అనుష్క టైటిల్ పాత్రలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌లో నటించిన చిత్రం `భాగమతి`. అశోక్ దర్శకుడు. వంశీ, ప్రమోద్ నిర్మాతలు. ఈ సినిమా జనవరి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ....
అనుష్క మాట్లాడుతూ - ``యు.వి.క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీలకు థాంక్స్. ఎందుకంటే 2012లో కథ వినగానే నచ్చిందని చెప్పాను. అయితే డేట్స్ లేకపోవడంతో చేయలేనని అన్నా కూడా నా కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశారు. నా హృదయానికి దగ్గరైన సినిమా. అనుష్క సినిమా మాత్రమేనని చెప్పను. ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, ప్రభాస్ శ్రీను, ధనరాజ్, విద్యుల్లేఖ, రవీందర్, తమన్ సహా అందరి సినిమా ఇది. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది`` అన్నారు.
చిత్ర దర్శకుడు అశోక్ మాట్లాడుతూ - ``గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. ఈ రెండు సమాంతరంగా నడుస్తుంటాయి. తను గెలుస్తూ.. తన చుట్టూ ఉన్న వారిని గెలిపిద్దాం అని ఎవరైనా ఆలోచిస్తే .. అతనితో దైవత్వం మొదలైనట్లు. అలాంటి వ్యక్తి ముందు ఈ కథ విన్నారు. ఆ దేవుడు ప్రభాస్‌గారు. ఆయన ఈ కథ విని, ఇక్కడి దాకా నడిపించారు. వంశీ, ప్రమోద్, విక్కిగారు త్రిమూర్తులు. వీళ్లలో ఒకరు నిర్ణయం, ఒకరు నడిపించడం, మరో వ్యక్తి సరిగా నడిపించడం చేశారు. వీరికి సినిమా తీయడం వేలం వెర్రి. చిన్న చిన్న విషయాలను పట్టించుకుని.. సినిమాను బిడ్డలా చూసుకున్నారు. వీరితో ఐదేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాను. ఈ సినిమాకు శ్రమ, మానసిక ఒత్తిడిని తీసుకుని చేశాం. స్వీటీ అంటే అనుభూతి. తను ఒక శక్తి. అరుంధతిగా అనిపిస్తే అరుంధతిగా, సరోజగా అంటే సరోజలా.. రుద్రమదేవిగా అంటే రుద్రమదేవిలా కనపడ్డ అనుష్క ఇప్పుడు భాగమతిగా కనపడబోతున్నారు. ఈ సినిమా కోసం తనెంత స్ట్రెస్ తీసుకున్నారో నాకు తెలుసు. విపరీతమైన డస్ట్‌లో 45 రోజులు ఈ సినిమా చేశారు. ఇందులో టెక్నిషియన్స్ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సినిమాటోగ్రాఫర్స్ మది, మనోజ్ పరమహంస ఇలా అందరూ టెక్నిషియన్స్ క్యారెక్టర్‌లా ఫీలై చేసిన సినిమా ఇది. ఏడాదిన్నర పాటు నాతో పాటు ట్రావెల్ చేశారు. అద్భుతమైన సినిమా రూపొండంలో సహకరించిన అందరికీ థాంక్స్. సినిమా జనవరి 26న విడుదలకానుంది`` అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ``సినిమా నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీలను అభినందిస్తున్నాను. ఈ సినిమా ట్రైలర్‌ను ఫుల్ స్క్రీన్‌పై చూస్తే కాస్త భయమేసింది. ఏడాది పైగా సినిమాను తీస్తున్నారు. అనుష్కకి ఉన్న ఏకైక లక్షణం ఏంటంటే.. చాలా ఓపిక ఉన్న మనిషి. ఇండస్ట్రీలో ఎవరికీ లేదు. ఆ విషయాన్ని అరుంధతితో ప్రూవ్ చేసింది. అరుంధతి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ సినిమా కూడా అంతే పెద్ద హిట్ కావాలని, బొమ్మాళిగా తనకు ఎంత మంచి పేరు వచ్చిందో అంత మంచి పేరు ఈ సినిమాకు కూడా రావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నాని మాట్లాడుతూ - ``రీసెంట్‌గా భాగమతి రీరికార్డింగ్ జరుగుతుంటే.. నాకు బాగా కావాల్సిన వ్యక్తి ఒకరు ఇంటర్వెల్ ఏపిసోడ్ చూసి నాకు ఫోన్ చేసి.. ఇంటర్వెల్ చూస్తుంటే రొమాలు నిక్కబొడుచుకున్నాయని,, ఇలాంటి సినిమాను పెద్ద స్క్రీన్‌పైనే చూడాలని, స్వీటీ ఈ ఏడాది అన్ని అవార్డులను గెలుచుకుంటుందని కూడా చెప్పాడు. సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నాతో పిల్లజమీందార్ చేసిన తర్వాత అందరూ ఆశోక్‌ను పిల్లజమీందార్ అశోక్ అని పిలుస్తున్నారు. రేపు జనవరి 26 తర్వాత అందరూ భాగమతి అశోక్ అని పిలుస్తారు. ఈ ఏడాది మన ఇండస్ట్రీకి సాలిడ్ హిట్ పడలేదు. భాగమతితో సాలిడ్ హిట్ వస్తుంది`` అన్నారు.
మారుతి మాట్లాడుతూ - ``సాధారణంగా నటీనటులు, దర్శకులకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ నిర్మాతలకు అభిమానులుండరు. కానీ యు.వి.క్రియేషన్స్ నిర్మాతలకు అభిమానులుంటారు. వారు తమ సినిమాలను గొప్ప సినిమాలని ఎప్పుడూ చెప్పుకోరు. వారు చేసిన పని మాట్లాడాలని కోరుకుంటారు. ఇంత ప్యాషనేట్ బ్యానర్‌కు ఈ సినిమాతో మరో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ తెచ్చుకున్న కథకు పూర్తిగా న్యాయం చేసే నిర్మాతలు వీరు. ట్రైలర్‌లో చూసింది చాలా తక్కువ.ఈ నెల 26న సినిమా చూస్తే అర్థమవుతుంది. అనుష్క విశ్వరూపాన్ని రేపు థియేటర్‌లో చూస్తారు`` అన్నారు.
మేర్లపాక గాంధీ మాట్లాడుతూ - ``బాగమతి ట్రైలర్, సాంగ్స రిలీజ్ అయిన తర్వాత సినిమా గురించి తక్కువ చెప్పారనిపిస్తుంది. అనుష్క గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆమె కెరీర్‌లో అరుంధతి, బాహుబలి వంటి గొప్ప సినిమాలు చేశారు. ఆ వరుసలో భాగమతి కూడా చేరుతుందని అనుకుంటున్నాను. రవీందర్, తమన్, మది అన్న అందరూ మంచి టెక్నిషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. ఆల్ ది బెస్ట్ టు భాగమతి టీం`` అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు రాధాకృష్ణ, ప్రభాస్ శ్రీను, ధనరాజ్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు.