శ్రీకార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయనిర్మాణ దర్శకత్వంలో మహేష్ కోడి రూపొందిస్తున్న చిత్రం ది ప్రాంక్. అర్జున్ కల్యాణ్, పూజిత, ఐశ్వర్య, నోయెల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్, డిజిటల్ పోస్టర్ ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. మోషన్ పోస్టర్‌ను దర్శకుడు మారుతి, డిజిటల్ పోస్టర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మొదటి షెడ్యూల్ పూర్తయింది. తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి ప్రాంక్ నేపథ్య సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది.ఎవరినైనా సరదాగా ఆటపట్టించడానికో లేదా భయపెట్టడానికో ప్రాంక్ ఫోన్‌కాల్స్ చేయడం, వీడియోలు రూపొందించడం నేటి ట్రెండ్‌లో సాధారణ విషయమే. తాజాగా ఇదే కాన్సెప్ట్ ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా వుంటుంది. కథ సింగపూర్‌లో మొదలై అనూహ్య మలుపులతో సాగుతుంది. హైదరాబాద్, గోవా, సింగపూర్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం. తెలుగు ప్రేక్షకులకు ఓ నవ్యమైన అనుభూతినందించే చిత్రమవుతుంది అన్నారు. ఈ సినిమాలో థ్రిల్లర్ అంశాలతో పాటు ప్రాంక్ ఆధారంగా నడిచే వినోదం ప్రధానాకర్షణగా వుంటుందని నాయకానాయికలు చెప్పారు. ఓ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, సరికొత్త ప్రయోగంగా ప్రేక్షకాదరణ పొందాలని మారుతి ఆకాంక్షించారు. సబ్జెక్ట్ చాలా కొత్తగా వుందని, ఉన్నత సాంకేతిక విలువలతో సినిమాను తెరకెక్కిస్తున్నారని రాజ్‌కందుకూరి తెలిపారు. పాపులర్ ప్రాంక్ వీడియాల్ని పరిశీలించి ఈ సినిమాకు సంభాషణలు అందించానని రాకేష్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మధుసూదన్ కోట, సంగీతం: అమోఘ్, నిర్మాత-దర్శకత్వం: మహేష్ కోడి.