సుమంత్ హీరోగా నటిస్తోన్న 25వ చిత్రం `సుబ్రహ్మణ్యపురం`. టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. ఈషా కథానాయిక. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఆదివారం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నాగచైతన్య క్లాప్‌నిచ్చారు. చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర లోగోను ఎం.పి జె.సి. దివాకర్‌రెడ్డి, రాజశేఖర్, జీవిత సంయుక్తంగా ఆవిష్కరించారు.
సుమంత్ మాట్లాడుతూ ``దర్శకుడు రెండున్నర గంటల పాటు కథ చెప్పారు. వింటున్నంత సేపు సినిమా చూస్తున్నట్టు అనిపించింది. మిస్టరీ థ్రిల్లర్ తరహా చిత్రమిది. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మొదటిసారి ఇలాంటి జోనర్ చిత్రంలో నటిస్తున్నాను. నేను కాస్త భయస్తుడిని. నాకిష్టమైన జోనర్ ఎంతమాత్రం కానప్పటికీ, కథ థ్రిల్లింగ్‌గా అనిపించడంతో ఈ సినిమాను అంగీకరించాను. ప్రతి క్షణం ఉత్కంఠతతో సాగే సినిమా. సాధారణంగా నా సినిమాలకు పెద్దగా హడావిడి చేయడం నాకు నచ్చదు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఆ హంగామా కనిపించింది. ఇది నా 25వ సినిమా కావడం వల్లనే ఇంత హడావిడి చేసినట్టు నిర్మాత చెప్పారు`` అని అన్నారు.
ఈషా మాట్లాడుతూ ``సుమంత్ పని తీరుకు నేను చాలా పెద్ద అభిమానిని. చాలా ప్రత్యేకమైన, వైవిధ్యమైన పాత్రలు చేస్తారాయన. ఈ దర్శకుడు కథ చెప్పినప్పుడు నచ్చింది. నేను కూడా ఈ జోనర్‌లో ఇంతకుముందు నటించలేదు`` అని చెప్పారు.
ధీరజ్ బొగ్గరం మాట్లాడుతూ ``మా హీరోకి ఇది 25వ సినిమా ఇది. మాగ్నస్ సినీ ప్రైమ్ సహకారంతో మా సంస్థ ద్వారా సహకరిస్తున్నాం. సుధాకర్ రెడ్డి మంచి తోడ్పాటునందిస్తున్నారు. తప్పకుండా అన్ని వర్గాల వారికీ చేరువయ్యే సినిమా ఇది`` అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ``మూడు షార్ట్ ఫిలిమ్స్ దర్శకత్వం వహించిన అనుభవం ఉంది. యూట్యూబ్‌లో వాటికి వచ్చిన ఆదరణ చూసి మా నిర్మాత నన్ను పిలిచి కథ చెప్పమన్నారు. అక్కడే ఈ కథ మొదలైంది. సుమంత్‌కి కథని సంక్షిప్తంగా చెప్పాలనే వెళ్లాను. పాటలు పాడకుండా, ఫైట్లు చేయకుండా ప్రతి సీనునూ చెప్పమన్నారు. రెండున్నర గంటలు వివరించాను. అందరికీ నచ్చింది. ఏప్రిల్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం`` అని అన్నారు.
శేఖర్ చంద్ర మాట్లాడుతూ ``నా ఫేవరేట్ జోనర్ చిత్రమిది. సంగీతానికి చాలా స్కోప్ ఉన్న చిత్రం. సుమంత్‌గారితో పనిచేయడం ఆనందంగా ఉంది. పరిశ్రమలో నాకు పరిచయమైన తొలి హీరో సుమంత్‌గారు. మా నాన్నగారితో కలిసి `గౌరీ` షూటింగ్‌కి వెళ్లాను. అప్పుడు ఆయన చాలా ఎంకరేజింగ్‌గా మాట్లాడారు. ఇప్పుడు అదే ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్నారు. అప్పటివన్నీ సుమంత్‌గారు గుర్తుచేస్తుంటే ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ అనిపించింది. ఈ సినిమాకు తప్పకుండా మంచి సంగీతాన్నిస్తాను`` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీరం సుధాకర్ రెడ్డి, లక్ష్మీ సిందూజ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.కె.ప్రతాప్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కళ: లక్ష్మీ సిందూజ గ్రంథి, కాస్ట్యూమ్ డిజైనర్: సుమ త్రిపురాన.