pizza
Sridevi Condolence Meet
శ్రీదేవికి టాలీవుడ్‌ సంస్మరణ సభ
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

4 March 2018
Hyderabad

దక్షిణాదితో పాటు ఉత్తరాది సినిమాలో కూడా నటిగా తనదైన ముద్రను చూపించి 300 సినిమాల్లో నటించి మెప్పించిన నటీమణి శ్రీదేవి. ఇటీవల ప్రమాదవశాతు దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ పరిశ్రమ ఆమెకు సంతాపాన్ని ప్రకటిస్తూ సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి, కృష్ణంరాజు, జయప్రద, జయసుధ, అమల, కోటశ్రీనివాసరావు, కవిత, జీవిత, రాజశేఖర్‌, సి.కల్యాణ్‌, పి.సుశీల, నివేదాథామస్‌, బి.వి.ఎస్‌,ఎన్‌.ప్రసాద్‌, ఉపాసన, పరుచూరి గోపాలకృష్ణ, బాబూ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - ''శ్రీదేవితో నాకు నలబై సంవత్సరాలుగా మంచి పరిచయం ఉంది. అలాంటి వ్యక్తి చనిపోయిందని తెలయగానే నాతో పాటు యావత్‌ భారతదేశం షాక్‌ అయింది. మా అమ్మాయితో చాలా సన్నిహితంగా ఉండేది. మంచి నటే కాదు.. మంచి హ్యుమన్‌ బీయింగ్‌. ఎంతో సరదాగా, సంప్రదాయంగా, నవ్వుతూ ఉండేది. సినీ పరిశ్రమ నుండి ఇంత మంది పెద్దలు వచ్చారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు అమ్మాయి 70 సినిమాలకు పైగా బాలీవుడ్‌లో సినిమాలు చేయడం అంటే మాటలు కాదు. లమ్హే, చాందినీ సినిమాలను నేను, యశ్‌చోప్రాలు నిర్మించాం. మళ్లీ వచ్చే జన్మలో తెలుగు అమ్మాయిగానే పుట్టాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

కృష్ణంరాజు మాట్లాడుతూ - ''సాధారణంగా చచ్చినవారి కళ్లు చారడేసి అంటుంటారు. అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత వారిని ఎక్కువగా పొగుడుతూ ఉంటాం. కానీ శ్రీదేవి కళ్లు బ్రతికుండగానే చారడేసి కళ్లు అమ్మాయి అయింది. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమెతో నాలుగైదు సినిమాలే చేశాను. అద్భుతమైన నటి. కొన్ని క్యారెక్టర్స్‌ను ఆమె తప్ప మరెవరూ చేయలేరనిపించేలా నటించింది. మంచి సంస్కారం ఉన్న నటి. బొబ్బిలి బ్రహ్మాన్న సినిమాను హిందీలో తీసినప్పుడు తనే హీరోయిన్‌గా నటించింది. అడిగిన వెంటనే డేట్స్‌ అడ్జస్ట్‌ చేసి నటించింది. నాతోనే కాదు.. తను నటించిన సినిమాల్లో అందరితో మంచి సహకారాన్ని అందించింది. అన్ని భాషల్లో నటించిన శ్రీదేవిగారు అన్నింటిలో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - ''నేను లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు తను బాలనటిగా నటించిన బడిపంతులు సినిమా చూశాను. తను నటిగా 50 ఏళ్ల అనుభవాన్ని సంపాదించుకున్నప్పటికీ నేను తనను మొదటిసారి చూసిన చిన్నపిల్ల రూపమే మనసులో నిలిచిపోయింది. తనతో 'అనురాగదేవత' సినిమాకు మేం తొలిసారి కలిసి పనిచేశాం. రామానాయుడుగారు ఆమెను చిత్రసీమకు దేవతను చేస్తే.. ఎన్టీఆర్‌గారు అనురాగదేవతను చేశారు. అనుభవ పూర్వకంగా స్వర్ణోత్సవం జరుపుకోవాల్సిన నటి. మళ్లీ ఆవిడ పుట్టి మనకు కనపడాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

జయప్రద మాట్లాడుతూ - ''ఈరోజు మనసులో తెలియని బాధ. శ్రీదేవి నటిగా ప్రతి విషయంలో తనకు తానే పోటీగా నిలబడింది. మేం ఇద్దరం కలిసి తెలుగు, హిందీలో 15 సినిమాలకు పనిచేశాం. ఇద్దరి మధ్య హెల్దీ మధ్య కాంపిటీషన్‌ ఉండేది. తను నిజంగా ఈరోజు మన మధ్య లేదని అంటే నమ్మలేకుండా ఉన్నాను. తను పిల్లల విషయంలో కూడా ఎంతో కేర్‌ తీసుకునేది. జాన్వీని తనంతటి హీరోయిన్‌ను చేయాలనుకునేది.

