాల పాటు అక్కినేనిగారు ఎలా నిలిచిపోతారో ఈ పుస్తకం చూస్తే తెలిసిపోతుంది. సంజయ్ కిషోర్‌లోని కళాత్మక క్రియాశీలత, సృజనాత్మకతకు దర్పణం ఈ పుస్తకం. అక్కినేనివారి గొప్పతనాన్నీ, నాటి తెలుగు సినిమా వైభవాన్నీ మనం చూసుకునే అవకాశాన్ని తన అద్భుతమైన కలెక్షన్స్‌తో ఈ పుస్తకం ద్వారా కల్పించిన సంజయ్‌కిషోర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’’ అన్నారు.