నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం గురువారం ఉదయం హైదరాబాద్ రామోజీఫిలిం సిటీలో ప్రారంభమైంది. సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్‌పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా, బి.గోపాల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
దర్శకుడు కె.ఎస్.రవికుమార్ మాట్లాడుతూ - ``18 సంవత్సరాలు తర్వాత తెలుగులో నేను డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. అది కూడా బాలకృష్ణగారితో సినిమా చేయడం ఆనందంగా ఉంది. బాలయ్యగారితో తొలిసారి చేస్తున్న సినిమా. గతంలో రెండు, మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ ఇప్పటికి సినిమా చేసే అవకాశం కలిగింది. నిర్మాత సి.కల్యాణ్, ఆయన తమ్ముడు వెంకటేశ్వరరావుగారు సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా ప్రారంభం కంటే ముందుగానే సినిమా బిగ్ హిట్ అని భావిస్తున్నాను. నాతో ఉన్న టీమ్ బాగా కుదరడంతో పాజిటివ్‌గా కనపడుతుంది. ఎం.రత్నం, రామ్‌ప్రసాద్‌గారు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం ఉంది. రత్నంగారు చెప్పిన కథ నాకు, బాలకృష్ణగారికి, కల్యాణ్‌గారికి బాగా నచ్చడంతో డైరెక్ట్ చేస్తున్నాను`` అన్నారు.
సి.కల్యాణ్ మాట్లాడుతూ - ``బాలకృష్ణగారి 101వ సినిమా ఇదే కావాల్సింది. కానీ రవికుమార్‌గారు బిజీగా ఉండటంతో బాలకృష్ణగారు పూరితో 101వ సినిమా చేస్తున్నారు. పూరి మేకింగ్ బావుంటుంది. కాబట్టి నాకు సంతోషంగానే ఉంది. ఆనంద ప్రసాద్‌గారు కూడా నాకు మంచి మిత్రుడు. బాలకృష్ణగారి 101వ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. 102 సినిమాను మా బ్యానర్‌లో బాలకృష్ణగారితో చేస్తుండటం ఆనందంగా ఉంది. కె.ఎస్.రవికుమార్‌గారి సినిమాలు ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో తెలిసిందే. కె.ఎస్.రవికుమార్‌గారికి 95 శాతం సక్సెస్ ఉంది. ఆయనకు సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదు. ముందు ఏవో కథలు అనుకున్నా, చివరకు గుర్తుండే పోయే సినిమా కావాలనిపించింది. అప్పుడు రత్నం 15 నిమిషాల్లో చెప్పిన కథ బాగా నచ్చడంతో ఆ కథతో సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాం. రవికుమార్‌గారికి లైన్ చెప్పగానే ఆయన కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి రత్నంతో మాట్లాడి కథ విని ఓకే చేశారు. తర్వాత బాలయ్యబాబుగారి దగ్గరకు వెళ్లి కథ చెప్పాం. ఆయనకు కూడా కథ నచ్చింది. సాధారణంగా బాలకృష్ణగారి సినిమా అంటే మాస్‌తో పాటు గుండెను పిండేసే ప్రేమాభిమానాలు, సెంటిమెంట్ ఉండాలి. అలాంటి కోవకు చెందిన కథతో ముందుకెళ్తున్నాం. చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. అల్రెడి రెండు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన చిరంతన్ భట్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడు. మంచి స్కోప్ ఉన్న సినిమా. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా అందరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. ఈ రోజు నుండి ఈ నెలాఖరు వరకు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది. వచ్చే నెల 6 నుండి కుంభకోణంలో షూటింగ్ ఉంటుంది. కుంభకోణం నుండి వచ్చిన తర్వాత వైజాగ్, హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుంది. తర్వాత పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తి చేస్తాం. సంక్రాంతికి బాలకృష్ణగారు ఎలాగైతే సందడి చేస్తారో, అలాగే 2018 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అందుకే ఎక్కడా గ్యాప్‌లు లేకుండా షూటింగ్ ప్లాన్ చేశాం. అన్నింటినీ మించి బాలకృష్ణగారు 101 సినిమా పూర్తయ్యిందో లేదో 102వ సినిమాను యాక్షన్ సీన్‌తో స్టార్ట్ చేశాడు. నయనతారగారు హీరోయిన్‌గా చేస్తున్నారు. అల్రెడి బాలకృష్ణ, నయనతార హిట్ కాంబినేషన్‌లో రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇద్దరూ హ్యాట్రిక్ హిట్ కొడతారు. కథ విన్న నయనతారగారు నటించడానికి ఓకే చెప్పారు. ఈ సినిమాకు అన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ కనపడుతున్నాయి. మా బ్యానర్‌లో బాలకృష్ణగారితో హిట్‌లోకి తీసుకెళుతుందని భావిస్తున్నాను. అలాగే ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. వారెవరనేది త్వరలోనే తెలుస్తుంది. ప్రకాష్ రాజ్‌గారు చాలా గొప్ప క్యారెక్టర్ చేస్తున్నారు. ఇంకా అశుతోష్ రాణా, అథర్ చీమా పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. అలాగే బ్రహ్మానందం ఎంటర్‌టైనింగ్ రోల్ చేస్తున్నారు`` అన్నారు.
రైటర్ రత్నం మాట్లాడుతూ - బాలకృష్ణగారికి, కల్యాణ్‌గారికి, రవికుమార్‌గారికి థాంక్స్. బాలకృష్ణగారు నన్ను పిలిచి మంచి కథ కావాలన్నారు. ముందు ఎన్నో కథలు అనుకున్నాం. కానీ చివరకు నేను ఇరవై నిమిషాలు చెప్పిన కథ నచ్చింది. రవికుమార్‌గారు కథ వినగానే ఫీల్ అయ్యారు. డెఫనెట్‌గా ఇది బాలయ్యకు హిట్ అవుతుందని రవికుమార్‌గారు ఫీల్ అయ్యారు. ఈ సినిమా రేంజ్ ఏంటో తెలుస్తుంది. అద్భుతమైన సినిమా అవుతుందని నమ్ముతున్నాను`` అన్నారు.