అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా పద్మజ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యానర్‌ఫై రూపొందిన చిత్రం `ఒక్కడు మిగిలాడు`. ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాను నవంబర్ 10న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా..
ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ - ``దర్శకుడు అజయ్ నాకు మంచి స్నేహితుడు. తను కన్నడలో విలన్‌గా కూడా నటించాడు. ఆ సినిమాకు నేను మ్యూజిక్ అందించాను. అప్పటి నుండి మా ప్రయాణం మొదలైంది. తను ఈ సినిమాకు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. తనకు మనోజ్ రూపంలో మంచి సపోర్ట్ లభించింది. ఈ సినిమాలో మనోజ్ ఎనర్జిటిక్ రోల్ చేశాడు. మానవీయ విలువలపై తీసిన సినిమా ఇది. తప్పకుండా పెద్ద హిట్ సాధిస్తుంది`` అన్నారు.
ఎన్.శంకర్ మాట్లాడుతూ - ``విజువల్స్ చూస్తుంటే మంచి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. మనోజ్ డిఫరెంట్ సినిమాలు చేస్తాడని తెలుసు కానీ, ఇంత డిఫరెంట్ సినిమా చేస్తాడని అనుకోలేదు. టీజర్‌లో తన పెర్ఫామెన్స్ చూసి థ్రిల్ అయ్యాను. ఒక అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌లో మనోజ్ చాలా చక్కగా నటించాడు`` అన్నాడు.
నారా రోహిత్ మాట్లాడుతూ - ``నాకు మనోజ్ టైటిల్ ఎపిసోడ్ పంపినప్పుడే చాలా ఆనందమేసింది. ఇలాంటి ఓ సినిమాను నమ్మి నిర్మించిన నిర్మాతలకు అభినందనలు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్, కోదండ రామరాజు సినిమాటోగ్రఫీ చాలా బావున్నాయి. మనోజ్ రెండు పాత్రలను అద్భుతమైన వేరియేషన్స్‌తో క్యారీ చేశాడు. ఈ చిత్రం తెలుగు చలన చిత్ర చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
శివ నందిగామ మాట్లాడుతూ - ``దర్శకుడు అజయ్‌గారు ఈ కథను చెప్పగానే ఇదొక అద్భుతమని భావించాను. సినిమా మేకింగ్ తర్వాత, నా నమ్మకం నిజమేనని అర్థమైంది. అద్భుతమైన విజువల్స్ వచ్చాయి. దాన్ని ఎన్‌హెన్స్ చేసేలా రీరికార్డింగ్ చేశాను. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది. సినిమాలో నాలుగు బిట్ సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. కొన్ని సీన్స్‌ను చూడగానే ఎమోషనల్‌గా ఫీలయ్యాను. మనోజ్‌గారి ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫామెన్స్. అజయ్‌గారు తన మాటలతో ఎదుటి వ్యక్తిని కట్టిపడేస్తారు. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
ప్రతాని రామకృష్ణాగౌడ్ మాట్లాడుతూ - ``టీజర్ చూస్తుంటే, మనోజ్‌గారు మోహన్‌బాబుగారి స్టైల్‌లో డైలాగ్స్ చెప్పారని తెలుస్తుంది. ఈ సినిమాతో మనోజ్‌గారు రేంజ్ ఎక్కడికో పెరుగుతుంది. డైరెక్టర్ అజయ్‌గారికి, శివ నందిగాం గారు సహా యూనిట్ సభ్యులకు అభినందనలు`` అన్నారు.
ఆనంద్ శ్రీనివాస్ మాట్లాడుతూ - ``మొదటి నుండి ఎంతో కష్టపడి నటుడిగా ఎదిగాడు మనోజ్. తనలాంటి కమిట్‌మెంట్ ఉన్న నటుడిని నేనెక్కడా చూడలేదు. తనకు, దర్శక నిర్మాలకు, యూనిట్ సభ్యులకు అభినందనలు`` అన్నారు.
అనీషా అంబ్రోస్ మాట్లాడుతూ - ``ఈరోజుల్లో ఇలాంటి సినిమాను చేయడం అంత సులభమైన విషయం కాదు. ఓ డేడికేషన్‌తో ఈ సినిమాను పూర్తి చేసిన దర్శక నిర్మాతలకు అభినందనలు. మనోజ్ వంటి నటుడితో పనిచేయడం ఆనందంగా ఉంది. చాలా ఇన్‌స్పిరేషన్ ఇచ్చాడు. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అవుతుంది. శివగారు మంచి సంగీతాన్ని అందించారు`` అన్నారు.
నిర్మాత ఎస్.ఎన్.రెడ్డి మాట్లాడుతూ - ``ఏడాదికి పైగా ఈసినిమాతో జర్నీ చేస్తున్నాం. మనోజ్‌గారు కొత్తగా నటించారు. సముద్రంలో ఎక్కువ రోజులు షూటింగ్ చేసిన సినిమా ఇదే. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. సినిమాను నవంబర్ 10న విడుదల చేస్తున్నాం`` అన్నారు.
