ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా జయప్రద ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'శరభ'. యన్.నరసింహారావు దర్శకుడు. అశ్వనికుమార్ సహాదేవ్ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ..
చిరంజీవి మాట్లాడుతూ - ''కొన్ని రోజుల క్రితం జయప్రద వచ్చి ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేయాలని కోరారు. నేను ఈ మధ్య బయటకు పెద్దగా రావడం లేదని తనకు చెబితే మా ఇంట్లోనే ఈ ఫస్ట్‌లుక్, టీజర్ విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జయప్రద నన్ను కలిసిన సందర్భంలో ఈ శరభ సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్‌ను చూశాను. నాకు చాలా బాగా నచ్చాయి. జయప్రద, ఆకాష్ నటన అద్భుతంగా ఉంది. డైరెక్టర్ నరసింహారావు ఆషామాషీ సినిమాను తెరకెక్కించలేదని అర్థమైంది. ఇదొక సోషియో ఫాంటసీ మూవీ. దేవుడు, దెయ్యం, మనిషి మధ్య జరిగే కథ. నేను చేసిన సినిమాలతో పోల్చాలంటే జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీలా ఉంటుంది. జయప్రద నటన చూసి ఎగ్జయిట్ అయ్యాను. తను గర్భం ధరించి పిల్లవాడిని కనే సమయంలో దెయ్యం ఆ బిడ్డను చంపాలనుకునే సందర్భంతో పాటు పిల్లవాడు పుట్టిన తర్వాత దెయ్యం జయప్రదను అవహించి బిడ్డను చంపేయాలనుకున్నప్పుడు జయప్రద పడే తపన అంతా చూసి గగ్గుర్పొడిచింది. జయప్రద నటన చూసి వావ్ అనకుండా ఉండలేకపోయాను. అలాగే క్లైమాక్స్‌లో ఆకాష్ నరసింహస్వామిగా మారేటప్పుడు తనలో కలిగే మార్పులు, ఆకాష్ నటన చూసి అభినందించకుండా ఉండలేకపోయాను. సినిమా టేకింగ్ చూస్తే దర్శకుడు నరసింహ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని అర్థం అయ్యింది. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ అత్యుత్తమంగా ఉన్నాయి. సినిమా పెద్ద సెన్సేషనల్ హిట్ అవుతుందని నమ్మకంగా చెప్పగలను'' అన్నారు.
జయప్రద మాట్లాడుతూ - ''శరభ చిత్రం కంటే ముందు నాకు చాలా తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చినా మంచి పెర్ఫామెన్స్ ఉన్న రోల్‌ను చేయాలని వెయిట్ చేశాను. అలాంటి సమయంలో దర్శకుడు నరసింహ శరభ కథతో నా దగ్గరకు వచ్చారు. నా రోల్ చాలా బావుంటుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను చిరంజీవిగారు విడుదల చేయడం ఇంకా ఆనందంగా ఉంది. ఆయనకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. హైటెక్నికల్ వేల్యూస్‌తో కూడిన సోషియో ఫాంటసీ మూవీ. ఆకాష్‌కు ఈ సినిమా పెద్ద బ్రేక్ అవుతుంది. మిస్టి, దర్శకుడు నరసింహ, నిర్మాతలు సహా అందరికీ అభినందనలు'' అన్నారు.
సురేష్ కపాడియా మాట్లాడుతూ - ''చిరంజీవిగారు మా సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేసి మా యూనిట్‌ను ఆశీర్వదించినందుకు ఆయనకు నా థాంక్స్. ఇక సినిమా విషయానికి వస్తే శరభ సోషియా ఫాంటసీ మూవీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మంచి చెడుల మధ్య పోరాటమే ఈ చిత్రం. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా ప్రేక్షకులనే కాదు, విమర్శకులకు కూడా నచ్చేలా ఉంటుంది'' అన్నారు.
హీరో ఆకాష్ కుమార్ మాట్లాడుతూ - ఈ శరభ సినిమా నాకొక మంచి అనుభవం. మూడేళ్ల జర్నీ. గొప్ప సినిమా అవుతుందని చెప్పగలను. సినిమా పూర్తయ్యింది. చిరంజీవిగారికి, జయప్రదగారికి థాంక్స్. అమేజింగ్ విజనరీతో తెరకెక్కించిన ఈ సినిమా అందరినీ అలరిస్తుంది'' అన్నారు.
దర్శకుడు ఎన్.నరసింహారావు మాట్లాడుతూ - ''చాలా సంవత్సరాలుగా డైరెక్టర్ కావాలనుకునే నా కల ఈ శరభ సినిమాతో తీరింది. ముఖ్యంగా చిరంజీవిగారు మా సినిమాకు సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. సినిమా గురించి చెప్పాలంటే మంచి చెడుల మధ్య పోరే ఈ సినిమా. రివేంజ్ కూడా ఉంటుంది. పక్కా కమర్షియల్ సోషియో ఫాంటసీ మూవీ. తండ్రి సెంటిమెంట్‌తో పాటు నరసింహస్వామి దైవబలం కూడా ఈ సినిమాలో ఉంటుంది. నన్ను నమ్మి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, హీరో ఆకాష్‌కు థాంక్స్'' అన్నారు.
ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి, డా.జయప్రద, నెపోలియన్, నాజర్, పునీత్ ఇస్సార్, తనికెళ్ళ భరణి, ఎల్.బి.శ్రీరాం, పొన్‌వన్నన్, షాయాజీ షిండే, పృథ్వీ, చరణ్‌దీప్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: కోటి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: రమణ సాల్వ, ఆడియోగ్రఫీ: లక్ష్మీ నారాయణ ఎ.ఎస్, ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నె, పాటలు: వేదవ్యాస్, రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరాం, నిర్మాత: అశ్వని కుమార్ సహదేవ్, రచన, దర్శకత్వం: యన్.నరసింహారావు.