28 ఏళ్ల క్రితం అక్కినేని నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన `శివ` చిత్రం ఎంతటి సెన్సేషనల్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అంతం, గోవిందా గోవింద చిత్రాలు తర్వాత నాలుగో చిత్రం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కొత్త చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కంపెనీ నిర్మాణంలో రామ్‌గోపాల్ వర్మ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందనుంది. రామ్‌గోపాల్ వర్మ తల్లి సూర్యమ్మ స్టార్ట్ అనగానే ముహుర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. అనంతరం...
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ - ``నేను నటిస్తానని కొందరు అనుకుంటారు..మరికొందరేమో నేను కోల్డ్ బ్లల్డ్ మర్డరర్ అని అనుకుంటారు. ఆ రెండింటిలోనూ కాస్త నిజముంది. నా తొలి సినిమా శివకు క్లాప్ కొట్టినప్పుడు మా నాన్నగారు ఉన్నారు. ఇప్పుడు మా అమ్మగారు వచ్చి సినిమాను స్టార్ట్ చేశారు. ప్రపంచంలో ఎన్నో జీవులు పుడుతుంటాయి. అలా పుట్టుకకు ఏదో ఒక ఉద్దేశం ఉండాలి. అమ్మనాన్న నాకు జన్మనిస్తే అన్నపూర్ణ స్టూడియోస్ నాకు దర్శకుడిగా జన్మనిచ్చింది. నా ఇంట్లో కంటే ఇక్కడే నేను కంఫర్ట్‌గా ఉంటాను. వెంకట్, సురేంద్ర నేను ఏమీ కానీ రోజుల్లో నన్ను నమ్మారు. అప్పట్లో అనుభవం లేనివారికి సినిమా ఇవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు. నేను దేవుణ్ణి నమ్మను. కానీ నాగార్జునను నమ్ముతాను. ఎందుకంటే నాకు తను బ్రేక్ ఇచ్చాడు. నేను ఏం చేస్తానో, ఎలా చేస్తానో కూడా తెలియకుండా అవకాశం ఇచ్చాడు. నా సిన్సియారిటీ, నిజాయితీ నచ్చడంతో తను నాకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు చేయబోయే కథలో చాలా వేరియేషన్స్‌తో ఉంటాయి. ఈ మధ్య ఓ కథ ఆలోచనకు రాగానే, నాగార్జునకు వచ్చి ఈ కథను వినిపించాను. తనకు బాగా నచ్చింది. తన రియాక్షన్ వల్ల నాపై నాకు ఇంకా నమ్మకం పెరిగింది. నావెల్టీ ఉన్న కథ ఇది. వర్మకు మైండ్ దోబ్బింది. వర్మకు జ్యూస్ అయిపోయిందని అందరూ అంటున్నారు. మైండ్ దోబ్బిందనే మాట వాస్తవమే, కానీ జ్యూస్ ఇంకా అయిపోలేదు. ఈ సినిమాతో నేనెంటో ప్రూవ్ చేస్తాను`` అన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ -``నాకు మైండ్ బాగానే ఉంది. ఈరోజు నాలుగు గంటలకే లేచాను. షూటింగ్‌కి ఎప్పుడెప్పుడు వెళదామా అని అనిపించింది. మూవీ హిట్ అవుతుందా? లేదా? అని నేను రాము ఎప్పుడూ సినిమాలు చేయలేదు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకంతో సినిమాలు చేస్తూ వచ్చాం. ఇక్కడకొచ్చినప్పటి నుండి నా శివ నాటి జ్ఞాపకాలు మెదులుతున్నాయి. ఆ సినిమా షూటింగ్ చేసేటప్పటికీ నాకు 28 ఏళ్లు. అప్పట్లో నాన్నగారు 28 ఏళ్లు వస్తే, ఏ వ్యక్తికైనా పరిపూర్ణత వస్తుందని అన్నారు. అలాగే ఆ ఈరోజు రామువాళ్ల అమ్మగారిని చూడగానే నాకు మా అమ్మగారు గుర్తుకు వచ్చారు. రాము వాళ్ల పెద్దమ్మ ఝాన్సమ్మ నన్ను ఎత్తుకుని తిరిగిన వ్యక్తి. ఆ ఆత్మీయత అంతా ఇక్కడ ఈరోజు కనపడుతుంది. మేం పుట్టిన తర్వాత స్టార్స్ కాలేదు. స్టార్స్ అయ్యాకే పుట్టాం. మా అనుబంధం ఎలా యూనిక్‌గా ఉంటుందో, ఈ సినిమా కూడా అంతే యూనిక్‌గా ఉంటుంది. ఒక వ్యక్తి ఓ విషయాన్ని నమ్మితే దాని కోసం ఎంత వరకైనా తెగిస్తాడు. అనే పాయింట్‌తో చేసిన సినిమా ఇది. ఇంకా రాములో ఉన్న ప్యాషన్ చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. ఈ నెల 10 రోజుల పాటు షూటింగ్ చేసి తర్వాత అఖిల్ సినిమా సంబంధించిన విషయాలు చూడాల్సి ఉన్నాయి. డిసెంబర్ 22 తర్వాత ఈ సినిమాపైనే పూర్తి ఫోకస్ పెడతాను. శివ టెక్నికల్‌గా ఓ స్టాండర్డ్‌లో ఉంటుంది. దాన్ని మించి ఈ సినిమా ఉండాలని నేను వర్మతో అంటే..అలాగేనని వర్మ నాకు మాట ఇచ్చాడు. తెలుగులోనే కాదు..ఇండియన్ సినిమాలో కూడా కొత్త తరహా మూవీ అవుతుంది. నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు త్వరలోనే చెబుదాం`` అన్నారు.