తారా నీలు కార్పొరేషన్ బ్యానర్‌పై అనురాగ్(ఎం.ఎస్.బాబు) స్వీయ దర్శక నిర్మాణంలో కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. అనిల్ నెమలి, మేఘన హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి శ్రీరామ్ క్లాప్ కొట్టగా, భూపతిరాజా కెమెరా స్విచ్చాన్ చేశారు. దాసరి కిరణ్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
దర్శక నిర్మాత అనురాగ్ (ఎం.ఎస్.బాబు) మాట్లాడుతూ - ''ఈ సినిమాకు కథ, మాటలు, సంగీతం, నిర్మాణ, దర్శతక్వ బాధ్యతలను నేనే నిర్వహిస్తున్నాను. దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. ప్రశ్నించేవారే కరువైయ్యారు. అందరూ మొబైల్స్, సోషల్ మీడియాతో బిజీ బిజీగా మారిపోయారు. సమాజంలోని యువత ప్రశ్నిస్తే ఎలా ఉంటుందనే కథాశంతో మా సినిమా తెరకెక్కనుంది. మన దేశాన్ని ఇప్పటి వరకు 500 మంది రాజులు పాలించారు. వారందరూ రైతుల బాగోగులు గురించి పట్టించుకునేవారు. కానీ నేడు అలా లేదు. ప్రతి ఒక్కరూ అప్పుల పాలై ఉన్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, అనిల్ నెమలిని, మేఘనలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాం. హీరోతో పాటు మరో ముగ్గురు కుర్రాళ్లు ఇందులో కీలకంగా ఉంటారు. ఈ నలుగురు కుర్రాళ్లు ఓ బాంబ్ బ్లాస్ట్ నుండి ప్రజలను ఎలా కాపాడరనేదే సినిమా. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మార్చి 25 నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. రెండు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తాం'' అన్నారు.
హీరో అనిల్ నెమలి మాట్లాడుతూ - ''నేను డైరెక్టర్ కావాలనుకున్నాను. రామానాయుడు స్టూడియోలో డిప్లొమో ఇన్ ఫిలిం టెక్నాలజీ కోర్సు చేశాను. అయితే అనురాగ్‌గారికి మా నాన్నతో ఉన్న పరిచయం.. ఆయన చెప్పిన కథ నచ్చడంతో హీరోగా పరిచయం చేస్తున్నారు'' అన్నారు.
హీరోయిన్ మేఘన మాట్లాడుతూ - ''అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్'' అన్నారు.
సురేష్ నెమలి మాట్లాడుతూ - ''గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ తర్వాత అనురాగ్‌గారి దర్శకత్వంలో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది'' అన్నారు.
అనిల్ నెమలి, మేఘన, అలీ, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామకృష్ణ, ఎడిటర్: ఉపేంద్ర, డాన్స్: జానీ మాస్టర్ అండ్ పాల్ మాస్టర్, ఫైట్స్: విజయ్ మాస్టర్, ఆర్ట్: బాబు, కథ, మాటలు, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: అనురాగ్.