జనమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం `ప్రశ్నిస్తా`. గురువారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ఈ సినిమాకు రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.సత్యారెడ్డి నిర్మాత. బి.శేషుబాబు సమర్పిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి జెమిని కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు బాబి (రవీందర్) క్లాప్ కొట్టారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. బి.వి.రెడ్డి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
నిర్మాత మాట్లాడుతూ ``మా సంస్థలో ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు చేశాను. ఇప్పుడు మా అబ్బాయితో ఈ సినిమాను నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. గత రెండేళ్లుగా మా అబ్బాయి నటనకు కావాల్సిన శిక్షణను పొందుతున్నాడు. ఈ చిత్రం మెసేజ్ ఓరియంటెడ్‌గా ఉంటుంది. కమర్షియల్ హంగులు ఉంటాయి. ట్రెండీ డైలాగులు ఉంటాయి. కోటగిరి వెంకటేశ్వరరావుగారు ఎడిటింగ్ చేస్తున్నారు. ప్రేమ్ మంచి సంగీతాన్నిచ్చారు`` అని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ ``నాకు ఈ నిర్మాతతో ఎప్పటి నుంచో పరిచయం. అప్పుడెప్పుడో వాళ్లబ్బాయిని హీరోగా పరిచయం చేయమని అడిగారు. ఇప్పటికీ అదే మాట మీద ఉండి నాతో ఇంట్రడ్యూస్ చేయిస్తున్నారు. ఇప్పటిదాకా పలు జోనర్ల సినిమాలు చేసిన నేను కమర్షియల్ సినిమాలు కూడా చేయగలనని ఈ చిత్రంతో నిరూపిస్తాను.` ప్రశ్నిస్తా` అనే పేరులోనే చాలా అర్థాలున్నాయి. ఏమి ప్రశ్నిస్తామనేది ఆసక్తికరం. ఇవాళ్టి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. పది రోజులు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత పది రోజులు గ్యాప్ తీసుకుంటాం. ఆ తర్వాత మరో 20 రోజులు కూడా అక్కడే షూటింగ్ చేస్తాం. దాసరిగారు ప్రధాన పాత్రగా ఓ సెటైరికల్ కమర్షియల్ చిత్రాన్ని తీద్దామనుకున్నాను. కానీ కుదరలేదు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదాలు నాకు ఉంటాయని నమ్ముతాను`` అని అన్నారు.
సంగీత దర్శకుడు ప్రేమ్ మాట్లాడుతూ ``ఒక పాట రికార్డింగ్ అయింది. మొత్తం ఐదు పాటలున్నాయి.`` అని చెప్పారు.
హీరో మాట్లాడుతూ ``కథ చాలా బావుంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా ఆసక్తికరంగా ఉంటుంది`` అని తెలిపారు.
రచయిత రాజేంద్రకుమార్ మాట్లాడుతూ ``కొత్త కుర్రాడయినా హీరో అన్నీ బాగా నేర్చుకున్నాడు. హీరోయిన్ ఇప్పటికే మా జొన్నలగడ్డ శీను దర్శకత్వంలో నటించింది. బాధ్యతగా ఈ సినిమాను చేస్తున్నాం. అన్ని హంగులున్న సబ్జెక్ట్ ఇది`` అని అన్నారు.