అజయ్ అండ్రూస్ మాట్లాడుతూ - ``సినిమాలో సాంగ్స్ ఎక్కడా ఉండవు. సినిమా ప్రారంభమైనప్పటి నుండి ముగిసే వరకు ఓకే టెంపోలో సినిమా ఉంటుంది. ఇలాంటి జర్నీ గురించి రాసి, సినిమా తీయాలంటే చాలా ఓపిక అవసరం. అదృష్టవశాతూ నాకు ఒక మంచి టీం దొరికింది. ఇలాంటి సినిమా చేయడానికి రెండు పిల్లర్స్ కావాలి. అందులో మొదటి పిల్లర్ మనోజ్‌బాబుగారు ఒకరు. ఆయన అందించిన సపోర్ట్ మరచిపోలేనిది. ఆయనెంతో ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం తెరపై చూస్తే తెలుస్తుంది. వెయిట్ పెరిగారు, మళ్లీ వెయిట్ తగ్గారు. నటించడమే కాదు, అమేజింగ్ యాక్షన్ సీన్‌ను కంపోజ్ చేశారు. పాత్ర లుక్, డైలాగ్ డెలివరీ కోసం ఆయన పడ్డ కష్టం నాకు మాత్రమే తెలుసు. ఎస్.ఎన్.రెడ్డిగారు, లక్ష్మీ కాంత్‌గారు నా కథపై నమ్మకంతో చేసిన సినిమా ఇది. బ్రతకడానికి మనిషి అనేవాడు ఎంత కష్టపడుతున్నాడనే సామాన్యుడి వేదన ఈ సినిమాలో కనపడుతుంది. నా ముత్తాత్త, తాతలు స్వాతంత్ర్య సమరయోధులు. నాన్న, మావయ్యలు ఆర్మీలో పనిచేశారు. అందుకనే ఈ డిఫరెంట్ కంటెంట్‌ను సినిమాగా చేయడానికి రెడీ అయ్యాను`` అన్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ - ``ఈ స్క్రిప్ట్‌కు నేను గౌరవమివ్వాలని, ఒళ్లు దగ్గర పెట్టుకని సినిమా చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాను. సిరియా, ఆఫ్రికా, బంగ్లాదేశ్, కొరియా తదితర దేశాల్లో యుద్ధాలు జరిగినట్టు, బాంబులు పేలినట్లు వార్తలు చూస్తుంటాం. సిరియాలో ఓ చిన్న పాప నీటిలో కొట్టుకుని వచ్చిన ఫోటో చూసినప్పుడు సిరియాలో ఏం జరుగుతుందనే విషయం తెలిసి, ప్రపంచం ఉలిక్కి పడింది. ఓ ఫోటో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే, సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందోననే ఉద్దేశంతో దర్శకుడు ఆలోచించుకుని ఈ సినిమా చేశాడు. యుద్ధంలో రెండు వర్గాలు కొట్టుకునేటప్పుడు , యుద్ధానికి సంబంధం లేని కొన్ని కుటుంబాలు తప్పించుకుపోయే క్రమంలో ఓ పడవ ఎక్కితే..అసలు పడవ కరెక్ట్ దిశలో వెళుతుందా? గమ్యం కరెక్ట్‌గా చేరుకుంటామా? అని ఎవరూ చెప్పలేరు. ఇలాంటి ఓ సన్నివేశాన్ని దర్శకుడు అజయ్‌గారు బ్యూటీఫుల్ ప్లానింగ్‌తో ఫస్టాఫ్‌లో యుద్ధం, సెకండాఫ్‌లో సీ జర్నీ చిత్రీకరించారు. తనకు హ్యాట్సాఫ్. సినిమాను శ్రీలంక బేస్ చేసుకుని తయారు చేసుకున్న కథ కాదు. బాధలోని ప్రతి ఒక్కరి కోసం చేసిన సినిమా. శ్రీలంక అంటే ఒకప్పుడు మన దేశమే. మన అన్నా చెల్లెలే. శ్రీలంక నుండి ఇక్కడకు వస్తే అక్కడి వారని అంటున్నారు. అక్కడికి వెళితే ఇక్కడివారని అంటున్నారు. శరణార్థులని అంటున్నారు. అలాంటి వారికి జరిగినవే..రేపు మనకు కూడా జరగొచ్చు. సినిమాలో రెండు పాత్రల్లో కనపడతాను. ఎవర్నీ కించపరిచే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. ప్రతి ఒక్కరూ బాద్యత తీసుకున్న రోజునే మన దేశం ముందుకెళుతుంది. ఈ సినిమాకు అజయ్‌గారే హీరో. శివ నందిగాం బ్యాగ్రౌండ్ స్కోర్, రామరాజుగారి సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. నిర్మాతలు ఎంతో సహకారం అందించారు`` అన్నారు.
మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రాఫర్: వి.కోదండ రామరాజు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతక్కి.