రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. స్రవంతి రవికిషోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ...
అనుపమ మాట్లాడుతూ ``సినిమా విడుదల కావడానికి ఇంకో రెండు రోజులు మాత్రమే ఉంది. అందరూ సినిమాను తప్పక చూడాలి. ఇందులో నా పాత్ర చాలా బావుంటుంది`` అని అన్నారు.
లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ``ఇందులో మ్యాగీ అనే పాత్ర చేశాను. మోస్ట్ మెమరబుల్ పాత్ర అది`` అని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ ``స్నేహితులకు స్నేహితులనే పరిచయం చేస్తాను ఈ సినిమా ద్వారా. మామూలుగా నేను మిక్సింగ్ థియేటర్లో సినిమాను చూస్తాను. ఈ సినిమాను కూడా అలాగే చూశాను. చాలా బాగా నచ్చింది. మామూలుగా భగవంతుడు జన్మనిచ్చే భాగ్యాన్ని ఆడవారికే ప్రసాదిస్తాడు. కానీ ఓ మంచి సినిమా తీసి మగవాడు కూడా మదర్ కావచ్చని అనిపించింది`` అని చెప్పారు.
రామ్ మాట్లాడుతూ ``నేను ఆడియో వేడుకలో నలుగురి గురించి మాట్లాడటం మర్చిపోయాను. అందులో ముఖ్యంగా చంద్రబోస్ గురించి చెప్పాలి. నా తొలి, రెండో సినిమాకు ఆయన పాటలు రాశారు. ఆయన లిరిక్స్ కోసమే దేవదాసు పాటల్ని ఎన్నో సార్లు వినేవాడిని. ఈ సినిమాలోనూ చాలా మంచి లిరిక్స్ రాశారు. అలాగే నేను సాధారణంగా రాత్రి తొమ్మిది తర్వాత ఎవరికీ ఫోన్ చేయను. అలాంటిది ఈ సినిమాలో శ్రీమణి రాసిన లిరిక్స్ విని అర్థరాత్రి ఫోన్ చేసి మాట్లాడాను. వైజాగ్‌లో వేసిన సెట్‌ను ఆర్ట్ డైరక్టర్ చాలా బాగా వేశారు. సినిమాను ఎవరు ఎంత ప్రేమించి తీసినా నిర్దాక్షిణ్యంగా కట్ చేయాల్సింది ఎడిటరే. ఈ సినిమా ఎడిటర్ ఆ పనిని చాలా చక్కగా చేశారు. ఫ్రెష్‌గా ఉండే చిత్రమిది`` అని అన్నారు.
శ్రీ విష్ణు మాట్లాడుతూ ``సినిమా గురించి టెన్షన్ లేదు. చాలా క్లారిటీగా ఉంది. అద్భుతంగా వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది`` అని తెలిపారు.
చంద్రబోస్ మాట్లాడుతూ ``స్రవంతి సంస్థలో పాట రాయాలన్నది నా 23ఏళ్ల నిరీక్షణ. ఈ సినిమాతో ఆ కోరిక పూర్తయింది`` అని చెప్పారు.
ప్రియదర్శి మాట్లాడుతూ ``ఫ్రెండ్‌షిప్ గురించి నోటితో చెప్పడం కన్నా, ఈ సినిమాలో చూస్తే ఇంకాస్త అర్థమవుతుంది. మా దర్శకుడి తమ్ముడు పేరు సతీష్. ఈ సినిమాలో నా పేరు కూడా అదే. హైదరాబాద్ బిర్యానీ తింటే ఎంత మంచిగా అనిపిస్తుందో, ఈ సినిమా చూస్తే అలాగే ఉంటుంది. 40 రోజులు షూటింగ్ చేశాం. చాలా బాగా అనిపించింది. రామ్ స్టార్ అయినా మాతో బాగా కలిసిపోయాడు`` అని చెప్పారు.
కౌశిక్ మాట్లాడుతూ ``ఈ టీమ్‌తో మరలా పనిచేయాలని ఉంది`` అని అన్నారు.