అమల అక్కినేని మాట్లాడుతూ - ''శ్రీదేవిగారు బ్యూటీఫుల్‌, ఫాబులస్‌ ఆర్టిస్ట్‌. అనుకోకుండా ఆమె మనల్ని విడిచి పెట్టి పోవడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

పి.సుశీల మాట్లాడుతూ - ''దేవలోకం నుండి వచ్చిన సుందరిలాగా మన ముందకు వచ్చి.. మనల్ని మరపించి మళ్లీ తన లోకానికి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. తనకు 8 ఏళ్ల వయసున్నప్పుడు తన కోసం పాట పాడాను. తను హీరోయిన్‌గా నటించిన సినిమాలకు నేను పాటలు పాడాను. మనకు తీపి గుర్తులను మిగిల్చి వెళ్లిపోయారు. ఆమె మనసుకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

జగపతిబాబు మాట్లాడుతూ - ''శ్రీదేవిగారు అమర్‌ రహే. ఆమె కుటుంబానికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

జయసుధ మాట్లాడుతూ - ''శ్రీదేవి మనకు దూరం కావడాన్ని ఆమెతో నటించిన సహనటిగా జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమెతో కలిసి 9-10 సినిమాల్లో నటించాను. చైల్డ్‌ సూపర్‌స్టార్‌గా ఉన్నప్పుడు శ్రీదేవిని చాలాసార్లు చూశాను. తనతో కలిసి హీరోయిన్‌గా కూడా నటించాను. మా ఫ్యామిలీతో తనకు మంచి అనుబంధం ఉండేది. ఆమె మనసుకు శాంతి కలగాలి. ఆమె ఇద్దరి అమ్మాయిలు గొప్ప హీరోయన్స్‌గా పేరు తెచ్చుకుని, వారి తల్లి కోరికను తీరుస్తారని నమ్ముతున్నాను'' అన్నారు.

సి.కల్యాణ్‌ మాట్లాడుతూ - ''శ్రీదేవిగారు చిరస్థాయిగా మన మనస్సుల్లోనే ఉన్నారు. నటిగా ఆమె ఏ రోజు ఏ నిర్మాతను, దర్శకుడిని నొప్పించలేదు. కానీ ఈ ఏడాది మన అందరినీ నొప్పించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బోనీ, జాన్వీ, ఖుషీలు సహా అందరికీ ఆ దేవుడు ఆత్మ స్థైరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

డా.రాజశేఖర్‌ మాట్లాడుతూ - ''శ్రీదేవిగారి మరణవార్త విని చాలా షాక్‌కు గురయ్యాం. ఆమె తండ్రి ఆయ్యప్పన్‌గారితో మా నాన్నకు మంచి అనుబంధం ఉండేది. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఆమె ప్రతి భారతీయుడి కుటుంబంలో భాగమైన నటి. ఆమె కుటుంబానికి ఆ దేవుడు గుండె ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

కోటశ్రీనివాసరావు మాట్లాడుతూ - ''నేను శ్రీదేవిగారితో కలిసి రెండు, మూడు సినిమాల్లో పనిచేశాను. ఆ దేవుడు నటిగా పుట్టించాడు. ఆమె యాబై ఏళ్లు నటించింది. మళ్లీ దేవుడు దగ్గరికే వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ - ``జ‌గ‌దేకవీరుడు అతిలోక సుంద‌రి` స‌హా మ‌రో చిరంజీవి సినిమాలో శ్రీదేవిగారు చిరంజీవిగారితో క‌లిసి న‌టించారు. నాకు స్నేహితుడైన బోనీ క‌పూర్, శ్రీదేవిని పెళ్లి చేసుకున్న కొత్త‌లో వాళ్ల ఇంటికి వెళ్లాను. ఆ స‌మ‌యంలో ఆమె ఇల్లాలిగా చేసిన గౌర‌వం చూసి నేను స్థానువైయ్యాను. ఎందుకంటే ఆమె మ‌న దృష్టిలో ఉన్న స్థాయి వేరు కాబ‌ట్టి. నేను మ‌న‌సులో ఏడ్చాన‌ని అప్పుడు అశ్వ‌నీద‌త్‌గారితో చెప్పాను. ఆమెను మ‌ర‌చిపోలేం. రామ్‌గోపాల్ వ‌ర్మ రాసిన లేఖ ఒక‌టి ఈ మ‌ధ్య చ‌దివాను. అది చ‌దివిన త‌ర్వాత త‌ను మ‌న‌సు ఎంత మెత్త‌నైన‌ది. ఆమె గురించి వ‌ర్మ ఎంత స్ట‌డీ చేశాడోన‌ని నాకు అర్థ‌మైంది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్న త‌ర్వాత.. బోనీ కుంటుంబం వారిని దూరం చేసింది. అందుకు కార‌ణాలు ఏమైనా కావ‌చ్చు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న‌కు ఆ కుటుంబం ద‌గ్గ‌ర కావాల‌ని.. అవుతుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు. కార్య‌క్ర‌మంలో పాల్గొన్నవారు శ్రీదేవికి త‌మ సంతాపాన్ని తెలియ‌జేశారు.

 


 
Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved