నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా కొత్త చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ కూకట్పల్లి తులసీవనంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగాయి. తొలి సన్నివేశానికి ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ కొట్టగా, నందమూరి రామకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా...
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ - ``ఆధ్యాత్మిక చింతన ఉన్న వి.ఆనంద్ ప్రసాద్‌గారి నిర్మాణంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరూ నా 101వ సినిమా ఏదై ఉంటుందని ఎదురుచూస్తున్న తరుణంలో ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా రూపొందుతోంది. అభిమానులు, ప్రేక్షకులు కోరుకునేలా సినిమా ఉంటుంది. త్వరలోనే మిగతా ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ వివరాలు తెలియజేస్తాం``అన్నారు.
వి.ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ - ``మా బ్యానర్లో ప్రొడక్షన్ నెం.8గా నందమూరి బాలకృష్ణగారు హీరోగా, పూరిగారి దర్శకత్వంలో సినిమా చేయడం ఎంతో హ్యాపీగా ఉంది. మా బ్యానర్‌కు క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఈ నెల 16 నుండి ఏకధాటిగా షూటింగ్ చేస్తాం. సెప్టెంబర్ 29న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పూజా కార్యక్రమాలు జరుపుకోవడానికి ముందుగానే విడుదల తేదీని ప్రకటించడం మంచి పరిణామమని అందరూ అంటున్నారు`` అన్నారు.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - ``ఎన్నాళ్ళుగానో వెయిట్ చేస్తున్న తరుణమిది. ఎప్పటి నుండో బాలకృష్ణగారితో ఎప్పటి నుండో సినిమా చేయాలనే లక్ష్యం ఈ సినిమాతో నేరవేరింది. అభిమానులు బాలకృష్ణగారి నుండి ఏ ఎలిమెంట్స్‌ను ఆశిస్తారో, అలా ఆయన బాడీ లాంగ్వేజ్, లుక్ ఉంటుంది. సినిమా సెప్టెంబర్ 29న దసరా కానుకగా విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించాం. అయితే మంచి ముహుర్తం చూసుకుని రెండు, మూడు రోజులు ముందుగా అయినా విడుదల చేయడానికి మేం సిద్ధంగానే ఉంటాం`` అన్నారు.