విశ్వక్‌సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గోమటం, అనీషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది?'. తరుణ్ భాస్కర్ దర్శకుడు. డి.సురేశ్ బాబు నిర్మాత. ఈ సినిమా జూన్ 29న విడుదలవుతుంది. ఈ సందర్బంగా సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కె.టి.ఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియో సీడీలను విడుదల చేశారు. అనంతరం....
కె.టి.ఆర్ మాట్లాడుతూ - ``ప్రతి సోమవారం తెలంగాణ ప్రభుత్వం నుండి హ్యండ్లూమ్ మండే(చేనేత సోమవారం)ను నిర్వహిస్తున్నాం. ఈరోజు సోమవారం. నన్ను తరుణ్ భాస్కర్ ఈ ఫంక్షన్‌కి పిలవగానే `మీ యూనిట్ సభ్యులు చేనేత వస్త్రాలు ధరిస్తేనే నేను వస్తాను` అన్నాను. యూనిట్‌లో కొంత మంది చేనేత దుస్తులు వేసుకోలేదు కానీ.. చాలా మంది చేనేత వస్త్రాలు వేసుకున్నారు. ఈ టైటిల్ వినగానే నేను కొద్దిగా కంగారు పడ్డాను. ఎందుకంటే నేను మున్సిపల్ మినిస్టర్‌ని. వర్షాకాలం వచ్చిందంటే పేపర్స్‌లో ఈ నగరానికి ఏమైంది? అనే హెడ్డింగ్‌తో వార్తలు రాస్తారు. కానీ ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ అని తెలిసింది. పెళ్ళిచూపులు సినిమాను నేను చాలా బాగా ఇష్టపడ్డాను. తరుణ్ భాస్కర్ వాళ్ల ఫ్యామిలీ సభ్యులు నాకు బాగా తెలుసు. సురేశ్‌బాబుగారు నన్ను ఈ సినిమా చూడమని అనగానే రామానాయుడు స్టూడియోకి వెళ్లి సినిమా చూశాను. కొత్త టీం అందరూ ట్రెమెండెస్ జాబ్ చేశారు. సాధారణంగా ఓ సినిమా హిట్ అయిన తర్వాత మరో సినిమాకు స్టార్స్ ఉంటారు. సినిమా వేరేలా ఉంటుంది. కానీ తరుణ్ మళ్లీ కొత్తవాళ్లతోనే సినిమా చేశాడని వినగానే తనేం ఏం చేయబోతున్నాడు? అనిపించింది. నాకు రోడ్ మూవీస్, బడ్డీ కామెడీ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. జిందగీ నా మిలేగా దోబారా, దిల్ చాహతాహై సినిమాల తరహాలో ఈ సినిమా ఉంటుందనిపిస్తుంది. తెలుగు సినిమాలో మార్పు కనపడుతుంది. తరుణ్ భాస్కర్ దాన్ని లీడ్ చేస్తున్నాడు. చాలా మంది యువకులు ఇండస్ట్రీని పెద్దగా మార్చుతున్నారు. అది కూడా మా సమయంలో జరగడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. పెళ్ళిచూపులు కంటే ఈ సినిమా నీకు ఇంకా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. తరుణ్ ఇదే బాటలో కొనసాగుతాడని భావిస్తున్నాను`` అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ - ``తరుణ్‌భాస్కర్ నాకు జూనియర్. హెచ్.బి.ఎస్ నుండి వచ్చిన అందరిలో ఓ గర్వం ఉంటుంది. తరుణ్‌లో నాకు అది కనపడుతుంటుంది. తనంటే నాకు చాలా ఇష్టం. కరెప్ట్ చేసే ఇండస్ట్రీ ఇది. కానీ తరుణ్ కరెప్ట్ కాకుండా ఈ నగరానికి ఏమైంది సినిమాను కొత్తవాళ్లతో చేశాడు. ఈ సినిమాను మా సంస్థ నిర్మించినందుకు ఆనందంగా ఉంది. టీంలో నటించిన అందరికీ అభినందనలు`` అన్నారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ - ``సురేశ్‌బాబుగారు చాలా మంది ఇండిపెండెంట్ ఫిలిమ్‌మేకర్స్‌కి తండ్రిలా మారారు. మా కంటే మోడ్రన్, ముందు చూపున్న వ్యక్తి సురేశ్‌బాబుగారు. ఎలాంటి ఇగోస్ లేవు. ఆయన్నుండి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆయనకు థాంక్స్ చెబితే సరిపోదు. తెలుగు ఆడియెన్స్ మైండ్‌సెట్‌ను మారుస్తున్నారు. సుశాంత్, వెంకటేశ్ కాకమాను, విశ్వసేన్, అభినవ్ గోమటం, అనీషా అంబ్రోస్, సిమ్రాన్ చక్కగా సపోర్ట్ చేశారు. వీరితో కలిసి పనిచేయడం నేను గర్వంగా ఫీలవుతున్నాను. మీరు థియేటర్‌కు వస్తే గోవాట్రిప్ వేసినట్టు అనిపిస్తుంది. నా భార్య లతా తరుణ్, చాలా బాగా పనిచేశారు. సెట్‌లో గొడవలు కూడా పడ్డాను. తను ప్రొడక్షన్ డిజైనర్‌గా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. నా ఎడిటర్ రవితేజ గిరిజాల నాకు మంచి మిత్రుడు. తను చాలా మంచి సినిమాలకు పనిచేశాడు. వివేక్ సాగర్.. నచ్చితే చేస్తా.. లేకుంటే లేదు. అని అంటుంటాడు. తనకు మ్యూజిక్ తప్ప. వేరే లోకం లేదు. ఇళయరాజా, రెహమాన్ గారు మనల్ని ఎలా ఎన్ రిచ్ చేశారో.. నెక్ట్స్ జనరేషన్‌ను వివేక్ ఎన్‌రిచ్ చేస్తున్నారు. అలాగే నాకు సహకారం అందించిన డైరెక్షన్ టీమ్ సహా అందరికీ థాంక్స్`` అన్నారు. ఈ కార్యక్రమంలో డి.సురేశ్‌బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి, మధుర శ్రీధర్, రాజ్ కందుకూరి, అనీషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.