07 June 2017
Hyderabad
ఫిల్మ్ క్రిటిక్స్ ఆధ్వర్యంలో బుధవారం దాసరి నారాయణరావుకు సంతాప సభ జరిగింది. పలువురు ఫిల్మ్ జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు.
బి.ఎ.రాజు మాట్లాడుతూ ``ప్రేమాభిషేకం సినిమా నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. ప్రెస్ ని గౌరవిస్తే, వారి ద్వారా ప్రజలను గౌరవించినట్టుగా దాసరి భావించేవారు. ఎందరో ప్రముఖులు చనిపోయినప్పుడు ఆయన ముందుండి అన్నీ పనులు చేశారు. నిత్యం షూటింగ్‌లతో బిజీగా గడిపేవారు దాసరి. ఎప్పుడూ ఆయనతో 20 మంది నిర్మాతలు ఉండేవారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది`` అని అన్నారు.
మడూరి మధు మాట్లాడుతూ ``తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం దాసరి బతికి ఉంటారు. దర్శకుడి కుర్చీకి గౌరవం తెచ్చిన వ్యక్తి ఆయన. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పాదదూళి సోకినా చాలనుకునే చాలా మంది కడసారి చూపుకు రాకపోవడం విచారకరం. ఆయనతో సన్నిహితంగా మెలిగిన ప్రభు ఆధ్వర్యంలో దాసరి బయోపిక్ వస్తే బావుంటుంది. భవిష్యత్తు తరాల వారికి కరదీపిక అవుతుంది`` అని చెప్పారు.
సాయిరమేశ్ మాట్లాడుతూ ``ఆయనకు, నాకూ మధ్య ఉన్నది తండ్రీ కొడుకుల అనుబంధం. ఫిల్మ్ నగర్‌లో గురువుగారి కాంస్య విగ్రహం పెడితే చాలా బావుంటుంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలించాలి`` అని అన్నారు.
సురేశ్‌కొండేటి మాట్లాడుతూ ``నన్ను జర్నలిజం వైపు వెళ్లమని ప్రోత్సహించిన తొలి వ్యక్తి గురువుగారు. నేను ఇచ్చే అవార్డుల్లో ఆయన పేరు మీద ఈ సారి 12 అవార్డులను ఆయా రంగాల్లో నిష్ణాతులకు ఇస్తాను. ఆ తర్వాత ప్రతి ఏటా ఆయన పేరు మీద జీవన సాఫల్య పురస్కారాన్ని అందిస్తాను`` అని తెలిపారు.
పసుపులేటి రామారావు మాట్లాడుతూ ``దాసరిగారి తొలి సినిమాకు ముందు నుంచే ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఆ విశేషాలను క్రోడీకరిస్తూ ఓ పుస్తకాన్ని రాస్తాను`` అని అన్నారు.
వినాయకరావు మాట్లాడుతూ ``సినిమా జర్నలిస్టుల్లో మరెవరెకీ దొరకని అదృష్టం, అవకాశం నాకు కలిగింది. విశ్వవిజేత పేరుతో పుస్తకం రాశాను. ఆ సమయంలో ఆయనతో సన్నిహితంగా మెలిగాను. ఎవరికీ చెప్పని ఎన్నో విషయాలను ఆయన నాతో పంచుకున్నారు`` అని చెప్పారు.
బాలిరెడ్డి మాట్లాడుతూ ``ఎన్టీఆర్, అక్కినేని తర్వాత సినిమా రంగంలో తనదైన ముద్రను అంత బలంగా వేసిన వ్యక్తి ఆయనే`` అని అన్నారు.
బత్తుల ప్రసాద్ మాట్లాడుతూ ``మహానగరం ఈవెనింగ్ డైలీలో చేస్తున్నప్పుడు నన్ను పిలిచి ప్రోత్సహించారు. అంతర్ముఖం పేరుతో తెలుగు సినిమా జర్నలిస్టుల కథలను ప్రచురించినప్పుడు దాసరిగారు స్పందించిన తీరు చాలా గొప్పది`` అని అన్నారు.
రెంటాల జయదేవ మాట్లాడుతూ ``సినిమాలను శ్వాసించి, శాసించిన వ్యక్తి దాసరిగారు. ఆయనకు ట్విట్టర్ల ద్వారా సంతాపాలు చెప్పడం దారుణం. నేరుగా సంతాప సభలను నిర్వహించాలి`` అని తెలిపారు.
ప్రభు మాట్లాడుతూ ``ఆత్మవిశ్వాస ప్రపూర్ణుడు దాసరిగారు. సినిమా రంగంలోని 12 శాఖల్లో ఆయన పాదముద్రలున్నాయి`` అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జగన్, రాంబాబు, శివ, ఆర్డీయస్ ప్రకాశ్, ఓం ప్రకాశ్, పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.