20 November 2017
Hyderabad
ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం `మెంటల్ మదిలో`. రాజ్ కందుకూరి నిర్మాత. వివేక్ ఆత్రేయ దర్శకుడు. డి.సురేశ్‌బాబు సమర్పిస్తున్నారు. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంటగా నటించారు. ఈ సినిమా నవంబర్ 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో...
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ - ''విజయ్‌దేవరకొండగారి నాన్నగారి వల్ల రాజ్ కందుకూరిగారిని కలిశాను. ఈ స్క్రిప్ట్ వినగానే ఆయన నన్ను హగ్ చేసుకోవడంతో నా స్క్రిప్ట్ బావుందని అర్థమైంది. మంచి సినిమా తీశామనే అనుకుంటున్నాను. విష్ణు, నివేదా గురించి సినిమా రిలీజ్ తర్వాత అందరూ మాట్లాడుకుంటారు'' అన్నారు.
నివేదా పేతురాజ్ మాట్లాడుతూ - ''ఇది నా తొలి తెలుగు చిత్రం. అవకాశం ఇచ్చిన రాజ్‌కందుకూరి, వివేక్‌గారికి థాంక్స్. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.
శ్రీవిష్ణు మాట్లాడుతూ - ''యంగ్ టీం కలిసి చేసిన ప్రయత్నం. కథ వినగానే డైరెక్టర్ వయసెంతో అనుకున్నాను. ఇంత యూత్ వయసులోనే, ఇలాంటి సబ్జెక్ట్ చేశాడనిపించింది. రాజ్ కందుకూరిగారు మా టీమ్‌తో కలిసి పోయి సినిమా చేశాడు. సురేష్‌బాబుగారు, సినిమా చూసి సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ..అతనికి, నాకు సొంత అన్నతమ్ముడు కంటే ఎక్కువగా అనుబంధం ఏర్పడింది. నివేదా పేతురాజ్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ సినిమాను చూసిన తర్వాత నాకు పర్సనల్‌గా కలిగిన ఫీలింగ్ ఏంట్రా అంటే..కె.విశ్వనాథ్‌గారి కథను తీసుకుని, ఆ కథకు జంధ్యాగారు మాటలు రాసి చిన్న బడ్జెట్‌తో మణిరత్నంగారు దాన్ని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా హాయిగా అనిపించింది. వివేక్‌కు మంచి భవిష్యత్ ఉంటుంది'' అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి మాట్లాడుతూ - ''బి.టెక్ చదివిన నేను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాననగానే, నాకు స్వేచ్ఛనిచ్చిన నా తల్లిదండ్రులకు థాంక్స్. పెళ్ళిచూపులు వంటి సక్సెస్ తర్వాత నిర్మాతపై ఎంత ప్రెషర్ ఉంటుందో నాకు తెలుసు. అంత ప్రెషర్‌లో కూడా రాజ్ కందుకూరిగారు కొత్తవాళ్లతో సినిమా చేయడానికే ఆసక్తి చూపారు. నేను 'వెళ్ళిపోమాకే' అనే ఇండిపెండెంట్ సినిమా చేశాను. ఆ సినిమా మ్యూజిక్ విన్న రాజ్ కందుకూరిగారు నాకు వెంటనే ఫోన్ చేసి అడ్వాన్స్ ఇచ్చేశారు. వివేక్ ఆత్రేయకు దర్శకుడిగా మంచి టేస్ట్ ఉంది. సురేష్‌బాబుగారు ఈ సినిమాను పెద్ద రేంజ్‌లో విడుదల చేస్తున్నారు, అందుకు ఆయనకు థాంక్స్'' అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ''పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ప్రీమియర్ చూసిన వాళ్లందరూ సినిమా బావుందని అన్నారు. అయితే ప్రేక్షకుల రిజల్ట్ కోసం మూడు రోజులు వెయిట్ చేయాల్సి ఉంది. ఇక సినిమాకు సంబంధించిన విషయంలోకి వెళితే..వివేక్ నన్ను ఓ కాఫీ షాప్‌లో కలిసి ముందు కావ్యం అనే పేరుతో ఓ పొయెటిక్ కథను వినిపిస్తే, అలాంటి కథను నేను చేయలేకపోవచ్చు అని అన్నాను. అప్పుడు అతను కాస్త డిసప్పాయింట్‌తో వెనక్కి వెళ్లిపోయి..వారం తర్వాత మళ్లీ ఫోన్ చేస్తే నేను పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే, తను రెండు, మూడు సార్లు అడగడంతో సరే రమ్మని, కథ విన్నాను. స్పెల్ బౌండ్ అయ్యాను. వెంటనే తనతో సెల్ఫీ దిగి, ఇతనే నా నెక్ట్స్ మూవీ డైరెక్టర్ అని పోస్ట్‌పెట్టాను. తను డైరెక్ట్ చేయడమే కాదు, రెండు పాటలు కూడా రాశాడు. మంచి టీంతో చేసిన సినిమా. తరుణ్ భాస్కర్ తర్వాత వివేక్ ఆత్రేయను మా బ్యానర్‌లో పరిచయం ఆనందంగా ఉంది. ఎక్కడైతే నిజాయితీ ఉన్న అటెంప్ట్ ఉంటుందో అక్కడ ముందుకు వెళ్లగలుగుతాం. అలాంటి సపోర్ట్ చేస్తోన్న వ్యక్తి సురేష్‌బాబుగారికి థాంక్స్. వేదరామన్ సినిమాటోగ్రఫీ, ప్రశాంతి విహారి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతాయి. మంచి కంటెంట్, నిజాయితీ గల అటెంప్ట్ ఉంటే నేను సినిమా చేయడానికి రెడీ. శ్రీవిష్ణు పెద్దగా మాట్లాడేవాడు కాదు. కానీ ఈసినిమాలో చక్కగా నటించాడు. అలాగే నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్'' అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ''అమేజింగ్ మ్యూజిక్. వివేక్ పెళ్ళి చూపులు కంటే, ఓ పొయెటిక్ స్క్రిప్ట్‌తో నా దగ్గరకు వచ్చాడు. తర్వాత నా దగ్గర వేరే స్క్రిప్ట్ కూడా ఉందని మరోసారి చెప్పాడు. అదే మెంటల్ మదిలో స్క్రిప్ట్. వివేక్ ది బెస్ట్ రైటర్. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌లో నేను, శ్రీవిష్ణు కలిసి చిన్న చిన్న పాత్రల్లో నటించాం. తను చేసే సినిమాలు బావుంటాయని వింటూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఈ సినిమా తనకు పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.