మహానటి సావిత్రి జీవిత చరిత్రను `మహానటి` సినిమాగా తెరకెక్కించారు. కీర్తిసురేశ్ టైటిల్ రోల్‌లో నటించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్స్‌పై ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మించారు. మే 9న సినిమా విడుదలైంది. ఈ సినిమాను చూసిన చిరంజీవి దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్‌ను అభినందించారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ``నా అభిమాన నటి సావిత్రిగారు అనే సంగతి అందరికీ తెలిసిందే. `పునాదిరాళ్ళు` సినిమాలో ఆవిడ హీరో తల్లిపాత్రలో నటిస్తే.. నేను హీరో ఫ్రెండ్స్‌లో ఒకడిగా నటించాను. రెండు మూడు సన్నివేశాల్లో ఆమెతో కలిసి నటించే అవకాశం కలిగడం నా అదృష్టం. భవిష్యత్‌లో మీరు మంచి ఆర్టిస్టులుగాఎదగాలని ఆ సినిమా సందర్భంలో నన్ను అప్రిసియేట్ చేయడం ఆనందంగా ఉంది. అలాంటి మహానటిపై ఓ సినిమా తీస్తారు. అది కూడా నా నిర్మాత అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో , ఆయన తనయలు ప్రియాంక్ దత్, స్వప్నదత్ చేయడం ఆనందంగా ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రిగారి బయోపిక్ అనగానే చిన్న మీమాంస ఏర్పడింది. సావిత్రిగారి గురించి ఏం తెలుసు. ఎంత వరకు న్యాయం చేయగలడు అనిపించింది. తను ఆద్యంతం అద్భుతంగా తీశాడు. కళ్లు చెమర్చేలా సినిమా చేశాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా విషయంలో ఎంత మందిని ఎన్ని కలిసి ఎంత సమాచారం సేకరించి ఉంటాడో అర్థం చేసుకున్నాను. ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని,, ఖ్యాతిని పెంచిన దర్శకుడు నాగ్ అశ్విన్ నిలిచాడు. ఎంత మంది ఎంత బాగా చేసినా అగ్ర తాంబూలం నాగ్ అశ్విన్‌దే. సావిత్రిగారిని అవుట్ ఫోకస్‌లో పెట్టి.. మనకు చూపించి మనల్ని ఫీలయ్యాలే చేశారు. అందమైన నటి సావిత్రిగారిని చరమాంకాన్ని చక్కగా తెరకెక్కించారు. తర్వాత కీర్తిసురేశ్ సావిత్రిగారి పాత్రలో జీవించారు. జెమిని గణేశన్ పాత్ర చేసిన దుల్కర్ గారిని అభినందిస్తున్నాను. సావిత్రిగారు, జెమినిగణేశన్‌గారితో సినిమా చేశాను. నాగచైన్య, సమంత, విజయ్ దేవరకొండ వంటి ఎందరో స్టార్స్ పాత్ర చిన్నదా.. పెద్దదా అని చూసుకోకుండా సినిమా ప్రాముఖ్యతను తెలుసుకుని నటించారు. అది అందరూ సావిత్రిగారికి ఇచ్చిన ఘన నివాళిగా భావించాను. ఎన్టీఆర్‌గారితో, మీతో ఎన్నో కమర్షియల్ హిట్ మూవీస్ చేశాను. కానీ పూర్ణోదయ మూవీస్ తరహా క్లాసిక్ మూవీ చేయలేకపోయానని అనేవారు. ఈ `మహానటి` సినిమా ద్వారా అమ్మాయిలు ప్రియాంక, స్వప్నలు తండ్రికి ఉన్న ఆలోటును కూడా తీర్చి మంచి బహుమతిని అందించారు. నాగ్ అశ్విన్‌గారి వంటి టెక్నిషియన్స్ ఇండస్ట్రీలో ఉండాలి. ఇలాంటి సినిమా వల్ల మంచి అవార్డ్స్ కూడా వస్తాయి. మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదలైంది. అప్పుడు అదే రోజున ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్, ప్రియాంక, స్వప్న దత్‌లను అభినందిస్తున్నాను`` అన్నారు.